ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ . నైపుణ్య కళాశాలల్లో భాగస్వామ్యానికి ఎపిఎస్‌ఎస్‌డిసితో మరో నాలుగు సంస్థలు ఒప్పందాలు • మానుఫాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో శిక్షణనిచ్చేలా సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (SPI)తో ఒప్పందం • ఐ.టీ రంగంలో ఐబీఎం ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ • భారత పర్యాటక అభివృద్ధి సంస్థ (ఐటిడిసి) ఆధ్వర్యంలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' • సినీ పరిశ్రమలో ఎడిటింగ్, యానిమేషన్లపై నైపుణ్య శిక్షణనిచ్చేందుకు ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అమరావతి (prajaamaravati): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య కళాశాలల్లో భాగస్వామ్యం అవడానికి ప్రముఖ ఐటి సంస్థ ఐబిఎం, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్, ఎల్వీప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు రావడం సంతోషంగా ఉందని ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) కార్యాలయంలో సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము సమక్షంలో ఆన్ లైన్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఐబిఎం ఇండియా డైరెక్టర్ జగదీశ భట్, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేనల్ (ఎస్.పి.ఐ) సంస్థ డైరెక్టర్ జార్జినా ఫువా, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటిడిసి) ఎండి జి.కమలవర్థన్ రావు, ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ డైరెక్టర్ ఎ.సాయిప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. *సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేనల్ (ఎస్.పి.ఐ):* అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ & ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ విభాగాల్లో అంతర్జాతీయస్థాయి పరిశ్రమల నేతృత్వంలోని కోర్సులను నైపుణ్య కళాశాలల్లో అందించడానికి అవసరమైన సాంకేతిక సహకారం, నిర్వహణకు సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్.పి.ఐ) ముందుకు వచ్చింది. ఈ మేరకు వారు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా ల్యాబ్స్, కోర్సులను అభివృద్ధి చేయడం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, ప్రతిపాదించిన కోర్సుల్లో ఎపిఎస్‌ఎస్‌డిసితో కలిసి సర్టిఫికేషన్, అక్రిడేషన్ ఇవ్వడం, టీచింగ్, లెర్నింగ్ మాడ్యూల్స్ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత అభివృద్ధి చేస్తారు. *ఐబిఎం ఇండియా:* ఐటి రంగంలో “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”ను ఏర్పాటు చేసేందుకు ఐబిఎం ఇండియా ముందుకు వచ్చింది. ఒప్పందంలో భాగంగా కోర్సులు, పాఠ్యాంశాలు, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గెస్ట్ లెక్చర్స్, ఐటి డొమైన్ లై హైఎండ్ ట్రైనింగ్స్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్, డేటా సైన్స్ & అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, బిగ్ డేటా మరియు ఫుల్ స్టాక్ విభాగాల్లో శిక్షణ ఇస్తుంది. *ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐ.టి.డి.సి):* హాస్పిటాలిటీ సెక్టార్‌లో ఎపిఎస్‌ఎస్‌డిసి ఏర్పాటు చేయబోయే “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”కు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా హాస్పిటాలిటీ రంగంలో కోర్సులు మరియు పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను ఐటిడిసి రూపొందిస్తుంది. హాస్పటాలిటీ ట్రేడ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ ఆపరేషన్స్, ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ లో ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థులు / నిరుద్యోగ యువతకు ఐటిడిసి శిక్షణ ఇస్తుంది. *ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ:* విశాఖపట్నంలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీ.ఓ.ఈ)ని ఏర్పాటు చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ ముందుకు వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా కోర్సులు మరియు పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తారు. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, 2D యానిమేషన్ బేసిక్ ట్రైనింగ్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ లో బేసిక్స్, వీఎఫ్ఎక్స్ అండ్ డిజిటల్ రిస్టోరేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గెస్ట్ లెక్చర్స్, నేషనల్ అప్రెంటీస్ షిప్ ప్రోగ్రామ్ (న్యాప్స్) కింద అప్రెంటీస్ సపోర్ట్ ఇస్తారు. *ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి గారు:* నైపుణ్య శిక్షణ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో రాష్ట్రాన్ని అత్యుత్తమస్థాయిలో ఉన్నత ప్రమాణాలను పెంపొందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటి వరకు 13 సంస్థలు ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం మనరాష్ట్రానికి ఉందని.. ఇక్కడ టూరిజం, హాస్పటాలిటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. *నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము గారు:* రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్ కాలేజీల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలతో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. *ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ గారు:* ఐబిఎం, ఐటిడిసి, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్, ఎల్వీప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలు స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త విద్యా విధానం అమలులోకి రాబోతోందని.. అందులో ప్రతిఒక్కరికీ నైపుణ్య శిక్షణను తప్పనిసరి చేశారని గుర్తుచేశారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులందరికీ నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఎపిఎస్‌ఎస్‌డిసి పరిశ్రమలోనే నైపుణ్య శిక్షణ ఇచ్చి.. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేలా పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఈ ఆన్ లైన్ వర్చువల్ ఎంఓయూ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హనుమనాయక్, డాక్టర్. డివి రామకోటిరెడ్డి తదిరులు పాల్గొన్నారు.

.