తెలుగు మరియు సంస్కృత భాషల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

 *తెలుగు మరియు సంస్కృత భాషల అభివృద్ధికి ప్రభుత్వం కృషి*  *:రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత  అకాడెమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి* 


అనంతపురం , అక్టోబర్ 28 (ప్రజా అమరావతి);


తెలుగు మరియు సంస్కృత భాషల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ శ్రీమతి డా.నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.


 గురువారం ఉదయం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లోని పాలిమర్ మరియు సైన్స్ విభాగంలో జరిగిన భాషా చైతన్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


 ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ తెలుగు భాష ప్రాకృతం, సంస్కృతం వంటి గొప్ప భాషల సమ్మేళనం అని తెలిపారు. దక్షిణ భారత దేశ భాషలన్నిటిలోనూ సంస్కృత ప్రభావం కనిపిస్తుందన్నారు. తమిళ భాష 30-40 శాతం మలయాళం 50 శాతం, దాదాపు కన్నడ భాష మొత్తం సంస్కృత భాష నుండి గ్రహించ బడినవేనని తెలిపారు. 

 

యునెస్కో నివేదిక ప్రకారం అంతరించిపోతున్న భాషల్లో  తెలుగు భాష కూడా ఉంది కనుక తెలుగు భాషకు తగిన గుర్తింపు, గౌరవం తీసుకురావడంతో పాటూ భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు భాష అభివృద్ధి కొరకు నూతనంగా అకాడమీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల వల్ల తెలుగు భాష విశిష్టత తగ్గిపోతోందని, విద్యా వ్యవస్థలో లోపాలను గుర్తించి మార్పులు తీసుకురావడానికి, విద్యావ్యవస్థను పటిష్ట పరచడానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. మార్కులే ప్రామాణికంగా భావించే ధోరణి తల్లిదండ్రుల్లో ఉందని, అలాంటి విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 


సదస్సులో తెలుగు భాషలోని సాహిత్య మాధుర్యాన్ని ఈతరం వారికి తెలియజేసే విధంగా పద్యాలను ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. 

దేశభాష లందు తెలుగు లెస్స అని  కీర్తించిన శ్రీ కృష్ణదేవరాయల పేరు మీద ఏర్పాటు చేసుకున్న విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. భాషాభివృద్ధికి ఎస్కేయూ ఉపకులపతి రామకృష్ణా రెడ్డి చేస్తున్న విశేషమైన సేవలను కొనియాడారు.


అంతకుముందు గౌరవ అతిథి ఎస్కేయూ ఉపకులపతి ఎం రామకృష్ణ రెడ్డి, రెక్టార్ కృష్ణ నాయక్, రిజిస్ట్రార్ కృష్ణ కుమారి తెలుగు భాష ప్రాముఖ్యతను, ఆవశ్యకతను సదస్సులో వివరించారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి, ఎస్.ఎస్.బీఎన్ మాజీ ప్రిన్సిపాల్ మరియు రచయిత రమేష్ నారాయణ, తెలుగు సాహిత్య పరిశోధకులు డా. అంకె శ్రీనివాస్ మరియు సంస్కృత సాహిత్య పరిశోధకులు డా.ఆశావాది సుధామవంశీ తదితరులు పాల్గొని తెలుగు మరియు సంస్కృత భాషల యొక్క విశిష్టతను కొనియాడారు.


 ఈ కార్యక్రమంలో ఎస్కేయూ ఆర్ట్స్ కలశాల ప్రిన్సిపాల్ బాల సుబ్రమణ్యం, వర్సిటీ పరిధిలోని ఇతర కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనా మరియు బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.