గ్రామపంచాయతీల్లో ఇంటి పన్ను స్వీకరణకు

తాడేపల్లి (ప్రజా అమరావతి);    గ్రామపంచాయతీల్లో ఇంటి పన్ను స్వీకరణకు


ఏర్పాటుచేసిన మొబైల్ అప్లికేషన్ పై సిబ్బంది అంత అవగాహన పెంచుకుని, అక్టోబర్ 7 లేదా 8 తేదీ నుంచి పన్ను సేకరించడం ప్రారంభించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజాశంకర్ అన్నారు. పన్ను సేకరణ మొబైల్ అప్లికేషన్ కు సంబంధించి అక్టోబర్ 1, 2021 అంటే శుక్రవారం నాడు సి పిఆర్&ఆర్ డి కార్యాలయం నుంచి వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి, మాస్టర్ ట్రైనర్స్ కు ఎపిస్వాన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ, చాలా సులభంగా, పారదర్శకత తో, ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఈ అప్లికేషన్ ద్వారా ఇంటి పన్ను సేకరించ వచ్చని, వారం రోజుల్లో జిల్లాలోని సిబ్బంది అందరూ శిక్షణ పూర్తి చేసుకోవాలని, మాస్టర్ ట్రైనర్స్  క్షుణ్ణంగా, కూలంకషంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అంటూ, విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మాస్టర్ ట్రైనర్స్ లను ఆయన అభినందించారు. శిక్షణ సమయంలో, అలాగే శిక్షణ పూర్తయ్యాక ఎలాంటి సందేహాలు ఉన్నా నేరుగా సి పిఆర్&ఆర్ డి కార్యాలయాన్ని  సంప్రదించవచ్చని, మండల స్థాయిలో రెండు లేదా మూడు రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునే లా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. 

13 జిల్లాల్లో ఎంపికచేసిన 116 మందికి శిక్షణ ఇచ్చారు, అప్లికేషన్ ద్వారా సేకరించిన పన్నులు  నేరుగా  ట్రెజరీ  అకౌంట్  లోకి  జమవుతాయి.  ఇప్పటికే  దీని ద్వారా దాదాపు 77, 44, 041 ఇళ్లకు సంబంధించిన డేటాను సాఫ్ట్ వేర్ లో నిక్షిప్తం చేశారు. శిక్షణ కార్యక్రమంలో 13 జిల్లాల్లో ఎంపిక చేసిన సిబ్బంది, పంచాయతీరాజ్ అధికారులు, సాంకేతిక శిక్షకులు పాల్గొన్నారు.