దివంగత నేత వైఎస్ఆర్ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోనే పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టాం

 *దివంగత నేత వైఎస్ఆర్ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోనే పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టాం*


*: రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి*


అనంతపురం, జూలై 27 (ప్రజా అమరావతి) :

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత రాష్ట్రంలో ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న డిపిఆర్సీ భవనంలో నవరత్నాలు - పేదలందరికీ ఇల్లులో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణ సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిలతో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి నిర్వహించారు..

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు అసంపూర్తిగా నిలిచిపోయాయని, గతంలో ఉన్న రుణాలను చెల్లించేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారని, వాటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలన్నారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇళ్లు లేకున్నా ఇల్లు ఇదివరకే మంజూరైనట్లు సాఫ్ట్వేర్లో చూపిస్తోందని, ఆ లోపాన్ని సరిదిద్ది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. డి.హిరేహాల్ మండలంలో ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న 3 వేల మంది లబ్ధిదారులకు సంబంధించి సచివాలయాల్లో వారి వివరాలను కంప్యూటర్లో నమోదు చేయలేదని, స్థలం లేదని పక్కన పెట్టారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ చేనేత వీవర్స్ కు నల్లరేగడి నేలలో ఇంటి పట్టాలు ఇచ్చారని, ఇళ్ల నిర్మాణాలకు లోతుగా భూమిని తవ్వాల్సి వస్తోందని, ఇందుకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సమస్యను పరిష్కరించాలన్నారు.

ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీ ల వద్ద అన్ని మౌలిక వసతులను ఇళ్ల నిర్మాణాలతో పాటు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లులో భాగంగా అర్బన్ ప్రాంత లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను కేటాయించడం జరిగిందని, ఇందుకోసం వారు ప్రతిరోజూ 12 నుంచి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాల్సి వస్తోందన్నారు. వీరికి ప్రభుత్వం అందించే స్టీలు, సిమెంటు, ఇసుక తప్ప లేబర్ కు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఎక్కువ మొత్తం ఖర్చు అవుతోందని, జిల్లా వ్యాప్తంగా మెటల్, ఇటుకలు, లేబర్ కూలీలు అన్నింటినీ నిర్దిష్టమైన ధరలను నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామాగ్రికి జిల్లా వ్యాప్తంగా ఒకే రకమైన ధరలు నిర్ణయించాలన్నారు.

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గృహ నిర్మాణాల కోసం ఒక లక్ష 15 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేందుకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు.

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీలకి సంబంధించిన లేఔట్ లలో ఇసుక డంప్ లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారని, ఇండెంట్ కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేయలేకపోతున్నారన్నారు. కామారుపల్లి లేఔట్ లో వర్షం వల్ల నీరు చేరిందని, దాన్ని మరొక చోటుకు మార్పు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల లేఔట్ ల కోసం 43 ఎకరాల భూ సేకరణ చేయడం జరిగిందని, దానికి సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.

గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గంలోని 2,3 లేఔట్ లలో గృహాలు నిర్మించేందుకు ఇబ్బందులు ఉన్నాయని, వాటిని మరొకచోటికి మార్పు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 3 లేఔట్ లలో వాటర్ పైప్ లైన్ వేయలేదని, ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటిని అందుబాటులో ఉంచాలన్నారు.మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ లకు ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాల కన్నా అదనంగా మొత్తాలను అందజేయాలన్నారు.

కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో ప్రతి రెండు ఇళ్లకు మధ్య ఒక షేర్ వాల్ ను నిర్మించాలన్నారు.ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Comments