జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై స్టోరీ

 జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై స్టోరీ
నెల్లూరు, డిసెంబర్ 4 (ప్రజా అమరావతి): 


  ఎన్నో ఏళ్లుగా ఎటువంటి హక్కులు లేకుండా ప్రభుత్వ గృహాల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా తీపి కబురు అందించింది. గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వం గృహాలు మంజూరు చేసి రుణం విడుదల చేయడంతో లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకున్నారు. ఆ రుణాన్ని చాలామంది లబ్ధిదారులు తీర్చలేదు.అది ఇప్పుడు వడ్డీ తో కలిసి పెద్ద మొత్తం గా మారింది.ఇంటికి సంబంధించిన పత్రాలన్నీ ప్రభుత్వం వద్దే ఉండగా ఇంటిపై లబ్ధిదారులకు ఎటువంటి హక్కు లేకుండా పోయింది.  దీంతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఆ ఇంటి పై పూర్తి హక్కులు కల్పించాలనే దృఢ సంకల్పంతో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా వన్ టైం సెటిల్మెంట్ విధానంతో  ప్రభుత్వం నిర్ణయించిన కనీస మొత్తాన్ని చెల్లించినచో లబ్ధిదారుల పేరిట లేదా ప్రస్తుతం ఉన్న కొనుగోలుదారుని పేరిట ఆ గృహాన్ని ప్రభుత్వ ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేయించి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తోంది. డిసెంబర్ నెల 21వ తేదీ నాటికి ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించి సంపూర్ణ గృహ హక్కు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 


  1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది నిర్మించిన ఇళ్ల పై లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం “ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద” యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. దీనికోసం నాలుగు దశల్లో అర్హత గుర్తింపు ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది.జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు, వీఆర్వోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి ప్రస్తుత గృహ అనుభవదారుడు ఎవరు? స్థలం, సరిహద్దులు గుర్తిస్తున్నారు. ఆ తర్వాత అర్హులను ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో సుమారు 3.37 లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ అనంతరం అర్హులైన లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. నిర్దేశించిన రుసుము చెల్లించిన వారికి త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 5923 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొని  6,11,87,475 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. 


చెల్లించాల్సిన రుసుము వివరాలు

..................... ...... 

ఈ ఇళ్లకు సంబంధించి రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రూ. 10 వేలు, మున్సిపాలిటీలో రూ. 15 వేలు, కార్పొరేషన్ల పరిధిలో రూ. 20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువ పత్రం జారీ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కన్నా వాస్తవ లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉన్న రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవ లబ్ధిదారుడు నుంచి ఇల్లు కొనుగోలు చేసిన వారు, వారి వారసులు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 20 వేలు, మున్సిపాలిటీల్లో రూ 30 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ. 40 వేలు చెల్లిస్తే పూర్తి హక్కులు దక్కుతాయి. 


ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

- జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) విదేహ్ ఖరె

 - జిల్లా వ్యాప్తంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సర్వే వేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్దేశించిన డిసెంబర్ 21 గడువులోగా లబ్ధిదారులను పూర్తిస్థాయిలో గుర్తించేందుకు హౌసింగ్, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో, సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకొని నామమాత్రపు చెల్లింపుతో సంపూర్ణ గృహ హక్కు పొందవచ్చు.


లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం 

- : వేణుగోపాల్, ప్రాజెక్టు డైరెక్టర్,  గృహ నిర్మాణ సంస్థ, నెల్లూరు

.....................................

 సూచించిన మొత్తముకన్నా మిగిలిన బకాయి మొత్తము రద్దు. 

స్టాంపు డ్యూటీ మినహాయింపు కలదు. 

రిజిస్ట్రేషన్ ఉచితం, సంబంధిత గ్రామ / వార్డు సచివాలయములోనే  జరుప బడును. 

సంపూర్ణ గృహహక్కు పత్రమును ఉపయోగించి బ్యాంకుల నుండి (విద్య, వివాహ తదితర అవసరములకు) ఋణమును పొందవచ్చును.

అర్హులైన వారు వెంటనే తమ సంబంధిత గ్రామ / వార్డు సచివాలయములో సంప్రదించండి. 


లబ్ధిదారుల అభిప్రాయాలు

..................

పది లక్షల ఆస్తి మా సొంతం అయ్యింది

- మండి పావని, చంద్రబాబు నగర్ సి బ్లాక్, బుజబుజ నెల్లూరు.

- నా పేరు మండి పావని. మాకు 1999 సంవత్సరంలో ప్రభుత్వం వారు ఇంటి స్థలం మంజూరు చేయగా మేము ప్రభుత్వం నుంచి 25 వేల రూపాయలు లోను తీసుకుని పక్కా ఇంటిని నిర్మించుకున్నాం. అయితే మా ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ రుణాన్ని చెల్లించలేక పోయాము. ప్రస్తుతం మా ఇల్లు, స్థలం విలువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మేము ప్రభుత్వం నిర్ణయించిన 20 వేల రూపాయలను చెల్లిస్తే ప్రభుత్వమే మా పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. 


2. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి వుంటా

- జీనత్, చంద్రబాబు నగర్, బి బ్లాక్, బుజబుజ నెల్లూరు.

- మాకు 2004లో ప్రభుత్వం 40 వేల రూపాయల రుణం మంజూరు చేయగా మేము ఇంటిని నిర్మించుకున్నాము. నా భర్త వర్క్ షాప్ లో పని చేస్తాడు. మేము తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. ప్రస్తుతం మా లాంటి పేదలకు ప్రభుత్వం కల్పించిన సంపూర్ణ శాశ్వత గృహ హక్కు పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మాకు ఇంటిపై పూర్తి హక్కులు కల్పించడంతో మాకు సొంత ఇల్లు ఉందనే ధైర్యం కలిగింది. 


3. మాలాంటి నిరుపేదలకు సంపూర్ణ గృహ పథకం కొండంత ధైర్యం

- నాజూని, జనశక్తి నగర్, నెల్లూరు. 

- ఎప్పటి నుంచో మాకు ఎటువంటి హక్కులు లేని మేము ఉంటున్న ఇళ్లకు ప్రభుత్వం శాశ్వత హక్కు కల్పించడం, ఆ ఇంటిని ప్రభుత్వ ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం నేను ఊహించలేకపోయాను. 2008లో 43 వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రుణం పొంది ఇంటిని నిర్ణయించుకున్నాము. నా భర్త మంచంపై అనారోగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు కేవలం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం ఒక వరంగా భావిస్తున్నాను. నాలాంటి నిరుపేదలకు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం.