సచివాలయంలో ఆయుర్వేద మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన అజయ్ కల్లాం
అమరావతి,21 డిశంబరు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ విభాగం మరియు సచివాలయ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు అనగా ఈనెల 24వరకూ నిర్వహించనున్న ఆయుర్వేద మెగా ఆరోగ్య శిబిరాన్ని మంగళవారం సియం ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం అనేది వేదాలు,పంచ భూతాల ఆధారంగా ప్రకృతి పరంగా అందించబడిన విశిష్టమైన వైద్య విధానమని పేర్కొన్నారు.ఈవైద్య విధానం అల్లోపతి వైద్య విధానం కంటే ఏమాత్రం తీసిపోనిదని,వ్యాధికి మూలం నుండి చికిత్స అందిస్తుందని తెలిపారు.అదే విధంగా స్వదేశీ వైద్య విధానాలైన ఆయుర్వేదం,యునాని, హోమియోపతి వంటివి ఏమాత్రం తక్కువైన విధానాలు కావని స్పష్టం చేశారు.ఇటీవల కాలంలో ఆయుర్వేద వైద్య విధానం తిరిగి మంచి ప్రాచుర్యంలోకి రావడం మంచి పరిణామమని ఈవిధానంలో వ్యాధికి మూలం నుండి చికిత్స అందిస్తుందని ఏవిధమైన దుష్పరిణామాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.మన దేశంలో పుట్టిన అద్భుతమైన ఈఆయుర్వేద వైద్య విధానాన్ని ఈవిధమైన మెగా వైద్య శిబిరాల ద్వారా తెల్సుకుని పూర్తి అవగాహన కల్పించుకుని బాహ్య ప్రపంచానికి దీని ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని అజయ్ కల్లాం సూచించారు.చిన్ననాటి నుండి ఆయుర్వేద వైద్యా విధానాన్నిపాటిస్తూ ఆరోగ్యంగా ఉన్నానని ఆయన తెలిపారు.
ఆయుష్ కమీషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా ఉన్న సచివాలయంలో ఆయుర్వేద వైద్య మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం ముఖ్య ఉద్ధేశ్యం ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణతోపాటు ప్రజల్లో విస్తృత ప్రచారం అవగాహన నిమిత్తం ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.రానున్న ఏడాది కాలంలో 5కోట్ల రూ.లు విలువైన కోవిడ్ నియంత్రణ సంబంధిత వివిధ రకాల ఆయుర్వేద మందులను ఉచితంగా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని,అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.ఈమెగా వైద్య శిబిరం ద్వారా వివిధ సాధారణ వ్యాధులకు నిపుణులైన వైద్యులచే ఉచితంగా పలు సలహాలు సూచనలతోపాటు అవసరమైన మందులను పొందవచ్చని కల్నల్ రాములు సూచించారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా వంటి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆయుర్వేద వైద్యం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.ఈ మెగా ఆరోగ్య శిబిరంలో 10 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు,ఐదుగురు హోమియో వైద్య నిపుణులు,ఐదుగురు యోగా గురువులతో పాటు మొత్తం 40 మంది వైద్య బృందం పాల్గొని నాలుగు రోజులపాటు ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారని చెప్పారు.ఈవైద్య శిబిరంలో వైద్య సేవలు మరియు మందులు అన్నీ ఉచితంగా అందింస్తున్నారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి వర్యులు వైయస్.జగన్మోహన్ రెడ్డి వారి జన్మదినోత్సవం సందర్భంగా సియం ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం కేక్ కట్ చేశారు.అదే విధంగా ‘ఆయుష్ ద్వారా ఆరోగ్యం’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.వ్యాధి నిరోధకతను పెంచే కిట్లను ఈమెగా వైద్య శిబిరంలో పాల్గొన్నఉద్యోగులకు అజయ్ కల్లాం చేతులమీదగా అందించారు.ఈవైద్య శిబిరం ప్రాంగణంలో ఉద్యోగుల్లో ఆయుర్వేద వైద్యం పట్ల అవగాహనను పెంపొందించే లక్ష్యంతో వివిధ రకాల ఔషధ,సుగంధ మొక్కలను ప్రదర్శనలో ఉంచడంతో పాటు ఆయా మొక్కల విశిష్టతను తెలియజేసే పలు కరపత్రాలను,పుస్తకాలను అందుబాటులో ఉంచారు.
ఈకార్యక్రమంలో ఆయుష్ విభాగానికి చెందిన పులువురు అధికారులు,డాక్టర్లు, సచివాలయం ఉద్యోగులు,పలువురు ఆయుర్వేద తదితర వైద్య విద్యలను అభ్యసిస్తున్న విద్యార్దులు పాల్గొన్నారు.