వ్యాక్సినేషన్ అవ్వని వారు , 2వ డోసు వేసుకోవలసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలికొవ్వూరు (ప్రజా అమరావతి);


ఓమీక్రాన్ కేసులు దేశంలో నమోదు అవుతున్నాయని, ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ అవ్వని వారు , 2వ డోసు వేసుకోవలసిన  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు విజ్ఞప్తి చేసారు. 


సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు  కోవిడ్ మార్గదర్శకాలు, వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే తొలి డోసు తీసుకున్న వారు నిర్ణిత సమయం అయిన తదుపరి వారి దగ్గర లోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిపై  ఓమీక్రాన్ ప్రభావం చూపించే అవకాశం లేదని గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా కరోనా కేసులు కూడా నమోదు అవ్వడం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఏ వైరస్ అయిన సరే వ్యాక్సినేషన్ ద్వారా వ్యాప్తి నివారించడం, ఇమ్యూనిటీ పెరగటానికి అవకాశం ఉందన్నారు.


కోవిడ్ మార్గదర్శకాలు పాటించక, మాస్కు ధరించకపోవడం, శానిటైజెషన్ వంటి విషయాల్లో నిర్లక్ష్యం తగదని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, కూడళ్లు, దేవాలయాలు, ప్రార్ధన మందిరాలు, మసీదు లు, వేడుకలలో 500 లోపు ప్రజలను మాత్రమే పరిధికి లోబడి అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి ప్రదేశాల్లో వొచ్చే వారు విధిగా మాస్క్ ధరించడం తప్పనిసరి అన్నారు. షాపు యజమానులు, నిర్వాహకులు అక్కడికి వొచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించిన వారినే అనుమతించాలన్నారు. నియమాలను అతిక్రమిస్తే సంబంధించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, అపరాధ రుసుము వసూలు చెయ్యడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మాస్కు లేని వారిని అనుమతిస్తే, ఇటువంటి షాపు లను తాత్కాలికంగా మూసి వెయ్యడం జరుగుతుందని, ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.  5 నుంచి 6 కోవిడ్ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో కోవిడ్ మార్గదర్శకాలు మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ కేసులు నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ మన మధ్యనే ఉందన్న విషయం గుర్తించుకొని మసలు కోవాల్సిన ఆవశ్యకత ను గుర్తుచేశారు. ఆటోల్లో, బస్సుల్లో, గుంపులు గా ఉన్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. కేసులు పెరిగితే కఠిన నిబంధనలు మళ్ళీ అమలు చేసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యత ను పాటించాల్సి ఉందన్నారు.