జలశక్తి అభియాన్'క్యాచ్ ది రెయిన్' కార్యక్రమాన్నిప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి

 జలశక్తి అభియాన్'క్యాచ్ ది రెయిన్' కార్యక్రమాన్నిప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి


భూమిపై పడిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భజలంగా మార్చాలి

మార్చి 22 నుండి నవంబరు 30వరకు జల సంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు

అమరావతి,22 మార్చి (ప్రజా అమరావతి) : ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ‘క్యాచ్ ద రెయిన్’ పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టనున్న భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ నుండి వీడియో కాన్పరెన్సు ద్వారా లాంచనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అన్నిగ్రామ పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించు కోవడంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. క్యాచ్ ద రెయిన్ పేరిట నిర్వహించే ఈప్రత్యేక కార్యక్రమాన్నిదేశవ్యాప్తంగా నేటి నుండి అనగా ఈ నెల 22 నుండి నవంబరు 30వ తేదీ వరకూ నిర్వహించడం జరుగుతుంది. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వర్షపు నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే గ్రామాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భగా ప్రధాని నరేంద్ర మోది వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ నీటి సంరక్షణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి భూమిపై పడిన ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గ్రామ,పట్టణ స్థాయిలో ఎక్కడికక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఇతర చర్యలు ద్వారా పెద్దఎత్తున నీటి సంరక్షించి ఆనీటి భూమిలో ఇంకింప చేయడం ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని ప్రధాని మోది ప్రజలకు విజ్ణప్తి చేశారు.

అమరావతి సచివాలయం నుండి ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి డా.చలపతి రావు తదితరులు పాల్గొన్నారు.