నేడే (17వ తేదీ, మంగళవారం) వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపులు. పంటల రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లింపు* *దాదాపు 14.58 లక్షల రైతుల ఖాతాల్లో రూ.510 కోట్లకు పైగా జమ* *అక్టోబరులో దెబ్బతిన్న పంటలకూ పెట్టుబడి రాయితీ విడుదల* *నెల రోజులలోపే రూ.132 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల* *క్యాంప్‌ కార్యాలయం నుంచి విడుదల చేయనున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌* *కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం* *ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటి వరకు పూర్తి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు. అమరావతి:(prajaamaravati), అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, వారి పంట రుణాలపై పూర్తి వడ్డీ రాయితీ (వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు)తో పాటు, ఈ ఖరీఫ్‌కు సంబంధించి అక్టోబరులో సంభవించిన పంట నష్టంపై పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కూడా చెల్లిస్తున్నారు. క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆ మేరకు నిధులు విడుదల చేయనున్నారు. 2019 ఖరీఫ్‌ పంట రుణాలకు సంబంధించి దాదాపు 14.58 లక్షల రైతులకు సుమారు రూ.510.32 కోట్ల వడ్డీ రాయితీ, ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి గత నెల (అక్టోబరు)లో సంభవించిన పంట (వ్యవసాయ, ఉద్యాన)ల నష్టానికి పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) రూ.132 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. *ఆ బకాయిలు కూడా..:* రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, ‘వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకం ప్రకటించారు. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన వడ్డీ రాయితీ రూ.1180 కోట్లు కూడా ఈ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తూ చెల్లిస్తోంది. *రైతు సంక్షేమమే ధ్యేయం:* ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడం, నిర్ణీత వ్యవధిలో రుణాలు తిరిగి చెల్లించేలా ప్రోత్సహించడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు ఈ రాయితీ లభించేందుకు అత్యంత పారదర్శకంగా చర్యలు తీసుకుంది. లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల వద్ద సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తున్నారు. *అక్టోబరు ఇన్‌పుట్‌ సబ్సిడీ:* పంట నష్టం జరిగిన సీజన్‌లోనే రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) చెల్లించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం మేరకు గత నెల (అక్టోబరు)లో జరిగిన పంట నష్టంపై సిద్ధమైన అంచనాల ఆధారంగా పెట్టుబడి రాయితీని నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. ఆ మేరకు రూ.132 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించడం విశేషం. మరోవైపు రాష్ట్రంలో పంటల నష్టాన్ని అంచనా వేసేందుకు ఇటీవలే కేంద్ర బృందం కూడా పర్యటించింది. వారికి అన్ని పరిస్థితులు వివరించిన రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

.