పెద్ద చదువులు చదవడానికి తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డు కాకూడదనే

 

నెల్లూరు నవంబర్ 30 (ప్రజా అమరావతి):


     పెద్ద చదువులు చదవడానికి తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డు కాకూడదనే


ఏకైక లక్ష్యంతో  జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.


     మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మూడవ త్రైమాసికం నకు గాను  11,03,076 మంది విద్యార్థులకు సంబంధించిన 

మొత్తం రూ.686 కోట్ల రూపాయలు వారి తల్లుల ఖాతాలో నేరుగా జమ అయ్యే విధంగా  బటన్ నొక్కి  ముఖ్యమంత్రి  ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , పేద సామాజిక వర్గం నుండి పెద్ద చదువులు చదివే వారి సంఖ్య బాగా పెరగాలని, వారి తలరాతలు మారాలని, వారికి అండగా తోడుగా ఉండటానికి ఈ పథకాన్ని తీసుకు వచ్చామన్నారు . గతంలో తన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన తమను కలచి వేసిందని,  70 వేల రూపాయల ఫీజు చెల్లించలేక, చదువుకోవాలనే ఆశ తీరక , తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఒక తల్లి చెప్పిందని, అప్పుడే ఈ  కష్టం ఎవరికీ రాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నామని తెలిపారు. అటువంటి సంఘటనలు మరలా ఎవరి జీవితంలో పునరావృతం కాకూడదనే ఈ  పధకం రూపకల్పన చేశామన్నారు.


    ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లోని  తిక్కన ప్రాంగణం నుండి  జిల్లా కలెక్టర్  శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పాల్గొన్నారు . అనంతరం నెల్లూరు జిల్లాకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకం లో భాగంగా మొత్తం రూ42,65,28,976 రూపాయల చెక్కును  కలెక్టర్ విద్యార్థుల తల్లులకు అందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ ఈ విద్యాసంవత్సరంలో 122 కోట్ల రూపాయలు ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు అందించామన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చదువు కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తద్వారా సమాజంలో ఉన్నత స్థితి కి ఎదుగుతారని  గట్టిగా నమ్ముతారని తెలిపారు. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులను సమకూర్చి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా తయారు చేస్తున్నామన్నారు. అందుచేతనే ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా మున్సిపల్ పాఠశాలల్లో  సీట్లు ఖాళీగా లేవనే పరిస్థితి వచ్చిందని తెలిపారు.  అదేవిధంగా  జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత  ధ్యేయంగా అక్షర క్రాంతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు లక్షా 33 వేల మంది నిరక్షరాస్యులను చదివించడానికి సాయంత్రం బడులు నిర్వహిస్తూ గత మూడు మాసాల నుండి కృషి చేస్తున్నామన్నారు.


జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారులయిన కొందరు విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నెల్లూరు కి చెందిన కుమారి డి. సాయి శరణ్య మాట్లాడుతూ తాను కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో బి సి ఎ చివరి సంవత్సరం చదువుతున్నానని, తనకు తండ్రి లేరని కేవలం తన తల్లి  దేవసేన చిరు సంపాదన మీదే ఆధారపడి జీవిస్తున్నామని, ఈ పథకం లేకపోతే తన చదువు కొనసాగించటం చాలా కష్టమయ్యేదని అన్నారు. మరొక లబ్ధిదారు కుమారి కె.గురు ప్రేమి మాట్లాడుతూ తన  తల్లి లోకేశ్వరి టైలరింగ్ పని చేస్తూ తనను చదివిస్తుందని , ముఖ్యమంత్రి  తనకు ఒక అన్నగా నిలిచారన్నారు. మరొక లబ్ధిదారు హేమంత్ మాట్లాడుతూ తాను ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నానని తనలాంటి పేద విద్యార్థులకు ఈ పథకం  ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పి. స్రవంతి, జాయింట్ కలెక్టర్లు శ్రీ గణేష్ కుమార్, శ్రీమతి రోజ్ మాండ్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ యు.చిన్నయ్య , బిసి సంక్షేమ శాఖ అధికారి శ్రీ బి. వేంకటయ్య , గిరిజన సంక్షేమ అధికారి శ్రీ రోశీ రేడ్డి  తదితరులు పాల్గోన్నారు     

Comments