*రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నారా...లేదా: ఎంపీ కేశినేని* విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలు ఎస్ఈసీ గా ఉన్నారా.. లేదా అనేది స్పష్టం చేయాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. కనగరాజ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిస్తే తప్పులేదు కానీ, రమేష్ కుమార్ సుజనాచౌదరిని, కామినేని శ్రీనివాస్ ను కలిస్తే తప్పా అని కేశినేని నాని ప్రశ్నించారు. వైసీపీ వారికి ఒక నీతి, ఇతరులకు ఒక నీతా అంటూ మండిపడ్డారు. సుజనాచౌదరి తన కార్యాలయాన్ని జూబ్లీహిల్స్ నుంచి హయ్యత్ హోటల్ కు మార్చుకున్నారని, హయ్యత్ హోటల్ పబ్లిక్ ప్లేసే కానీ, ప్రైవేట్ ప్లేస్ కాదని కేశినేని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజాస్వామ్యబద్ద పోస్టులో ఉన్నారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని, మరోవైపు ఆయనను ఎస్ఈసీ నుంచి తొలగించామని కూడా చెబుతున్నారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.


Comments