లీటరు పాలకన్నా నీళ్ల ధర ఎక్కువ.

 


అమరావతి (ప్రజా అమరావతి);


*ఏపీ అమూల్‌ ప్రాజెక్టు మరో జిల్లాకు విస్తరణ*


*పశ్చిమ గోదావరి జిల్లాలో పాలసేకరణ కార్యక్రమాన్ని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


లీటరు పాలకన్నా నీళ్ల ధర ఎక్కువ.


పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించే ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పాదయాత్రలో నేను చూసిన పరిస్ధితులు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. పాదయాత్రలో దాదాపు ప్రతి జిల్లాలోనూ కూడా ఒక లీటరు పాలు తీసుకుని వచ్చి నాకు చూపించేవారు. ఒక లీటరు పాలు రేటు రూ.23 ఉంది,  ఒక లీటరు మినరల్‌ వాటర్‌ రేటు  లీటర్‌ పాలు రేటు కన్నా  కూడా ఎక్కువుంది, ఇది మా పరిస్థితి అని చెప్పిన మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. అందుకనే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు బాగుండాలని, వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతులకు, అక్కచెల్లెమ్మలకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరుగెత్తగలుగుతుంది, నిలబడగలుతుందని, నమ్మాను కాబట్టే.. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి అమూల్‌ని తీసుకుని వచ్చాం. 


*అమూల్‌ దేశంలో నెంబర్‌ వన్‌ సహకార సంస్ధ:*


అమూల్‌ సంస్ధ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అనసరంలేదు. దేశంలోనే నెంబర్‌ వన్‌ సహకారరంగ సంస్ధ. దాదాపుగా రూ.50 వేల కోట్లు టర్నోవర్‌ చేస్తున్న ఈ సంస్ధలో వాటాదారులు ప్రైవేటు వ్యక్తులు కాదు. వాటాదారులు అందరూ కూడా పాలుపోసే అక్కచెల్లమ్మలు. అమూల్‌ సంస్ధ ఏ స్ధాయిలో ఉందంటే... దేశంలో ఉన్న సంస్ధలతో పోటీ పడ్డం లేదు, ప్రపంచంతో పోటీ పడుతుంది.  ఈ సంస్ధ ప్రపంచంలోనే 8వ స్ధానంలో ఉంది.  

అమూల్‌కు మిగతా సంస్ధలకు తేడాను కూడా గమనించాలి.  అమూల్‌ సంస్థలో ఏస్థాయిలో ప్రాసస్‌ఉందంటే.. పాలనుంచి నేరుగా చాక్లెట్లు తయారేచేసే విధంగా వారి ప్రాససింగ్‌ ఉంది.

మిగిలిన వాళ్లతో పోలిస్తే పాలసేకరణధరను అక్కచెల్లెమ్మలకు అధికంగా ఇస్తోంది. ఈ కంపెనీలో వాటాదారులందరూ పాలుపోసే అక్కచెల్లెమ్మలే కాబట్టి, లాభ ఆపేక్ష అన్నది కూడా అమూల్‌కు లేదు. లాభాలు అన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి తిరిగి అక్కచెల్లెమ్మలకు వెనక్కి ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్‌లోనే ఉంది. 


సహకార రంగంలో ఒక సంస్ధను ఎలా నడపగలుగుతాము, బాగా నడిపితే దాని భవిష్యత్‌ ఎలా ఉంటుందనేదానికి అమూల్‌సంస్థ ఒక నిదర్శనం. నిజంగా సహకార రంగంలో ఒక సంస్ధను బాగా నడిపితే, ప్రైవేటు వ్యక్తులు ఆ సంస్ధను  ఆక్రమించకపోతే, రైతులకు ఎలాంటి మేళ్లు జరుగుతాయన్నదానికి ఉదాహరణ అమూల్‌.  అధికారంలోకి రాగానే అమూల్‌ సంస్థను తీసుకు వచ్చాం. ఆ సంస్ధతో 2020, జూలై 21వ తేదీన మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత 2020  డిసెంబరు 2న రాష్ట్రంలో  అమూల్‌ పాలవెల్లువ ప్రాజెక్టును కూడా ప్రారంభించాం. 


*ఇప్పటికే నాలుగు జిల్లాల్లో అమూల్‌ సేకరణ*


చిత్తూరు, ప్రకాశం, వైయస్సార్, గుంటూరు నాలుగు జిల్లాల్లో ఇప్పటికే 722 గ్రామాల్లో విజయవంతంగా పాలసేకరణ జరుగుతోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్‌ అడుగుపెడుతోంది. 153 గ్రామాలలో పాలసేకరణకు అమూల్‌ ప్రాజెక్టు ఈ రోజు ప్రారంభిస్తున్నాం.


*రెండేళ్లలో దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఏపీ అమూల్‌*


అమూల్‌ ద్వారా వచ్చే రెండేళ్లలో పూర్తిగా కూడా గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2600 గ్రామాల్లో ఈ సంవత్సరంలోనూ, దశల వారీగా ఈ రెండు సంవత్సరాలు పూర్తయ్యేలోపు మొత్తంగా  9899 గ్రామాలలో అమూల్‌ను విస్తరించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు ప్రతి లీటరు పాలకు ఇప్పుడు ఉన్న ధర కన్నా రూ.5 నుంచి రూ.15 వరకూ ఎక్కువ రేటు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాం. 


*అమూల్‌ ద్వారా మేలు ఇలా*...


ఏపీ అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఇంత వరకు ఏం జరిగింది అన్నది పాడి రైతులకు అర్ధమయ్యేలా, అక్కచెల్లమ్మలకు అర్ధమయ్యేలా క్లుప్తంగా నాలుగు మాటలు చెప్తాను.  అమూల్‌ సంస్ధ రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు జిల్లాలలో 13,739 మంది మహిళా రైతుల దగ్గర నుంచి 52,93,000 లీటర్లను సేకరించింది. అందుకు వారికి రూ.24 కోట్ల 54 లక్షలు చెల్లించడం జరిగింది. ప్రతి లీటరు మీద ఇంతకముందు ఆ అక్కచెల్లెమ్మలు అమ్ముతున్న ధరల కంటే రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా అమూల్‌ సంస్ధ చెల్లించింది. దీంతో ఆ అక్కచెల్లెమ్మలు నుంచి కొనుగోలు చేసిన రూ.24 కోట్ల 54 లక్షలలో  గతానికి ఇప్పటికీ అదనంగా వచ్చింది అక్షరాలా రూ.4 కోట్ల 6 లక్షలు. అమూల్‌ ద్వారా  లీటరుకు రూ.5 నుంచి రూ.15కు పెంచి కొనుగోలు చేయడం వలన ఆ అక్కచెల్లెమ్మలకు మేలు జరిగిందని ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాను. 


*పదిరోజుల్లో పాలబిల్లు చెల్లింపు*

పాలకు కూడా ఈరోజు మిగతా డెయిరీలతో పోల్చితే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కూడా కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం వల్ల మన అక్కచెల్లెమ్మలకు ఆర్ధికంగా మరింత మంచి జరిగింది. అమూల్‌లో వాటాదారులు ఎవరూ అని అంటే పాలు పోసే అక్కచెల్లెమ్మలే. ఇదొక సహకార రంగ సంస్ధ. ఈ సహకార రంగ సంస్ధ బలంగా ఉంటే రైతులు, మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు మరింత మేలు జరుగుతుందన్నది అమూల్‌ సంస్ధను చూసిన ఎవరైనా చెప్పగలుగుతారని ఇంతకు ముందు గణాంకాలతో సహా మీ అందరికీ కూడా వివరించడం జరిగింది.


*సహాకార డెయిరీలు ఎందుకు మూతపడ్డాయి?*


 ఇవాళ నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే సహకార రంగం చూసినప్పుడు, సహకార రంగంలో ఇప్పుడు డెయిరీలు నష్టాలలో కూరుకుపోతున్నాయి, ఎందుకు మూతపడ్డాయి, ఎందుకు ప్రైవేటు డెయిరీలు అటు పాడి రైతులను, ఇటు వినియోగదారులను కూడా దోపిడీ చేయగలిగే పరిస్థితులలోకి ఎందుకు ఉన్నాయి అని చెప్పి చూస్తే.. .

ఇదే సహకార రంగంలో ఉన్న డెయిరీలకు పూర్తిస్థాయి ప్రాసెసింగ్‌ యూనిట్లు అమూల్‌ మాదిరిగా ఉండాల్సిన పరిస్ధితిలోకి లేకపోవడమే.  అంతే కాకుండా మార్కెట్‌ను పెంచుకోవడంలో ఈ సహకార డెయిరీలు ఆ స్ధాయికి ఎదగకపోవడం.  అన్నింటికీ మించి ఈ సహకార రంగ డెయిరీలలో మంచివి కొన్నింటిని ఏకంగా ప్రై వేటు వ్యక్తులు పూర్తిగా వాటిని ఆక్రమించేసుకుని, అవి ప్రైవేటు ఆస్తుల కింద మార్చుకుని అధ్వాన్నమైన పరిస్థితుల్లోకి పూర్తిగా ఈ డెయిరీలు వెళ్లిపోవడం. ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో  ప్రయోజనాలు ఉన్నందువల్ల వాళ్ల ఆదాయాలు పెంచుకునేందుకు, రాష్ట్రంలో సహకార వ్యవస్ధలను పూర్తిగా నాశనం చేసిన పరిస్ధితులు మన కళ్లెదుటే కనిపించేవి. వాటిని మార్చాలి అని తపన, తాపత్రయంతో అక్కచెల్లెమ్మలకు  మంచి జరగాలి అన్న ఆరాటంతో పుట్టుకొచ్చిన కార్యక్రమం ఇది. 


*బీఎంసీ–ఏఎంసీ*

ప్రతి గ్రామంలోను కూడా  2600 గ్రామాలలో మనం బీఎంసీలు అంటే బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్, ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్స్‌ని తీసుకొస్తున్నాం. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. గతంలో పాలు పోసేటప్పుడు నాణ్యత ఏమిటన్నది అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ తెలిసేది కాదు. ఆ పాలు పోసేటప్పుడే ఈ ఆటోమేటిక్‌ కలెక్షన్‌ యూనిట్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌ ఇవన్నీ కూడా మన గ్రామంలో మన దగ్గరే అందుబాటలో ఉన్నాయి కాబట్టి, మన కళ్ల ఎదుటనే మనం పోసే పాలకు అక్కడికక్కడే నాణ్యత మన గ్రామంలోనే తెలిసిపోతుంది. అలా తెలిసిన వెంటనే ఒక స్లిప్‌ కూడా మనకు ఇస్తారు. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు ఏ ఒక్కరూ  కూడా దోపిడీ కాకుండా, ఆ నాణ్యత వాళ్లకే కనిపిస్తుంది. ఆ నాణ్యతకు తగ్గట్టుగా అక్కచెల్లెమ్మలకు మంచి రేటు ఈరోజు అమూల్‌ ఇవ్వగలుగుతుంది. ఇంతకు ముందు కూడా అదే నాణ్యత, కానీ అక్కచెల్లెమ్మలు మోసపోయేవాళ్లు. కాబట్టి ఆ రేటు అక్కచెల్లెమ్మలకు వచ్చే పరిస్ధితి లేదు. ఈరోజు అమూల్‌ మోసం చేయడం లేదు కాబట్టి, నాణ్యత అక్కడికక్కడే బయటపడుతోంది. ప్రతి లీటరుకు రూ.5 నుంచి రూ.15 ప్రతి అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. ఈ అక్కచెల్లెమ్మలకు ఈ  మేలు ప్రతి గ్రామంలోనూ జరగాలి అన్న తపన, తాపత్రయంతో  దాదాపుగా 9899 గ్రామాలను గుర్తించడం జరిగింది.  9899 గ్రామాల్లో రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ప్రతి గ్రామంలోనూ మీ కళ్లెదుటనే బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్, అక్కడే ఆటోమేటిక్‌ కలెక్షన్‌ యూనిట్స్‌ తీసుకొచ్చి నాణ్యతను అక్కడే ధృవీకరించి అక్కచెల్లెమ్మలకు మేలు జరిగేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు వెచ్చించి అక్కచెల్లెమ్మలకు మంచి చేసే ఈ కార్యక్రమానికి కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. పనులు జరుగుతున్నాయి, రెండేళ్లలో పూర్తి కూడా అయిపోతుంది. అక్కచెల్లెమ్మల మహిళా సాధికారత కోసం చేస్తున్న కార్యక్రమాలు మీకందరికీ తెలిసినవే, అమ్మవడి, ఆసరా, చేయూత, వడ్డీలేని రుణాలు, సంపూర్ణ పోషణ దాదాపుగా 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించే కార్యక్రమం దిశగా అడుగులు వేయడం, ఇవి కాకుండా దిశ బిల్లు కానివ్వండి, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌లతో పాటు మద్య నియంత్రణ దిశగా మనమంతా కూడా అడుగులు వేస్తా ఉన్నాం. 


*పనులు, పోస్టుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకే*


వలంటీర్‌లు, గ్రామ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగ నియామకాల్లో 50 శాతం పై చిలుకు అక్కచెల్లెమ్మలను తీసుకురావడం, నామినేటెడ్‌ పోస్టులతో పాటు నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి 50 శాతం పదవులన్నీ కూడా అక్కచెల్లెమ్మలకు వచ్చేలా, ఉండేలా ఏకంగా చట్టాన్ని రూపొందించాం. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, బీసీ కార్పొరేషన్లు ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా సగం అక్కచెల్లెమ్మలకు వచ్చే విధంగా చట్టాలు తీసుకుని వచ్చినందువల్ల ఈరోజు మహిళా సాధికారత అనేది ఏ స్ధాయిలో ఉందనేది,  మనందరి ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు.


అందులో భాగంగానే ఈ రోజు అక్కచెల్లెమ్మలకు మరింత మేలు జరగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. చేయూతలో కూడా వారికి ఇచ్చే డబ్బులు కూడా ఆ అక్కచెల్లెమ్మలు మరింత మెరుగ్గా వాటిని ఉపయోగపెట్టుకునే విధంగా వారికి మేలు జరగాలని చెప్పి, ఆ అక్కచెల్లెమ్మలకు ఉపాధి అవకాశాలు వాళ్ల ఇంటిముందుకే రావాలని చెప్పి, వారు పెట్టిన పెట్టుబడికి నష్టపోకూదనే ఉద్ధేశ్యంతో పెద్ద, పెద్ద సంస్ధలతో మనం టై అప్‌ కూడా చేశాం. ఆ అక్కచెల్లెమ్మలకు నేరుగా వారి గడప వద్దకే అవకాశాలు తీసుకొస్తున్నాం. ఐటీసీ, అమూల్, రిలయన్స్, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్, హిందుస్థాన్‌ లీవర్‌ వంటి పెద్ద, పెద్ద సంస్ధలతో టైఅప్‌ చేసి ఆ అక్కచెల్లెమ్మలకు నేరుగా వ్యాపార అవకాశాలు వారిద్దరినీ కలిపి గడపవద్దకే తీసుకొచ్చి, వారికి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకేస్తుంది. 


*చేయూత ద్వారా సాయం*


 చేయూతలో 1 లక్షా 12 వేల యూనిట్లు ఆవులు, గేదెలు కొనుగోలు చేయించి అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. ఈ చేయూత ద్వారా టైఅప్‌ చేసుకున్న లక్షా 12 వేల యూనిట్లు ఆ అక్కచెల్లెమ్మలకు ఉచితంగా మనమే  రూ.75 వేలు చేయూతకు టైఅప్‌ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ అన్నింటి వల్ల అక్కచెల్లెమ్మలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. 


*చివరగా*..

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు కూడా మంచి చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ ఎ.బాబు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 


వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అమూల్‌ ఎండీ ఆర్‌ ఎస్‌ సోధి, సబర్‌ డెయిరీ ఎండీ డాక్టర్‌ బీఎం పటేల్‌లు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image