*మేమంతా ఆంధ్రాలోనే కొనసాగుతాం...
*
*విజయనగరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన కొఠియా వాసులు
*ఒడిశా ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడి
*కొఠియా గ్రామాల ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ః కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, అక్టోబర్ 25 (ప్రజా అమరావతి) ః ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొఠియా పరిధిలోని గంజాయిభద్ర, పట్టుచెన్నూరు, పగులుచెన్నూరు పంచాయతీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారిని, అధికారులను కలిశారు. మేమంతా ఆంధ్రాలోనే ఉంటామని చేసిన తీర్మాన పత్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందాలని, సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ అందరి అధికారుల సమక్షంలో వినతి పత్రం సమూహంగా అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ కు విచ్చేసిన కొఠియా గ్రామాల ప్రజలను జిల్లా అధికారులు మేళ తాళాల నడుమ, సన్నాయి వాయిద్యాలతో సాదరంగా స్వాగతించారు. ఆడిటోరియంలో వారందరికీ ప్రత్యేకంగా కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. అనంతరం కలెక్టర్, జేసీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులు సుమారు 50 మంది కొఠియా వాసులను పూలమాలలు వేసి, దుశ్సాలువాలతో సత్కరించారు. స్వీట్స్, పండ్లు అందజేశారు.
కలెక్టర్ ఎ. సూర్యకుమారి మాట్లాడుతూ ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల్లో వివాదాలు గత కొన్నేళ్లుగా సాగుతున్నాయని, వీటికి సంబంధించిన పాత నివేదికలన్నీ పరిశీలించామని వెల్లడించారు. ఇది చాలా సున్నితమైన సమస్య.. దీన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలను, సలహాలను అనుసరించి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ లోగా జిల్లా పరిధిలో చేయాల్సిన అన్ని పనులు చేస్తామని చెప్పారు. చట్టబద్ధంగా, న్యాయపరంగా అందాల్సిన అన్ని సేవలను అందిస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. కొఠియా గ్రామాల నుంచి ఇంతమంది ధైర్యంగా వచ్చి ఆంధ్రలోనే ఉంటామని చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. కొఠియా గ్రామాల ప్రజలకు ధైర్య, సాహసాలకు అభినందనలు తెలుపుతున్నాను అని కలెక్టర్ ఉద్వేగంగా అన్నారు. కొఠియా వాసులు అందజేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే నివేదిస్తామని పేర్కొన్నారు.
*ఐటీడీఏ సేవలను వినియోగించుకోవాలి*
"కొఠియా గ్రామాల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందజేస్తోంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం పరిధిలో చేయాల్సిన అన్ని అభివృద్ది పనులూ చేపట్టాం. ఇంకా చేయాల్సిన పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేస్తాం" అని కలెక్టర్ సూర్యకుమారి పేర్కొన్నారు. కొఠియా గ్రామాల ప్రజలు పార్వతీపురం ఐటీడీఏ సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక మండల, గ్రామ పరిధిలోని సేవలను పొందాలని సూచించారు. ఇప్పటికే చాలా మందికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే పట్టాలు అందజేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
*శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు*
ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో తలెత్తున్న వివాదాలను పరిష్కరించేందుకు ప్రణాళికాయుంతంగా ముందుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్యపై ఇప్పటికే నివేదించాం.. వారి మార్గదర్శకాలు, సూచనల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్థానిక మంత్రులతో చర్చించి తదుపరి చర్యలపై ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలని, సమస్య పరిష్కారానికి సహాయ సహకారాలను అందజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
*ఆత్మీయ సత్కారం.. సహఫంక్తి భోజనం*
జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కొఠియా గ్రామాల ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగం మర్యాదలు చేసింది. వచ్చిన అందరికీ పండ్లు, స్వీట్స్ అందజేసింది. పూలమాలలు, దశ్సాలువాలతో సత్కరించింది. అనంతరం సహఫంక్తి భోజనం ఏర్పాటు చేసింది. స్థానిక కలెక్టరేట్ క్యాంటీన్లో అందరికీ మాంసాహారంతో భోజనం పెట్టించింది. దీనిపై కొఠియా గ్రామాల నుంచి వచ్చిన మహిళలు, పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జేసీలు కిశోర్ కుమార్, మహేష్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావు, ఎస్డీసీ పద్మావతి, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు ఇతర జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
*ఆంధ్రా మా పుట్టినిల్లు*
ః చోడపల్లి బీస్, మాజీ సర్పంచ్, పగులుచెన్నూరు
ఆంధ్రప్రదేశ్ మా పుట్టినిల్లు. మేం ఎప్పటికీ ఆంధ్రాతోనే ఉంటాం. ఒడిశా పెద్దలు, అధికారులు మమ్మల్ని పలు విధాలుగా బెదిరిస్తున్నారు. మేం ఎవరి బెదిరింపులకు భయపడం. ఆంధ్ర ప్రభుత్వం మాకు ఎన్నో మంచి పనులు చేస్తోంది. సంక్షేమ పథకాలు అందిస్తోంది. అన్ని పథకాలూ బాగున్నాయి. ఆంధ్ర నాయకులు, అధికారులు మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం.
*ఒడిశా పోలీసులు కేసులు పెడతామంటున్నారు*
ః గెమ్మెలి బీస్, ఉప సర్పంచ్, గంజాయిభద్ర
మేం ఆంధ్రాలో ఉండాలని నిర్ణయించుకున్నందు వల్ల ఒడిశా పోలీసులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేమంతా ఆంధ్రాతోనే ఉంటాం. అందరం కలిసి కట్టుగా తీసుకున్న నిర్ణయం ఇది. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదు.
*ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారు*
ః తాయి సింగారమ్మ, కోనధార గ్రామం.
మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆంధ్రాతో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే ఒడిశా నాయకులు, అధికారులు అక్కడి ప్రజలను ప్రలోభాలు పెడుతున్నారు. ఒడిశాతో ఉంటే అవి ఇస్తాం.. ఇవి ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. పట్టాలు రద్దు చేస్తామని అధికారులు భయపెడుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయి.