మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. :జిల్లా కలెక్టర్ గంధం చంద్రడు.

 మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.


:జిల్లా కలెక్టర్ గంధం చంద్రడు.


అనంతపురం, మే 09 (ప్రజా అమరావతి);


జిల్లాలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు.


ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి మీడియాను అనుమతించకూడదని కలెక్టర్ జీవో విడుదల చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు.


జిల్లాలో ఆక్సిజన్ అందక కరోనా సోకిన వారు ఎవరూ చనిపోవడం లేదని, జిల్లాలో సరిపడేంత ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. 


జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని, అవసరమైన ఆక్సిజన్ సిలిండర్ లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.


ప్రభుత్వ సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో 13 కిలో లీటర్లు, హిందూపూర్ క్యాన్సర్ ఆసుపత్రి 6 కిలో లీటర్లు, గుంతకల్, కదిరి ఏరియా ఆసుపత్రులలో 1 కిలో లీటర్ చొప్పున లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. పై ఆక్సిజన్ ప్లాంట్లకు అదనంగా జిల్లాలో సింగనమలలో 350 సిలిండర్లు, హిందూపూర్ లో 450 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. కదిరి, గుంతకల్, హిందూపురం ఆసుపత్రులలో కొత్తగా ఆక్సిజన్ పైప్ లైన్లను ఏర్పాటు చేశామన్నారు.


 అలాగే సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ప్రభుత్వ ఆసుపత్రి, సర్వజన ఆస్పత్రులలో ప్రతి వార్డులోనూ పైపులైను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కూడా పైప్లైన్ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.


అవసరానికి తగ్గట్టు ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు 336 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, వీటికి అదనంగా పరిశ్రమలలో ఉన్న 487 సిలిండర్లను కూడా వినియోగంలోకి తీసుకొస్తున్నామన్నారు. వీటితో పాటు సత్యసాయి & ఆర్డీటీ ఆసుపత్రులలో కూడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆక్సిజన్ సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు జేసీ నిశాంత్ కుమార్ చైర్మన్ గా ఉన్నతాధికారులు సభ్యులుగా ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు.


ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా కట్టడి కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. అసత్య ప్రచారాలను ఎవరు నమ్మరాదన్నారు.Comments