ఘనంగా ముగిసిన రెండు రోజుల రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు.

 *ఘనంగా ముగిసిన రెండు రోజుల రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు**31 టెక్నికల్ ట్రేడ్స్ లో 72 మంది విజేతలు* 


*కేరళలో జరిగే రీజనల్ లెవల్ పోటీలకు విజేతలు ఎంపిక*


*విజేతలకు నగదు బహుమతి, మెమొంటో, పార్టిపేషన్ సర్టిఫికేట్లు అందజేత*

తాడేపల్లి (ప్రజా అమరావతి);

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కెఎల్ యూనివర్సిటీపాటు మరో 8వేదికల్లో రెండు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు ఘనంగా ముగిశాయి. మొత్తం 31 టెక్నికల్ ట్రేడ్స్ లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన 72 మంది రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీల్లో విజేతలుగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. అనంతరం విజేతలందరికీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ) చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి. పార్థసారథి, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రసాదరావు, డీన్ స్కిల్ డెవలప్మెంట్ డాక్టర్ శ్రీనాథ్, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ ఎమ్ సుమన్ తదితరులు పాల్గొని విజేతలకు నగదు బహుమతితోపాటు మెమొంటోలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వీరితోపాటు డెమో స్కిల్స్  విభాగం కింద 6 ప్రాంతీయ సంప్రదాయ నైపుణ్య పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన 12 మందికి కూడా నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 


అనంతరం రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వారందరినీ  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ) చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి అభినందించారు. ఇప్పటి నుంచే సెప్టెంబర్ 20 నుంచి కేరళలో జరిగే రీజనల్ లెవల్ పోటీలకు సిద్ధం కావాలని.. తద్వారా రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. అంతర్జాతీయస్థాయిలో ఉండే నైపుణ్యాలు మన రాష్ట్రంలోని యువతకు కూడా అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని.. అందుకు అనుగుణంగానే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఇందుకోసం ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 25 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని వారు తెలియజేశారు.


అనంతరం విశ్వవిద్యాలయ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సారధి వర్మ మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నైపుణ్య పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉండే  సృజనాత్మకత మరింత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్య అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.గెలుపొందిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు విజయవంతం కావడానికి కృషి చేసిన ఎపిఎస్‌ఎస్‌డిసి, కెఎల్ యూనివర్సిటీ సిబ్బందిని వారు అభినందించారు.