విద్యార్థులు బాగా చదువుకోవాలి : కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు పాటించాలి

 విద్యార్థులు బాగా చదువుకోవాలి


: కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు పాటించాలి



: నాడు - నేడు పనులను నాణ్యతగా చేపట్టాలి


: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు


: విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్


: జిల్లాలో ఒకటి నుంచి 5వ తరగతి పాఠశాలలు పునః ప్రారంభం


అనంతపురం (ప్రజా అమరావతి), ఫిబ్రవరి 01 :


అనేక నెలల అనంతరం పాఠశాలలకు హాజరైన విద్యార్థులు బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. జిల్లాలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో సోమవారం రాప్తాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,700 పాఠశాలల్లో ఒకటి నుంచి 5 వరకు తరగతులను ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి పాఠశాలలోనూ కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని, ప్రతి విద్యార్థి కూడా మాస్కు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, శాని టైజర్ వాడాలని, భోజనం చేసే సమయంలో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. చాలా నెలల అనంతరం విద్యార్థులు పాఠశాలకు రాగా, పాఠశాలలో రూపు రేఖలు మార్చి నూతనంగా తీర్చిదిద్ది విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. త్వరలోనే పాఠశాల కు బెంచీలు కూడా వస్తాయని, విద్యార్థులు ఎవరు నేల మీద కూర్చొనవలసిన అవసరం లేకుండా బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్, బ్యాగులు ఎలా ఉన్నాయని విద్యార్థులను జిల్లా కలెక్టర్ అడిగగా, బాగున్నాయని విద్యార్థులు సమాధానం ఇచ్చారు. అందరూ కొత్త యూనిఫామ్ ని వేసుకుని పాఠశాలకు రావాలని సూచించారు. 


నాడు - నేడు అభివృద్ధి పనుల పరిశీలన : 


తదనంతరం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నాడు - నేడు కింద చేపడుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. పెయింటింగ్ పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. 


విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ : 


అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం కింద వండుతున్న అన్నం మెత్తగా కాకుండా బాగా నాణ్యతగా ఉండాలని, పప్పు చిక్కగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న భోజనం కింద మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతి రోజు భోజనం వడ్డించాలన్నారు. ఈరోజు భోజనాన్ని రుచికరంగా ఉందని మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు రామాంజినమ్మను అభినందిస్తూ, ప్రతిరోజు భోజనాన్ని మంచిగా వండి విద్యార్థులకు వడ్డించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. భోజన సమయంలో విద్యార్థులు ఎవరి వాటర్ బాటిల్ ను వారే స్వయంగా తెచ్చుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ అభినందించారు. 


ఈ కార్యక్రమంలో డిఈఓ శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఏపీ ఈ డబ్ల్యూ సి మరియు సమగ్ర శిక్ష ఈఈ శివ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహులు, విద్యా శాఖ, సమగ్ర శిక్ష అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Comments