శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుపతి, డిసెంబరు 16 (ప్రజా అమరావతి): తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన అడ్వాన్స్డ్ కార్డియాక్ క్యాథడ్రేషన్ ల్యాబ్‌ను గురువారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. ముందుగా శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి ల్యాబ్‌కు ప్రారంభోత్సవం చేశారు. ల్యాబ్‌లోని వైద్యవ్యవస్థ పనితీరును డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసుపత్రిని అక్టోబరు 11న ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించినట్టు తెలిపారు. ఆసుపత్రిలో 40 ఐసియు బెడ్లు, 30 సాధారణ బెడ్లు కలిపి మొత్తం 70 బెడ్లు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రెండు నెలల కాలంలో 16 ఓపెన్ హార్ట్ సర్జరీలను స్పెషలిస్టు డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో 25 రోజుల వయసు గల చిన్నారుల నుండి 18 ఏళ్ల వరకు గల యువత ఉన్నారని, శ్రీవారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇంకా 170 మంది చిన్నారులు ఆపరేషన్ల కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారని వెల్లడించారు.
దేశంలోనే మొదటిసారిగా అడ్వాన్స్డ్ కార్డియాక్ క్యాథడ్రేషన్ ల్యాబ్‌ను ఇక్కడ ఏర్పాటు చేశామని, ఇందుకోసం రూ.5 కోట్ల నుండి రూ.6 కోట్ల వ్యయం చేశామని చెప్పారు. ఈ ల్యాబ్ ద్వారా పుట్టుకతో ఏర్పడే గుండె రంధ్రాలను ఆపరేషన్ అవసరం లేకుండా కీహోల్ విధానంలో పూడ్చడం జరుగుతుందన్నారు. ఈ విధానం వల్ల 24 గంటల్లోనే రోగులను డిశ్చార్జి చేస్తారని, వారంలోపు పిల్లలు యథావిధిగా పాఠశాలకు వెళ్లడం తదితర పనులు చేసుకోవచ్చని వివరించారు. ఈ ఆపరేషన్లు అన్నింటినీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్నట్టు తెలిపారు. నెలకు 100 ఆపరేషన్లు చేసేందుకు తగ్గట్టుగా అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, వైద్య సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించామన్నారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు.
అంతకుముందు ఐసియు వార్డులు, సాధారణ వార్డులను పరిశీలించి చిన్నారుల తల్లిదండ్రులతో ఛైర్మన్ మాట్లాడారు. పీలేరుకు చెందిన సుహాన(2) తల్లి సైదాని, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన శ్రావణ్‌రెడ్డి(3నెలలు) తల్లి భార్గవి, వరంగల్‌కు చెందిన చిన్నారి తల్లి రాధ తదితరులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో తమ పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా జరిగాయని చెప్పారు. వైద్య సౌకర్యాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, బర్ద్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి, సిఎస్ ఆర్ఎమ్ఓ శ్రీ శేష శైలేంద్ర, చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, ఏఈవో శ్రీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.