వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామ


నెల్లూరు నవంబర్ 22 (ప్రజా అమరావతి):--జిల్లాలోని వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామ


ని రాష్ట్ర విద్యుత్తు అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు రాష్ట్ర  జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీ కే వి ఎన్ చక్రధర్ బాబులతో కలసి ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.   తొలుత వారు  నెల్లూరు నగరం శివార్లలోని భగత్ సింగ్ నగర్ కాలనీ, అహ్మద్నగర్, నెల్లూరు గ్రామీణ ప్రాంతంలోని పొట్టే పాలెం గ్రామాలను  పరిశీలించారు.వారు భగత్ సింగ్ నగర్ కాలనీలో చుట్టూ కలియతిరిగి ఉధృతంగా  ప్రవహిస్తున్న పెన్నా నదిని పరిశీలించారు. వరద నీరు తగ్గడంతో  కాలనీకి తిరిగి వచ్చిన కొద్దిమంది ప్రజలతో మంత్రులు మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా  జలవనరుల శాఖ మంత్రి  అక్కడి ఇళ్లల్లోకి వరద నీరు చేరుకున్న సంఘటనను వివరిస్తూ  మొన్నటి అర్ధరాత్రి వారందరినీ ప్రత్యేక  బస్సుల్లో నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాల లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు. వారికి కావలసిన మంచినీరు, భోజన సదుపాయం కల్పించామని ఇంచార్జి మంత్రికి వివరించారు.  అనంతరం మంత్రులు అహ్మద్నగర్ చేరుకొని   పాలిటెక్నిక్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న కగ్గా గోపి( 18)  వరదల కారణంగా చనిపోవడంతో అతని తల్లిదండ్రులైన శీను, నాగమణిలను మంత్రులు కలిసి పరామర్శించారు.  మంత్రులను చూడటంతో వారు బోరున విలపించారు. దీంతో మంత్రులు వారిని ఓదార్చి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల బ్యాంకు చెక్కును పరిహారంగా వారికి అందజేశారు. తదుపరి మంత్రులు లు నెల్లూరు గ్రామీణ ప్రాంతంలో జొన్నవాడ- బుచ్చిరెడ్డిపాలెం పోయే దారిలో పొట్టే పాలెం కలుజు వరద ప్రవాహాన్ని పరిశీలించారు.  తదనంతరం పొట్టే పాలెం  గ్రామంలో పర్యటించి ఏటి గట్టుకు పడిన గండిని, అక్కడి నీటి ప్రవాహాన్ని,  గండికి అడ్డుకట్టగా వేసిన ఇసుక మూటలను,  నీటిలో మునిగిన పంటలను వరి పంటలను పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల్లో 47 వేల మంది నిరాశ్రయులు కాగా వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి మంచినీరు, ఆహారము తదితర సదుపాయాలు కల్పించామన్నారు.  జిల్లాకు చెందిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి కి నెల్లూరు లో నెలకొన్న వరద సమస్యలను తెలపడం జరిగిందన్నారు.  దీంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారన్నారు.  వార్డు, గ్రామ సచివాలయాల  పరిధిలో కార్యదర్శులు, వాలంటీర్లు ద్వారా ప్రతి కుటుంబానికి 5800 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా 25 కిలోల బియ్యము, ఒక కిలో కందిపప్పు, ఒక కిలో ఉల్లిపాయలు, ఒక లీటర్ పామాయిల్, ఒక కిలో ఆలుగడ్డలు పంపిణీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు.  అలాగే రైతులు వాళ్లు నష్టపోయిన పంటలకు కూడా ఎన్యూమెరేషన్ చేయించి నష్టపరిహారం తోపాటు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.  అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు కలెక్టర్లకు మంత్రులకు సమీక్షలు నిర్వహిస్తూ,  ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తం చేస్తున్నారన్నారు.  సోమశిల నుండి  గత నలభై సంవత్సరాలుగా ఇంత పెద్ద ఎత్తున అంటే 5 లక్షల క్యూసెక్కుల మేరకు వరద నీరు వచ్చిన దాఖలాలు లేవన్నారు.  గత సంవత్సరం 3.90 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందన్నారు.  గత రెండు రోజులుగా వరద నీరు తగ్గిపోతుందని పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించామన్నారు. గత సంవత్సరం  భగత్ సింగ్ నగర్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, ఇస్లాం పేట కు చెందిన ఐదు వేల కుటుంబాలు వరద బారిన పడటంతో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వరద నీరు రాకుండా  శాశ్వతంగా అడ్డుకట్ట వేసి ఆదుకోవడం కోసం ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి అడగంగానే ముఖ్యమంత్రి నూరు కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. 

జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం కింద వెయ్యి రూపాయల నగదు అందించామన్నారు.  ఎప్పుడు లేని విధంగా వరద నీటి నుండి 5400 మందిని ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్, పోలీసు బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారని,  వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.  జిల్లాలో మేజర్ నష్టాలు గాని, ప్రాణ నష్టం గాని జరగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం శ్రమించిందన్నారు.   ఒకే ఒక దుర్ఘటన జరిగిందని,   పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి ప్రమాదవశాత్తు వరద నీటిలో చనిపోయారని అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.  వరద నీటిలో చుట్టుముట్టిన ఇళ్లకు సచివాలయం వారిగా గుర్తించి బాధిత కుటుంబాలకు 5800 రూపాయలను అందజేస్తామన్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నిత్యావసర సరుకులను ఉచితంగా ఈ రోజు (సోమవారం) నుండి  పంపిణీ చేస్తామన్నారు.  దెబ్బతిన్న జాతీయ రహదారులు, ఇతర రహదారులు, చెరువులను ఎప్పటికప్పుడు వెంటనే పునరుద్ధరించామన్నారు.  జిల్లాలో 1746 చెరువులు పూర్తిగా నిండాయని వరదల కారణంగా 294 మేజర్  చెరువులు పెద్దగా దెబ్బతినడంతో వాటన్నిటిని పునరుద్ధరించే మన్నారు.  ఒక్క కోవూరు చెరువు దెబ్బతినడంతో మూడు గ్రామాలు ముంపుకు గురయ్యాయన్నారు.  జిల్లాలో వరద సహాయ చర్యలు  చేపట్టుటకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి పది కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు.  ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందించి ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి,  జిల్లా ఇన్చార్జ్ మంత్రికి, జిల్లాకు చెందిన మంత్రులు,  ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.  ఈ పర్యటనలో మంత్రుల వెంట నెల్లూరు పురపాలక కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ , నెల్లూరు గ్రామీణ  ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్ డి ఓ  శ్రీ హుస్సేన్ సాహెబ్ తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.