రైతును రాజుగా చేయాలన్న వైఎస్సార్ కలను నిజం చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి


- రైతును రాజుగా చేయాలన్న వైఎస్సార్ కలను నిజం చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి 


- రైతులకు మేలైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ / ముదినేపల్లి, జూలై 19 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలను సీఎం జగన్మోహనరెడ్డి నిజం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామంలో జరిగిన రైతుభరోసా సదస్సుకు మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ రెండేళ్ళలో చేపట్టిన కార్యక్రమాల్లో ఎక్కువగా వ్యవసాయం పైనే దృష్టి పెట్టారన్నారు. రైతు రాజులా ఉండాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కలగనే వారని అన్నారు. ఆ కలను నెరవేర్చడానికి ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోయినా ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వాటికి అవసరమైన సొంత భవనాలను నిర్మించాలని, పనిచేసేందుకు ఉద్యోగులను నియమించాలని, ప్రతి నియోజకవర్గంలోనూ భూసార పరీక్షలను నిర్వహించే ల్యాబ్ లను నెలకొల్పాలని, మెట్ట ప్రాంతాల్లో సాగునీటి సమస్య రాకుండా జలకళ ద్వారా బోర్లు ఏర్పాటు చేయాలని, రెండు పంటలకు సాగునీరు అందించాలని అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్ట్ కు మధ్యలో నిలిచిపోయి ఉన్నాయని, వాటన్నింటినీ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. రైతును రాజులా చూడాలంటే పెట్టుబడి సాయాన్ని అందించాలని భావించారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అందకపోతే రైతుభరోసా కేంద్రాల ద్వారా అందే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రైతులు నష్టపోకుండా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారన్నారు. రైతు తన కాళ్ళపై తాను నిలబడుతూ, దేశానికి వెన్నుముకగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండిన పంటలో 90 శాతం సివిల్ సప్లయిస్ కు వస్తుందన్నారు. గతంలో రైతులకు రెండు, మూడు నెలలకు కూడా ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. రైతుకు ధాన్యం డబ్బులు సకాలంలలో చెల్లించాలన్న ఉద్దేశ్యంతో 21 రోజుల నిబంధనను సీఎం జగన్మోహనరెడ్డి విధించుకున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి రైతులకు రూ.3,300 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. 21 రోజుల గడువు దాటి రూ.1,204 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సివిల్ సప్లయిస్ వినియోగించుకున్న తర్వాత మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ విధంగా కేంద్రం నుండి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రూ. 5,056 కోట్లు రావాల్సి ఉందన్నారు. కేంద్రం నుండి బకాయిలు రాకపోయినప్పటికీ బీజేపీ నేతలు మాత్రం విజయవాడలో పత్రికా సమావేశాలను నిర్వహించి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. రైతులు అమాయకులని, ఏం చెప్పినా నమ్ముతారన్న భ్రమలో బతుకుతున్నారన్నారు. రెండు రోజుల్లో నాబార్డ్ నుండి రూ. 1,600 కోట్లు రానున్నాయని తెలిపారు. ఈ నెల 25 నాటికి కేంద్ర ప్రభుత్వం కూడా మరో రూ. 1,600 కోట్లు విడుదల చేస్తానని చెప్పిందన్నారు. ఈ నెలాఖరు నాటికి రైతులకు చెల్లించాల్సిన రూ.3,300 కోట్ల మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. రైతులకు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ నివాస్ నిర్ణయించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆలోచనలను అమలు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా సమర్ధవంతమైన నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. ఇటువంటి కలెక్టర్ కృష్ణాజిల్లాకు రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులంతా జగన్ సైన్యంలా చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి మరిన్ని కార్యక్రమాలను చేపడతారని మంత్రి కొడాలి నాని అన్నారు. అనంతరం రైతులకు నూతన వరి వంగడాల విత్తనాలను పంపిణీ చేశారు. ముందుగా పుంగనూరు జాతి ఆవులకు మంత్రి కొడాలి నాని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీలు కల్పలత, కరీమున్నీసా, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, వడ్డీ కార్పోరేషన్ చైర్ పర్సన్ ఎం గాయత్రీ సంతోషి, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, తహసీల్దార్ కే శ్రీనివాస్, ఎండీవో గుంజా మాధవరావు, ఏడీఏ స్వర్ణలత, ఏవో కే విద్యాసాగర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు గిరిజా, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యేశ్వరి, ఎంపీపీ అభ్యర్ధి రామిశెట్టి సత్యనారాయణ, వైసీపీ నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, బొర్రా శేషుబాబు, కే గోవిందరాజులు, పాతూరి అంజయ్య, పుట్టి సుబ్బారావు, శీలం రామకృష్ణ, అచ్యుత రాంబాబు, గూడపాటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.