- వాకింగ్ చేస్తే ఏమొస్తుందన్న చంద్రబాబుకు మనువడితో ఆడుకోమని రెస్ట్ వచ్చింది
- 150 నియోజకవర్గాల్లో 2 కోట్ల మందిని కలిశారు
- ప్రజలతో మమేకమైన జగన్ నవరత్నాలిస్తున్నారు
- చంద్రబాబు మాటలు నమ్మితే సర్వనాశనమై పోతాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 21 (ప్రజా అమరావతి): గత ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన సీఎం జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి వాకింగ్ చేస్తే ఏమొస్తుందని మాట్లాడిన చంద్రబాబుకు తన మనువడితో ఆడుకునే రెస్ట్ వచ్చిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని అలంకృత ఫంక్షన్ హాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు రిజిష్టర్డ్ దస్తావేజుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడన్నారు. సాక్షాత్తూ పిల్లనిచ్చిన ఎన్టీఆర్ దగ్గర నుండి సైకిల్‌ను ఎలా కొట్టుకొచ్చాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. అదే ప్రతిపక్ష నేతగా సీఎం జగన్మోహనరెడ్డి ఉన్న సమయంలో ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గరగా ఉండి చూశారన్నారు. రాష్ట్రంలోని 150 నియోజకవర్గాల్లో దాదాపు 2 కోట్ల మంది ప్రజలను కలిశారన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, 104, 108 సేవలు, ఇంటింటికీ సార్టెక్స్ బియ్యం పంపిణీ, 30 లక్షల మంది పేదలకు ఇళ్ళనిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద పేదలకు ఇళ్ళపట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అధికారులు అవగాహన కల్పిస్తుంటే చంద్రబాబు మాత్రం వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెబుతున్నాడని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఇంటిని కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదని ప్రశ్నించారు. గుడివాడ నియోజకవర్గంలో కూడా 24 వేల 343 మంది లబ్ధిదారులు రూ.10 లు చెల్లిస్తే వారి ఇళ్ళపట్టాలను రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు పట్టాను ఇంటికి తీసుకువచ్చి అందజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల కోట్ల మేర బ్యాంక్ రుణాలను పేదలు చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వానికి రూ.2,500 కోట్లు చెల్లిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరించి లబ్ధిదారుల ఇంటి పట్టాలను విడిపించడం జరుగుతుందన్నారు. పొరపాటున చంద్రబాబు చెప్పిన మాటలు వింటే సర్వనాశనమైపోతామని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్ హయాంలో 100 ఎకరాల భూముల్లో పేదలకు స్థలాలను కేటాయించారన్నారు . ఆ తర్వాత దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో 77 ఎకరాలు, సీఎం జగన్మోహనరెడ్డి హయాంలో దాదాపు 300 ఎకరాల భూములను పేదలకు ఇళ్ళపట్టాలుగా కేటాయించడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఏం చేసినా విమర్శించడమే చంద్రబాబు పనిగా మారిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, జిల్లా కలెక్టర్ జే నివాస్, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కే మాధవీలత, శ్రీవాసు నుపూర్ అజయ్ కుమార్, కే మోహనరావు, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, ఎంపీపీలు పెయ్యల ఆదాం, జీ పుష్పరాణి, గుడివాడ ఆర్డీవో జీ శ్రీనుకుమార్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, హౌసింగ్ పీడీ కే రామచంద్రన్, ఈఈ శ్రీదేవి, డీఈ రామోజీనాయక్, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు ఉప్పాల రాము, మండలి హనుమంతరావు, పాలేటి చంటి, మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.