నూతన సంవత్సర వేడుకలకు మంత్రి కొడాలి నాని దూరం- నూతన సంవత్సర వేడుకలకు మంత్రి కొడాలి నాని దూరం 


- ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం 

- ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి 

- నాయకులు, కార్యకర్తలు, ప్రజలెవరూ రావద్దని మనవి గుడివాడ, డిసెంబర్ 31 (ప్రజా అమరావతి): 2022 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపంలో శరవేగంగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, దీనిలో భాగంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని కూడా పాటించాలన్నారు. గతంలో మాదిరిగా శానిటైజర్లను కూడా వినియోగించాలన్నారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని, భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. గత ఏడాది కన్నా మెరుగైన జీవనాన్ని గడిపేందుకు దేవుడు సాయం చేయాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచాలన్నారు. ప్రతి ఏటా నూతన సంవత్సరం మొదటి రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలను తెలియజేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం లేదని, అందుబాటులో కూడా ఉండడంలేదని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికార, అనధికార ప్రముఖులు తన నివాసానికి గాని, పార్టీ కార్యాలయానికి గాని, క్యాంప్ కార్యాలయానికి గాని రావద్దని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.