నందిగామలో మొదటి దశ నాడు - నేడు పాఠశాలలను అంకితం చేసిన మంత్రి కొడాలి నాని 


- నందిగామలో మొదటి దశ నాడు - నేడు పాఠశాలలను అంకితం చేసిన మంత్రి కొడాలి నాని 
- విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్ల వంపిణీ  నందిగామ (కృష్ణాజిల్లా), ఆగస్టు 16 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా నందిగామలో మొదటి దశ మన బడి నాడు - నేడు పాఠశాలలను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రజలకు అంకితం చేశారు. సోమవారం మన బడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా రెండవ దశ పనులకు ప్రారంభోత్సవం జరిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సీఎం జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 3,600 కోట్ల వ్యయంతో మొదటి దశ పనులు పూర్తయ్యాయన్నారు. రెండవ విడతలో రూ.4,500 కోట్ల వ్యయంతో దాదాపు 16 వేల పాఠశాలల్లో ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రూ. 800 కోట్ల విలువైన జగనన్న కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత ఏడాది రూ. 650 కోట్లతో 42 లక్షల మంది విద్యార్థులకు అందజేశామన్నారు. ఈ ఏడాది మరో 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ఓటు హక్కు కూడా లేని పిల్లల భవిష్యత్తు కోసం రాజకీయాలకతీతంగా నాడు - నేడు కార్యక్రమాన్ని సీఎం జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. పాఠశాలలను అభివృద్ధి చేయాలని, మంచి విద్యను అందించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ అడగలేదన్నారు. తల్లిదండ్రుల స్థానంలో ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల కోసం సీఎం జగన్మోహనరెడ్డి ఆలోచన చేశారన్నారు. తన పిల్లలకు ఏ విధంగా విద్యను అందించారో, ఎటువంటి దుస్తులు ఇచ్చారో, ఏ రకమైన భోజనం పెట్టారో అదే విధంగా రాష్ట్రంలోని పిల్లలందరికీ ఇవ్వాలన్న మంచి మనస్సు సీఎం జగన్ కు ఉందన్నారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో ఉన్న 45 వేల పాఠశాలల్లో సమస్యలు లేని పాఠశాల లేదన్నారు. మరుగుదొడ్లు, తాగునీరు, వంట షెడ్లు ఉండేవి కాదని, స్లాబ్ లకు ఉన్న పెచ్చులు ఊడి విద్యార్థుల మీద పడేవని, కూర్చునేందుకు పిల్లలు కూడా ఉండేవి కాదన్నారు. బ్లాక్ బోర్డులు కూడా పనికిరాని స్థితిలో ఉండేవన్నారు. సిబ్బంది కొరత కూడా ఉండేదని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ముందుగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాలను అందజేసి, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాడు - నేడులో పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ కల్పన, జిల్లా కలెక్టర్ జే నివాస్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ ఎం ఆరుణకుమార్, మున్సిపల్ చైర్మన్ పద్మావతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ శోభిత, డీఈవో తాహేరా సుల్తానా, సమగ్ర శిక్షా అడిషినల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయదుర్గ, మున్సిపల్ కమిషనర్ జయరాం, మండల తహసీల్దార్ డీ చంద్రశేఖర్, ఎంఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Comments