ప్ర‌త్యేక క‌మిటీ సార‌థ్యంలో నూత‌న రథం:


కాకినాడ‌ (ప్రజా అమరావతి);

తూర్పుగోదావ‌రి జిల్లా స‌ఖినేటిప‌ల్లి మండ‌లంలోని అంత‌ర్వేది శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి ఆల‌యంలో రూ.1.16 కోట్ల‌తో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారుచేసిన కొత్త దివ్య ర‌థాన్నిరాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం  ప్రారంభించారు. ఉద‌యం 11.30 గంట‌ల స‌మ‌యంలో అంత‌ర్వేదిలోని ఫిషింగ్ హార్బ‌ర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి  పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వ‌నితతో పాటు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ, అమ‌లాపురం స‌బ్ క‌లెక్ట‌ర్ హిమాన్షు కౌశిక్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి ఆల‌య రాజ‌గోపురం వ‌ద్ద చేరుకున్న ముఖ్య‌మంత్రికి మేళ‌తాళాలతో ఆలయ మర్యాదలతో అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు.  ఆపై ముఖ్యమంత్రి తొలుత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ద‌ర్శించుకొని అర్చ‌న‌, మంత్ర పుష్పం సమర్పించారు.  త‌దుపరి ఆయన రాజ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారిని దర్శించుకుని,  ఆశీర్వచన మండపంలో పండితుల వేదాశీర్వచనం, శేష వస్తం స్వీకరించారు. స్వామి  ద‌ర్శనం అనంతరం ఆల‌య ప్రాంగ‌ణంలో 41 అడుగుల ఎత్తు, ఏడు అంత‌స్తుల‌తో నూత‌నంగా నిర్మించిన స్వామి వారి దివ్య ర‌థానికి ముఖ్యమంత్రి ఆగమ శాస్త్రప్రకారం ప్ర‌త్యేక పూజ‌లు చేసి, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి తాడు లాగి రథాన్ని ప్రారంభించారు.   ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాన ఆధ్యాత్మిక ప‌రిమ‌ళాల మ‌ధ్య జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని తిలకించి భ‌క్తులు హర్షద్వానాలు చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆలయం బ‌య‌ట‌, లోప‌ల ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. 

ప్ర‌త్యేక క‌మిటీ సార‌థ్యంలో నూత‌న రథం:


2020, సెప్టెంబ‌ర్ తొలివారంలో దుర‌దృష్ట‌వ‌శాత్తు స్వామివారి దివ్య ర‌థం అగ్నికి ఆహుతైన నేప‌థ్యంలో నూత‌న ర‌థం నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ప్రత్యేక క‌మిటీ ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి అమ‌లాపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా క‌న్వీన‌ర్‌గా దేవాదాయశాఖ రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. డిప్యూటీ క‌మిష‌న‌ర్ (కాకినాడ‌), ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ (కాకినాడ‌), ఉప స్త‌ప‌తి (కాకినాడ‌), ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (అంత‌ర్వేది), జిల్లా అట‌వీ అధికారి (కాకినాడ‌) స‌భ్యులుగా వ్య‌వ‌హరించారు. కొత్త ర‌థం నిర్మాణ ప‌నుల స‌మ‌న్వ‌యానికి అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌-2ను ప్ర‌త్యేక అధికారిగా దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ నియ‌మించారు. ర‌థం నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నాణ్య‌మైన బ‌స్త‌ర్ టేకును రావుల‌పాలెంలోని శ్రీ సాయి టింబ‌ర్ డిపోలో ప్ర‌త్యేక క‌మిటీ గుర్తించి సేకరంచింది. శాస్త్రోక్త పూజలతో 2020, సెప్టెంబ‌ర్ 27న అధిక ఆషాఢ శుద్ధ ఏకాద‌శి రోజున నూత‌న ర‌థం నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. రథం నిర్మాణ ప‌నుల్లో పురోగ‌తిపై ప్ర‌త్యేక క‌మిటీ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మావేశాలు నిర్వ‌హించి స‌మీక్షించింది.  అద‌న‌పు సొబ‌గులు మిన‌హా 2020, డిసెంబ‌ర్ 25 వైకుంఠ ఏకాద‌శి నాటికి ర‌థం నిర్మాణం పూర్త‌యింది. నిర్వ‌హ‌ణ‌, ర‌క్ష‌ణ‌ను దృష్టిలో ఉంచుకొని స్వామి వారి కొత్త ర‌థానికి ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో  హైడ్రాలిక్ బ్రేకింగ్ వ్య‌వ‌స్థ‌తో పాటు జాకీని ఏర్పాటు చేశారు కాలం. రేయింబవళ్లు శరవేగంగా పనులు నిర్వహించి అతి తక్కవ కాలంలో స్వామి వారి తిరు కళ్యాణ వేడుకల నాటికి సర్వాంగ సుందరంగా దివ్యరథ నిర్మాణాన్ని పూర్తిచేసి రథోత్సవానికి కమిటీ సిద్థం చేసింది. 

ఫిబ్ర‌వ‌రి 19 నుంచి 28 వ‌ర‌కు క‌ల్యాణ మ‌హోత్స‌వాలు:

శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి వార్షిక దివ్య తిరు క‌ల్యాణ మ‌హోత్స‌వాలు ఫిబ్ర‌వ‌రి 19 శుక్ర‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. సూర్య వాహ‌నంపై గ్రామోత్స‌వంతో ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వాలు ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన శ్రీ స్వామివారి తిరు క‌ల్యాణ మ‌హోత్స‌వాలు జ‌రుతాయి. అదే విధంగా 23వ తేదీన మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు శ్రీ స్వామివారి రధోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ ఉత్‌హవానికి కొత్త ర‌థాన్ని ఉప‌యోగించ‌నున్నారు. స్వామివారి ఆల‌యంలో క‌ల్యాణ మ‌హోత్స‌వాల తొలిరోజు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాజ్య‌స‌భ స‌భ్యులు పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌; కాకినాడ, అమ‌లాపురం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీలు వంగా గీతా విశ్వ‌నాథ్‌, చింతా అనురాధ‌, మార్గాని భ‌ర‌త్‌రామ్‌; ‌ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు; ‌రాజోలు, కాకినాడ అర్బ‌న్‌, గ‌న్న‌వ‌రం, ముమ్మిడివ‌రం, పిఠాపురం ఎమ్మెల్యేలు రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, కొండేటి చిట్టిబాబు, పొన్నాడ వెంక‌ట స‌తీశ్ కుమార్‌, పెండెం దొర‌బాబు,డీసీసీబీ ఛైర్‌‌న్ అనంత‌ర ఉద‌య భాస్క‌ర్‌

ఎస్‌సీ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ పెద‌పాటి అమ్మాజీ, డీఐజీ రామ్మోహ‌న్‌రావు, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు,డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఎం.విజ‌య‌రాజు, ఆల‌య ఈవో య‌ర్రంశెట్టి భ‌ద్రాజీ, అమలాపురం డిఎస్పి వై.మాధవరెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.