ఉపాధి పనుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేసిన కూలీలు

 *కొనుకొండ్లలో ఉపాధి హామీ పథకం పనులను తనిఖీ చేసిన కేంద్ర బృందం*


*: ఉపాధి పనుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేసిన కూలీలు*


కొనకొండ్ల (వజ్రకరూరు), అక్టోబర్ 28 (ప్రజా అమరావతి) :


ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం లోని కొనుకొండ్ల పంచాయతీలో గురువారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ అమరేంద్ర ప్రతాప్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ పడియా, రాష్ట్ర పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమీషనర్ లు శివప్రసాద్, కళ్యాణ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ సిరి, తదితరులు పరిశీలించారు.


ముందుగా కొనుకొండ్ల పంచాయతీలో అవెన్యూ ప్లాంటేషన్ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును, రకరకాల పనుల వివరాలని, రిజిస్టర్ లను కేంద్ర బృందం తనిఖీ చేసింది. అనంతరం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మీరు ఉపాధి పనులు చేసారా, ఎన్ని రోజులు పని చేశారు, ఎంత డబ్బు వచ్చింది, ఈ ఏడాది ఎన్ని రోజులు పని చేశారు బ్యాంకులో వేలిముద్ర పెట్టి డబ్బులు తెచ్చుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అడిగిన వెంటనే మీకు ఉపాధి పనులు కల్పిస్తున్నారా అంటూ ఈరమ్మ, రామాంజినమ్మ, ఆదిలక్ష్మి తదితర కూలీలను కేంద్ర బృందం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ ఉపాధి పనుల కల్పనతో తాము ఉపాధి పొందుతున్నామని, బ్యాంకులో వేలిముద్ర పెట్టి డబ్బులు వెంటనే తెచ్చుకుంటామని, అడిగిన వెంటనే మాకు పనులు కల్పిస్తున్నారని తెలిపారు.*


అనంతరం కేంద్ర బృందం గ్రామ పరిధిలోని రైతు సుధాకర్ భార్య నాగమణికి చెందిన పర్కులేషన్ పాండ్ ను పరిశీలించారు. పర్కులేషన్ పాండ్ ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేశారో, ఎంత ఖర్చయింది తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రైతు మోహన్ రావు పొలంలో డగౌట్ ఫాండ్ లను కేంద్ర బృందం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కింద ఇలాంటి పని చేసినా రికార్డుల్లో నమోదు చేయాలని కేంద్ర బృందం అధికారులకు సూచించింది. ఆ తర్వాత కేంద్ర బృందం రైతు రాజశేఖర్ పొలంలో చెందిన సరిహద్దు కందకాలను, రైతు శ్రీనివాస్ కు చెందిన పొలంలో డగౌట్ ఫాండ్ లను పరిశీలించారు. అనంతరం హౌసింగ్ కాలనీ లో చేపట్టిన రహదారి పనులను వారు పరిశీలించారు. ఆ తర్వాత ఉపాధిహామీ కింద 40 లక్షల రూపాయలతో చేపట్టిన గ్రామ సచివాలయ భవన నిర్మాణ వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు.


తదనంతరం కేంద్ర బృందం గ్రామ సచివాలయం ఆవరణంలో ఉపాధిహామీ కూలీలతో కేంద్ర బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్ ) మీకు ఎం జరుగుతుందో తెలుసా, జాబ్ కార్డులు అందరికీ వచ్చాయా, పని అడిగిన వెంటనే ఇస్తున్నారా అంటూ కూలీలతో అరా తీశారు. అనంతరం కూలీలు మాట్లాడుతూ పని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నారని, ఉపాధి పనులు వల్ల తాము వలసలు పోకుండా ఇక్కడే ఉపాధి పొందుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల కల్పన, వివిధ రకాల పనులు చేపట్టడంపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చిన్న తాతయ్య, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఎపిడి విజయలక్ష్మి, సూపరింటెండెంట్ శైలజ, ఉపాధిహామీ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మేట్లు తదితరులు పాల్గొన్నారు.