పొరుగు రాష్ట్రాల కన్నా పారిశ్రామికంగా ఏపీ మెరుగు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



పొరుగు రాష్ట్రాల కన్నా పారిశ్రామికంగా ఏపీ మెరుగు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



ఉత్పత్తి ప్రారంభించడంలోనూ ముందడుగు.


కరోనా సంక్షోభంలోనూ పరిశ్రమలకు అండగా నిలిచిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.


కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా విడుదల చేసే డీపీఐఐటీ,ఐఈఎమ్ గణాంకాలే నిదర్శనం.


అసత్య ప్రచారాలు, వార్తలు, వ్యంగ్య రాతలు, సోషల్ మీడియా పోస్టులకు మంత్రి మేకపాటి మార్క్  క్లారిటీ.


కళ్లున్నా చూడలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని స్థితిలో ఉండేవారిని ఏం చేయగలం? వారికి ఇంకెలా చెప్పగలం?.


అమరావతి (ప్రజా అమరావతి), మార్చి, 07; కియా కార్ల పరిశ్రమ వెళ్లిపోయిందన్నారు. కానీ, ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వచ్చాక రూ.400 కోట్లతో మరింత విస్తరిస్తామని కియా ప్రకటించింది. 'మన పాలన - మీ సూచన' కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి మే 28న పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన మేధోమథన సదస్సులో  కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్ హ్యూన్ షిమ్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అదానీ డేటా సెంటర్ కూడా వెళ్లిపోతోందనే అసత్య ప్రచారానికి తెరతీశారు. కానీ 14,634 కోట్లను అదానీ గ్రూప్ పెట్టుబడి పెడతామని, దాదాపు 25వేల మందికి ఉపాధి అందించనున్నట్లు ఆ సంస్థే వెల్లడించింది. డేటా సెంటర్ మాత్రమే కాదు ఐ.టీ పార్కు, కన్వెన్షన్ సెంటర్ వంటివి కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులలో కూడా పెట్టుబడులు పెట్టింది. ఏపీలో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరంలో వార్‌బర్గ్‌ పింకస్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌ మెంట్‌ నుంచి 1,954 కోట్లతో.. పోర్టులో 31.5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు అదానీ గ్రూప్ స్వయంగా ప్రకటన ద్వారా వెల్లడించింది. అదానీ గ్రూప్ గత ఏడాది ఏపీలోని మరో పోర్ట్ అయిన కృష్ణపట్నాన్ని 12 వేల కోట్లతో కొనుగోలు చేసింది. అశోక్ లేలాండ్ కూడా ఉత్పత్తి ఆపేసిందని ఊదరగొట్టారు. కానీ విజయవాడలోని మల్లవల్లి పారిశ్రామిక పార్కు సమీపంలో నెలకొల్పిన ఈ ప్లాంటు కరోనా సమయంలో వాణిజ్యా కార్యాకలాపాలు కొనసాగించింది. తాజాగా ఉత్పత్తీ ప్రారంభించింది. వెళ్లిపోతున్నాయ్, తరలి వెళుతున్నాయన్న ప్రతీసారి నిజమేంటో, ప్రస్తుత ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిజం తెలుసుకుంటూనే ఉన్నారు.  అయినా కొన్ని పత్రికలు, ఛానళ్లలో అవగాహన లేకుండా తరచూ రాసే వ్యంగ్య రాతలు, అసత్య ప్రచారాలపట్ల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తనదైనశైలిలో స్పందించారు. వాస్తవాలేంటో వెల్లడించారు.


గత రెండేళ్లలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల కన్నా పెట్టుబడుల స్థాపన, ఉత్పత్తి ప్రారంభించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని మరోసారి వెల్లడించారు. అందుకు కేంద్ర ప్రభుత్వం  దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రతి నెలా విడుదల చేసే గణాంకాలే నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిన ప్రతిపాదనలు 2019లో 18,823  కోట్ల వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. అదే తమిళనాడు, తెలంగాణల గణాంకాలు పరిశీలిస్తే వరుసగా 8,562 కోట్లు ....5,432 కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ఆ రాష్ట్రాలకు వచ్చినట్లు వెల్లడించారు. ఇక 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల ప్రతిపాదనలు 9,727 కోట్లుగా ఉంటే, తమిళనాడులో 6,807 కోట్లు, తెలంగాణలో  7,392కోట్లు మాత్రమే వచ్చినట్లు మంత్రి వివరించారు. 


ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమయంలోనూ ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల వివరాలు పరిశీలిస్తే 2020లో 9,840 కోట్లుగా పెట్టుబడులు ఉన్నాయి. అదే తెలంగాణ రాష్ట్రంలో 6,057కోట్లు ..ఇక తమిళనాడులో అయితే కేవలం 1,184 కోట్లు మాత్రమే.  2019లో  34,696 కోట్ల విలువైన పరిశ్రమలు ఏపీలో ఉత్పత్తిని ప్రారంభించాయి. తమిళనాడులో ఉత్పత్తులు ప్రారంభించిన యూనిట్లు 2,860కోట్లు  అదే తెలంగాణ విషయానికొస్తే 7,364 కోట్ల విలువైన ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ వివరాలన్నీ గత సంవత్సరం డిసెంబర్ నెలాఖరు వరకూ డీపీఐఐటీ, ఐఈఎమ్ లలో పొందుపరచిన అధికారిక వివరాలు. కరోనా సమయంలో పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచిన తీరును యావత్ దేశమే ప్రశంసించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామిక సంస్కరణలను చూసి పొరుగు రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందుతున్నాయనడంలో సందేహం లేదు. కాబట్టి, రాసినా, విమర్శించినా కనీస ప్రాథమిక సమాచారం తీసుకుని మాట్లాడితే , రాస్తే అర్థవంతంగా ఉంటుందని మంత్రి మేకపాటి తెలిపారు. 


Note:


DPIIT - Department for Promotion of Industry and Internal Trade


IEM - INDUSTRIAL ENTREPRENEUR MEMORANDUM