సబ్బవరం-నర్సీపట్నం-తుని మధ్య రోడ్లను జాతీయ రహదారులగా అభివృద్ధి చేయండి

 *సబ్బవరం-నర్సీపట్నం-తుని మధ్య రోడ్లను జాతీయ రహదారులగా అభివృద్ధి చేయండి


*

- హైవేస్ మంత్రి గడ్కరీకి వైఎస్సార్సీ ఎంపీల బృందం విజ్ఞప్తి*


న్యూఢిల్లీ, జూలై 27 (ప్రజా అమరావతి): విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి తుని మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులా అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌ సభాపక్ష నాయకులు శ్రీ పీవీ మిధున్‌ రెడ్డి నేతృతంలో ఎంపీల బృందం మంగళవారం శ్రీ గడ్కరీతో సమావేశమైంది. 

విశాఖ జిల్లాలో విస్తృతమైన రోడ్డు నెట్‌ వర్క్‌ ఉన్నప్పటికీ నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని శ్రీ విజయసాయి రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సబ్బవరం జంక్షన్‌ నుంచి వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది, రావికమతం, కొత్తకోట మీదుగా నర్శీపట్నం వరకు ఉన్నరాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్‌-009), అలాగే నర్శీపట్నం నుంచి గన్నవరం, కోటనందూరు మీదుగా తుని వరకు ఉన్న రహదారి (ఎస్‌హెచ్‌ -156) అత్యంత రద్దీ కలిగిన రహదారులైనందున వాటిని జాతీయ రహదారులగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ప్రతిపాదించిన ఈ రెండు జాతీయ రహదారుల పొడవు 109 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పారు. ఈ రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులగా అభివృద్ధి చేయడం వలన అవి కోల్‌కత్తా-చెన్నై, రాయపూర్‌-విశాఖపట్నం, రాజమండ్రి నుంచి కొయ్యూరు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, అరకు, బౌదర మీదుగా విజయనగరం వరకు ప్రతిపాదించిన (ఎన్‌హెచ్‌ 516ఈ) జాతీయ రహదారి, పెందుర్తి నుంచి కొత్తవలస, లక్కవరపు కోట, శృంగవరపు కోట మీదుగా బౌదర వరకు ప్రతిపాదించిన ఎన్‌హెచ్‌ 516బీలతో అనుసంధానం చేయడానికి మార్గం సుగమం అవుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. అలాగే వడ్డాది నుంచి పాడేరు, అనకాపల్లి నుంచి చోడవరం, నర్సీపట్నం నుంచి తాళ్ళపాలెం, నర్సీపట్నం నుంచి రేవుపోలవరం రాష్ట్ర రహదారులు కూడా జాతీయ రహదారులతో అనుసంధానం అవుతాయి. దీని వలన విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా రోడ్డు అనుసంధానం జరిగినట్లు అవుతుంది. మన్యంలోని అరకు, పాడేరు వంటి ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం వలన గిరిజనులు తమ అటవీ ఉత్పాదనలను త్వరితగతిన తమ సమీప మార్కెట్లకు తరలించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.

జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీని కలిసిన ఎంపీల బృందంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీ.సత్యవతి, అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి, విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎం.వీ.వీ. సత్యనారాయణ, విజయనగరం ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్‌, అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ, రాజమండ్రి ఎంపీ శ్రీ మార్గాని భరత్‌, శ్రీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌, శ్రీ మోపిదేవి వెంకటరమణ, శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీ సంజీవ్‌ కుమార్‌, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, చోడవరం ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ తదితరులు ఉన్నారు.