యువతకు ఉద్యోగ కల్పనలో మరో ముందడుగు

 

                                     

 


• యువతకు ఉద్యోగ కల్పనలో మరో ముందడుగు 


• ఎపిఎస్‌ఎస్‌డిసి, మాన్స్టర్ డాట్ కామ్ మధ్య ఒప్పందం

• ప్రముఖ కంపెనీలతో సంయుక్తంగా వర్చువల్ జాబ్ మేళాలు

• జాతీయస్థాయిలో సుమారు 6లక్షల ఉద్యోగాలకు యువతను అనుసంధానించడం లక్ష్యం


అమరావతి (ప్రజా అమరావతి):


రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ప్రముఖ జాబ్ పోర్టల్ మాన్స్టర్ డాట్ కామ్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఎపిఎస్‌ఎస్‌డిసి, మాన్స్టర్ డాట్ కామ్ అవగాహనకు వచ్చాయి. ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు, మాన్స్టర్ డాట్ కామ్ ప్రతినిధి షణ్ముక్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా ఎపిఎస్‌ఎస్‌డిసి సహకారంతో Monster.com లో నమోదు చేసుకున్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన అభ్యర్థులకు వర్చువల్ కెరీర్ ఫెయిర్లు, వెబినార్లు ఇతర ఈవెంట్లను సంయుక్తంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్, నాలెడ్జ్ సెంటర్లతోపాటు మాన్స్టర్ పోర్టల్ లోని మెటీరియల్స్, బ్లాగులు, నిపుణుల సలహాలు, సూచనలు ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉద్యోగార్థులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా జాతీయస్థాయిలో అందుబాటులో ఉన్న సుమారు 6 లక్షల ఉద్యోగాలతో రాష్ట్రంలోని యువతను అనుసంధించడం ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యంగా నిర్ణయించారు.  


ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు మాట్లాడుతూ.. మోర్ కంపెనీస్.. మోర్ జాబ్స్ అనే కాన్సెప్ట్ తో మాన్స్టర్ డాట్ కామ్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. మాన్స్టర్ డాట్ కామ్ సంస్థ వర్చువల్ ద్వారా ఉద్యోగ మేళాలకు ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా నిరుద్యోగ యువతను అనుసంధానిస్తామని.. తద్వరా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. 

అంతకుముందు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాన్స్టర్ సీఈవో ఎపిఎసి & ఎంఈ శేఖర్ గారిసా మాట్లాడుతూ..ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఎపిఎస్‌ఎస్‌డిసితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువతను ప్రముఖ పరిశ్రమలతో అనుసంధానించడం కోసం ఇదొక ముందడుగని ఆయన చెప్పారు.  

ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు, సీజీఎం కార్పొరేట్ కనెక్ట్ సత్యప్రభ, మాన్స్టర్ డాట్ కామ్ ప్రతినిధి షణ్ముక్ పాల్గొన్నారు.