అంబులెన్స్ లు ఆపొద్దుః శ్రీ సజ్జల*


తాడేపల్లి- వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయం (ప్రజా అమరావతి);


*అంబులెన్స్ లు ఆపొద్దుః శ్రీ సజ్జల*


*వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పాయింట్స్..*


*- ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఎక్కడైనా వైద్యం అందించాలి*

*- హక్కుల కంటే.. దేశం అంతా ఒక్కటే, ఎవరి ప్రాణం అయినా ఒక్కటే అన్న భావన రావాలి*

*- అంబులెన్స్‌లను ఆపవద్దని తెలంగాణ హైకోర్టు చెప్పినా.. టెక్నికల్ ప్రొసీజర్ పేరుతో అడ్డుకుంటున్నారు*

*- తెలంగాణ విధించిన ఆంక్షల ప్రకారం.. ఆసుపత్రి అడ్మిషన్ లెటర్లు, పాస్‌లు తీసుకురావడం పేషంట్లకు సాధ్యం కాదు*

*- గత అయిదేళ్ళలో రాష్ట్రంలో వైద్య సదుపాయాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు*

*- భ్రమరావతిపైనే చంద్రబాబు ధ్యాస తప్పితే.. గత 5 ఏళ్ళలో ఎందుకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించలేదు?*

*- అందువల్లే నేడు వైద్యం కోసం పక్కరాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి*

*- మరే రాష్ట్రాల్లో రాని సమస్య తెలంగాణ సరిహద్దుల్లోనే వస్తోంది*

*- కరోనా విపత్తులో వైద్య సదుపాయాలు ఎక్కువగా ఉన్న నగరాలకు వెళ్లడం సహజం*

*- కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే.. ప్రజలకు భరోసా కల్పించేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం*

*- ఆరోగ్యశ్రీ కింద రూ.3500 కోట్ల వ్యయం.. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రూ.5వేల కోట్ల ఖర్చు*


-: శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి


తెలంగాణ సరిహద్దుల్లో వైద్యం కోసం హైదరాబాద్‌ వెళుతున్న పేషంట్లతో కూడిన అంబులెన్స్‌లను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని, ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఎక్కడైనా వైద్యం పొందే హక్కు దేశంలోని ప్రతి పౌరుడికి ఉంటుందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


*తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ... ఏమన్నారంటే..*


-  కోవిడ్ ఎవరూ ఊహించని విపత్తు. దీనివల్ల అనుకోని అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పలు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే ఎపి నుంచి వైద్యం కోసం హైదరాబాద్‌ వెళుతున్న పేషంట్ల అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డకుంటున్నారు. ఇది సరికాదని తెలంగాణా హైకోర్ట్ చెప్పినా కూడా టెక్నికల్ ప్రొసీజర్‌ పేరుతో అడ్డుకుంటున్నారు. దానిని అనుసరించడం పేషంట్లకు సాధ్యం కావడం లేదు. గంటల్లో ప్రాణాపాయం ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ నుంచి వచ్చే రోగులను సరిహద్దుల పేరుతో అడ్డుకోకుండా తెలంగాణ ప్రభుత్వం అనుమతించాలని కోరారు. 


-  సుప్రీంకోర్ట్ జోక్యంతో కూడా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపి నుంచి సహజంగానే వైద్య సదుపాయాలు ఎక్కువగా వున్న పొరుగున ఉన్న హైదారాబాద్, బెంగుళూరు, చెన్నైకి పేషంట్లు వెళుతుంటారు. అడ్డగోలుగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల, రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏర్పాటు చేయడం వల్ల ఏపి వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో లేని ప్రాంతంగా మారింది. విభజన తరువాత అయిదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించిన టిడిపి ప్రభుత్వం వైద్యంపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇప్పుడు వచ్చిన విపత్తు చాలా పెద్దది కావడం వల్ల ఎక్కడ మెరుగైన వైద్యం దొరికితే అక్కడికి వెళుతుంటారు. చెన్నైకి, బెంగుళూరు నగరాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పేషెంట్లు వెళుతున్నా కూడా ఎక్కడా మనకు ఇబ్బంది రావడం లేదు. కానీ హైదరాబాద్‌ నుంచే సమస్య వస్తోంది.


- తెలంగాణ ప్రభుత్వంతో అధికారులు మాట్లాడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం ప్రస్తావించిన నిబంధనలు కూడా వెంటనే పూర్తి చేయడం సాధ్యం కాని విధంగా వున్నాయి. కోవిడ్ వల్ల గంటల్లోనే సాధారణ వ్యక్తులు మృత్యువుకు చేరువ అవుతున్నారు. ఈ సమయంలో ఆసుపత్రుల్లో చేరి, పేషంట్ అక్కడికి వెళ్ళే వరకు కూడా బెడ్ ఖాళీగా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఆ సమయంలో హాస్పటల్ అడ్మిషన్ ఇచ్చి, దానిని ప్రభుత్వం కంట్రోల్ రూంకు పంపి, వారు అప్రూవ్ చేసి, వారు ఇచ్చిన అడ్మిషన్ పాస్ తీసుకుని, పేషంట్ బార్డర్ దాటాలంటే ప్రాక్టికల్ గా సాధ్యమా? అని ఆలోచించాలి.


*చంద్రబాబు హడావుడిగా మూటాముల్లె సర్దుకుని రావడం వల్లే ఉమ్మడి రాజధాని హక్కు కోల్పోయాం*

-  హైదరాబాద్‌ నగరం 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది. చంద్రబాబు హడావుడిగా మూటాముల్లె సర్దుకుని ఇక్కడికి వచ్చి, ఇక్కడ రాజధానిగా ప్రకటించడం వల్ల ఆ అవకాశం పోయింది. ఇప్పటికీ మన రాష్ట్రాంలోని మెజార్టీ కుటుంబాల్లో కుటుంబంలో ఎవరో ఒకరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వైద్య సదుపాయాల కోసం హైదరాబాద్ కు వెళుతున్న సమయంలో ఇటువంటి ఆటంకాలు కల్పించడం దురదృష్టకరం. ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట వైద్యం కోసం, ఆక్సిజన్ బెడ్ కోసం ప్రయత్నిస్తుంటారు. జిల్లాల మధ్య, ఆసుపత్రుల మద్య కూడా ఇది జరుగుతోంది. హైదరాబాద్ లోని ఆసుపత్రులలో కూడా అడ్మిషన్ ఇచ్చేందుకు పది బెడ్‌లు ఉంటే, వందమంది వేచి ఉండే పరిస్థితి ఉంది. అటువంటి సమయంలో వారు మీకు ఎప్పుడు వచ్చినా బెడ్ ఇస్తామని చెప్పే పరిస్థితి ఉంటుందా?  పేషంట్ ఆ సమయంలో అక్కడికి చేరితే, బెడ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దీనిని మానవత్వంతో చూడాలి.


*హక్కుల కంటే.. దేశం అంతా ఒక్కటే, ఎవరి ప్రాణం అయినా ఒక్కటే అన్న భావన రావాలి*

- కరోనా అనేది ప్రపంచమే ఊహించని సమస్య.  పేషెంట్లను రీరెగ్యులేట్ చేయాలని డబ్ల్యుటిఓ ఆలోచిస్తోంది. అలాగే దేశం మొత్తం దీనిపై ఒక్కటి కావాలి. హక్కుల కంటే కూడా భారతదేశం అంతా ఒక్కటే, ఎక్కడ ఉన్నా ఎవరి ప్రాణం అయినా ఒకటే అనే ఆలోచనతో ఉండాలి. అత్యవసరం అయితే ఎక్కడ వైద్యంకు అవకాశం ఉన్నా, దానికి అనుమతించాలి. దీనిపై సంయమనంతో రాష్ట్రాలు వ్యవహరించాల్సి ఉంది. మీడియా కూడా దీనిని అదే దృష్టితో చూడాలని కోరుతున్నాం. 


-    పేషంట్లు మన వద్ద వున్న వైద్య వసతులను వాడుకోవాలి. అలాగే అక్కడ ఏ ఆసుపత్రిలో బెడ్ దొరుకుతుందో తెలియకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళడం కూడా ప్రాణాలతో చెలగాటం ఆడటమే. దానిని అందరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు హడావుడిగా ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని కోరుతున్నాం. దీనిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పక్కరాష్ట్రం కూడా సంయమనంతో ఆలోచించి అంబులెన్స్ లను అనుమతించాలి.


*ఒకవైపు కరోనాను ఎదుర్కొంటూనే.. మరోవైపు పథకాల ద్వారా ప్రజలకు భరోసా ఇస్తున్న సీఎం*

-  మన రాష్ట్రానికి సంబంధించి.. కరోనా వల్ల ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడటంతోపాటు, మరోవైపు వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే వైద్య, ఆరోగ్య రంగాలను అప్రమత్తం చేసి నిత్యం సమీక్షించడం, ఆక్సిజన్, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడం, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయడం వంటి చర్యలతో ప్రభుత్వం పనిచేస్తోంది. 

- మొదటి ఫేజ్ కోవిడ్ సమయంలో అంతర్జాతీయ సంస్థలు కూడా ఎపి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించిందని అభినందించాయి. నేరుగా బ్యాంకుల ద్వారా నగదు బదిలీతో పేదలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం. సంక్షేమ పథకాల ద్వారా రెక్కాడితే కానీ డొక్కాడని వర్గాలకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ అండగా నిలిచారు. అదే పంథాను ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. రైతులకు అత్యవసరమైన ఖరీఫ్ కోసం రూ.7500 చొప్పున 52.38 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలకు రూ.3,928.88 కోట్ల సాయం జమ చేశాం. 


-  డెబ్బై శాతంకు పైగా రెండు, రెండున్నర ఎకరాలకు మించని రైతులు ఉంటే, ఈ మొత్తం వారికి చాలా ఊరట కల్పిస్తుంది. వైయస్‌ఆర్ ఉచిత పంటల బీమా కింద, ఈ నెల 25న రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. గతంలో పంటనష్టపోతే ఎప్పుడో ఇన్స్యూరెన్స్ వచ్చేది. అది ఎప్పడు వస్తుందో తెలియని పరిస్థితి, వడ్డీలు ఎక్కువై రైతులు ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే అదే సీజన్‌లోనే పరిహారం ఇస్తున్నారు.


-  గత ప్రభుత్వం 2014కి ముందు  లక్ష కోట్ల రూపాయలు రుణమాఫీ అనే పథకం ప్రకటించి కేవలం  రూ. 14 వేల కోట్లు, అది కూడా నాలుగు విడతలు మాత్రమే ఇచ్చి, చెప్పిన దానిలో కూడా కోతలు పెట్టారు. అయిదో విడత ఇవ్వకుండా మా ప్రభుత్వం దానిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశాడు. దానికి పూర్తి భిన్నంగా శ్రీ వైయస్ జగన్ గారు నాలుగు దఫాలుగా రైతులకు రూ.50 వేలు ఇస్తానని మేనిఫేస్టోలో చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, రైతుల పరిస్థితులు చూసి, మొదటి ఏడాది నుంచి అయిదేళ్ళకు, అదికూడా ఏటా ఇస్తానన్న  రూ.12,500 ను రూ.13,500కు పెంచి ప్రకటించారు. దానివల్ల ఒక్కో రైతుకు 5 ఏళ్ళలో రైతు భరోసా కింది ఇచ్చేది రూ.67,500 అయ్యింది. అంటే రూ.17,500 ఒక్కో రైతుకు చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. ఇది జగన్ గారి చిత్తశుద్ది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత కరోనా సంక్షోభం మొదలై గత ఏడాదిగా కోవిడ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా, ఇచ్చిన మాట తప్పకుండా, ఇచ్చే సాయం ఇప్పుడే ముఖ్యమని తూ.చ తప్పకుండా లబ్ధదారుల ఖాతాలకే జమ చేస్తున్నారు. ఆపద సమయంలో రైతులకు ఇది ఎంతో ఊరట కల్పిస్తోంది.


-  రోజు జరిగే రాజకీయ పోరులో ఇవ్వన్నీ మిస్ అవుతున్నాయి. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఆరోగ్యశ్రీ ఇలా అనేక పథకాలతో ప్రజలను ఆదుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద మూడువేల అయిదువందల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అందులో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.470 కోట్లు. లబ్ధిదారుల వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచి, రాష్ట్రంలోని తొంబై శాతం ప్రజలకు, రెండు వేలపైగా జబ్బులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. ఇది కాకుండా కోవిడ్ కు దేశంలోనే తొలిసారిగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స ప్రకటించిన ఘనత కూడా సీఎం శ్రీ వైయస్ జగన్ గారికే దక్కుతుంది.  


-  రూ.5వేల కోట్లు కోవిడ్ మీద ఖర్చు చేశాం. ప్రజారోగ్యం, ప్రస్తుత సంక్షోభం కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేశాం. వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజమైన సంక్షేమ, ప్రజాప్రభుత్వంగా ఒక దూరదృష్టితో ఒక రోల్‌మోడల్ కింద గత ఇరవై నెలలుగా కోవిడ్‌ను ఎదుర్కోనేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిపై ఇంకా మెరుగైన సలహాలు తీసుకుంటున్నాం. ఇంకా మెరుగ్గా తీసుకోవాల్సిన చర్యల పైనా నిత్యం సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్షిస్తున్నారు. అందరికంటే ముందు ఆయన ఉంటున్నారు. 


*వ్యాక్సిన్లపై శ్రీ జగన్ చెప్పిందే కేంద్రం అంగీకరిస్తోంది*

-  వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే రెండు కంపెనీలు నెలకు 7 కోట్ల వ్యాక్సిన్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి.  దేశం మొత్తం మీద 172 కోట్ల డోసులు అవసరం. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ఫ్రీ చేయకపోతే ఇంత భారీగా ఎలా అందించగలమని, దానికి పరిష్కారం కూడా ఎలా చేయాలో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు చెప్పారు. ఇప్పుడు కేంద్రం కూడా దానిని అంగీకరిస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే... వ్యాక్సిన్‌కు ఎందుకు ఆర్డర్‌లు పెట్టలేదని తెలుగుదేశం నేతలు ఎలా అంటారు?  ఒకవైపు మొత్తం కేంద్రం వ్యాక్సిన్‌ను తన చేతుల్లో పెట్టుకుంటే, దానికి రాష్ట్రంను ఎలా బాధ్యులు చేస్తారు? ఇప్పుడు అదే కేంద్రప్రభుత్వం జగన్ గారు చెప్పిన దాని తరువాత ఉత్పత్తి విషయంలో ఫ్రీ చేయాలని అంటోంది. అలాగే గ్లోబల్ టెండర్లకు నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇటువంటి వాటిపై కేంద్రం ముందుగా నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్‌ ఖర్చు కూడా కేంద్రమే భరించాలి. ఇది రాష్ట్రాల నుంచి కాకుండా మొత్తం దేశం అనే కోణంలో కేంద్రం ప్లాన్‌ఆఫ్ యాక్షన్ చేయాలి. ఇప్పుడు అది మొదలవుతోంది. ఇవ్వన్నీ గమనించడం లేదా? మామీద బురదచల్లడం టిడిపి నేతల అవివేకం.


-  ఆక్సిజన్ సమస్యను 350 నుంచి 600 టన్నులకు మనం పెంచుకున్నాం. కేంద్రం ఇచ్చిన కేటాయింపులను పెంచుకునేలా చేసుకోవడం, పక్కరాష్ట్రాలతో సంప్రదించి ఎక్కువ తెచ్చుకోవడం చేస్తున్నాం. కేవలం గంటల వ్యవధిలోనే కోవిడ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఐసియు బెడ్‌ లకు డిమాండ్ పెరుగుతోంది. దానికి ఆక్సిజన్ అవసరమైనంత కావాలి. దానిని ఎలా ఇవ్వాలి. అందుకు బయట నుంచి ఆక్సిజన్ ఎలా తెచ్చుకోవాలి. ఉన్నది అయిపోయేలోగా మళ్ళీ తెచ్చుకోవాలనే అంశాలపై ప్రతి నిమిషం సీఎం శ్రీ వైయస్ జగన్ గారి పర్యవేక్షణలో ఐఎఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్ నుంచి 4 కంటైనర్లను, ఇక్కడ 5 కంటైనర్లను ఆక్సిజన్‌ కోసం సిద్దం చేశాం. రోడ్డు, రైలు మార్గాల్లో ఆక్సిజన్‌ను తీసుకువస్తున్నాం. 


-  సీఎం నేతృత్వంలో మంత్రివర్గం, అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పూర్తి చిత్తశుద్దితో పనిచేస్తున్నారు. వైద్యులు, నర్స్ లు, సిబ్బంది ప్రోఫేషనల్‌గా అద్భుతంగా పనిచేస్తున్నారు. వారిపైన ఎంత వత్తిడి ఉన్నా, స్వచ్చందంగా, సహనంతో పనిచేస్తున్నారు. వారికి చేతులెత్తి మొక్కాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. మొత్తం రాష్ట్రం ఈ విపత్తను ఎదుర్కొనేందుకు కష్టపడుతోంది. 

-ఇతర రాష్ట్రాలతో డీల్ చేస్తున్నప్పుడు రాజనీతితో వ్యవహరించాల్సి ఉంటుంది. తప్పులు జరిగితే ప్రతిపక్షం ఎత్తి చూపాలి కానీ ఏమీ చేయడం లేదనే తప్పుడు విమర్శలు చేయకూడదు. ఇటువంటి సమయంలో మీడియా సహకారం కూడా చాలా కీలకం. కోవిడ్ మన జీవితంలో భాగం, మనం దానిని అధిగమించే ప్రయత్నం చేయాలని సీఎంగారు చెప్పారు. దీనిని ప్రజల్లోకి తీసుకురావడంలో మీడియా రోల్ కీలకం. కానీ ఫ్రంట్‌లైన్ వర్కర్లను డీ మోరల్ చేయకూడదు. 


*గత 5 ఏళ్ళు చంద్రబాబు వైద్య రంగాన్ని పట్టించుకోలేదు*

-  ఎపిలో వైద్య సదుపాయాలు లేవని ప్రజలు పక్కరాష్ట్రాలకు పోతున్నారంటే దానికి గత అయిదేళ్ళలో చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం. అయిదేళ్ళలో ఎందుకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించలేదు? తన పాలనలో  భ్రమరావతిపైనే దృష్టి పెట్టాడు. ఇన్ని చేసిన చంద్రబాబు ఏ హక్కుతో ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు? ఆనాడు వైద్య రంగాన్ని చంద్రబాబు ఎక్కడా పట్టించుకోలేదు. అటు అమరావతి రైతులనుకూడా మోసం చేశాడు. పదేళ్ల హక్కుగా వున్న రాజధానిని కూడా పోగొట్టాడు. ఇన్ని చేసిన చంద్రబాబుకు ప్రశ్నించే హక్కు లేదు. ఇది రాజకీయ విమర్శలు చేసే  సమయం కాదు.