పీఏసీలు త్వరితగతిన కాగ్‌ నివేదికలను పరిశీలించాలి

 *పీఏసీలు త్వరితగతిన కాగ్‌ నివేదికలను పరిశీలించాలి*

ప్రజా ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను మరింత సులభతరం చేయాలి

పీఏసీ శతాబ్ది సదస్సులో శ్రీ  వి.విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ, డిసెంబర్ 4 (ప్రజా అమరావతి): కాగ్‌ నివేదికలు అందుబాటులోకి వచ్చిన వెంటనే  ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అంశాల ప్రాధాన్యత తగ్గిపోక ముందే పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ(పీఏసీ)లు వాటిని పరిశీలించాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ శ్రీ విజయసాయిరెడ్డి సూచించారు.  తద్వారా పీఏసీలను మరింత శక్తివంతంగా చేయగలుగుతామని ఆయన తెలిపారు. అంతేగాక కాగ్‌ నివేదికలను పీఏసీ తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు, వ్యవధితో ఒక జాబితాను తయారుచేసి వార్షిక క్యాలెండర్‌ను సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్లమెంట్‌లో జరిగిన పార్లమెంటు, రాష్ట్రాల పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీల అధ్యక్షుల సదస్సులో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ శ్రీ వి.విజయసాయిరెడ్డి ప్రసంగించారు. పీఏసీల సిఫార్సుల అమలు: సమయపాలనకు కట్టుబడి, కచ్చితమైన సమ్మతి కోసం మెకానిజం అనే అంశంపై ఆయన మాట్లాడారు. 

ప్రస్తుతం పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) మన దేశంలో ప్రజా ఆర్థిక  జవాబుదారీతనానికి సంబంధించిన ప్రధాన సంస్థలలో ఒకటిగా ఉందని, అందువల్ల దాని పనితీరును మెరుగుపరచడానికి మనమంతా నిరంతరం ప్రయత్నించాలని శ్రీ  విజయసాయిరెడ్డి అన్నారు. సిఫార్సుల అమలు ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపైనే పీఏసీ పనితీరు ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. పార్లమెంటరీ కమిటీల యంత్రాంగం ద్వారా పరిశీలన, పర్యవేక్షణ, జవాబుదారీ సూత్రాలు మన పాలనా వ్యవస్థలో భాగంగా మారాయని తెలిపారు. ఈ సూత్రాలు ఎంత విజయవంతంగా కాలపరీక్షలో నిలిచాయనే దానికి పీఏసీ శతాబ్ది ఉత్సవాలు ఒక అద్భుతమైన నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. 


పీఏసీ సిఫార్సుల అమలుపై ప్రభావం చూపే సవాళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పీఏసీ సిఫార్సులను ప్రభుత్వాలు ఏవిధంగా ఆచరణలో ఉంచాయన్నది అంచనా వేయడానికి మానిటరింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధం చేయడం అనేది ప్రధానమైదని అన్నారు. ప్రస్తుతం పీఏసీ సిఫార్సులపై సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకున్న చర్యలను ప్రత్యుత్తరాల సమర్పణను రియల్‌ టైంలో ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షించేందుకు ఆడిట్‌ పారా మానిటరింగ్‌ సిస్టమ్‌ పోర్టల్‌ని వినియోగిస్తున్నామని, అయితే ఈ పోర్టల్‌ ద్వారా ప్రభావవంతంగా పనిచేసేందుకు రెండు ప్రధాన సమస్యలు అడ్డుగా ఉన్నాయని ఆయన తెలిపారు.

మంత్రిత్వ శాఖలు చర్య తీసుకున్న ప్రత్యుత్తరాల సమర్పణలో ఆలస్యం కావడం అనే సమస్యను పరిష్కరించాలన్నారు. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు సకాలంలో తీసుకున్న చర్యల ప్రత్యుత్తరాలను సమర్పించేలా చూసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో సెక్రటరీ స్థాయి నోడల్‌ అధికారిని నియమించాలని ఆయన సూచించారు. అంతేగాక ఈ ఆన్‌లైన్‌ విధానంలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి ఆడిట్‌ పారా మానిటరింగ్‌ సిస్టమ్‌ పోర్టల్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. పబ్లిక్‌ ఫైనాన్స్‌లో పారదర్శకతను మరింత సులభతరం చేయడానికి పీఏసీని  మరింత మెరుగుపరిచే మార్గాలను సైతం పరిశీలించాలన్నారు. 

మరో ప్రధానమైన సవాలు సిఫార్సుల సమయపాలన అని, ప్రస్తుతం కాగ్‌ నివేదికలను పీఏసీ సత్వర పద్ధతిలో చర్చించలేకపోతోందన్నారు. కాగ్‌ నివేదికలు విడుదలైన తర్వాత పీఏసీ వాటి పరిశీలించేందుకు మధ్య చాలా విరామం ఉంటోందన్నారు. 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌ అవినీతిపై పీఏసీ నివేదిక 7 సంవత్సరాల తర్వాత సమర్పించడం వల్ల, 2017 నాటికి అందులోని అవినీతి అంశానికి ఉన్న ప్రాధాన్యత కోల్పోవడమే కాకుండా, కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందనే వాస్తవం అందరూ మరిచిపోయారన్న అంశాన్ని ఆయన ఉదహరించారు. పబ్లిక్‌ అకౌంట్లలోని అస్థిరతలను సరైన సమయంలో గుర్తించి, మొగ్గలోనే తుంచివేయడం ఎంత కీలకమో చెప్పడానికి ఈ ఘటన ఒక అద్భుతమైన ఉదాహరణ అని శ్రీ  విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే పీఏసీని మరింత శక్తివంతంగా మార్చేందుకు ఆయన కొన్ని సూచనలు చేశారు. మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమర్పించిన చర్య తీసుకున్న ప్రత్యుత్తరాల కోసం తప్పనిసరిగా ఒక ఫార్మాట్‌ను రూపొందించడం ద్వారా  మంత్రిత్వ శాఖలు, విభాగాలు  అస్పష్టంగా, వివరంగా లేని చర్య తీసుకున్న ప్రత్యుత్తరాలను సమర్పించకుండా అడ్డుకోగలమని సూచించారు. దీని ద్వారా సంబంధింత మంత్రిత్వ శాఖలు జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి అవకాశం తగ్గుతుందన్నారు. మరోవైపు అంశాల ఎంపిక విషయంలో పీఏసీ అధికారాలను విస్తరించాల్సిన అవసరం ఉందని శ్రీ విజయసాయిరెడ్డి సూచించారు. కాగ్‌ నివేదికలను పరిశీలించే అధికారం పీఏసీకి ఉన్నప్పటికీ, కొన్ని విషయాల దర్యాప్తు కోసం కాగ్‌కి  సూచించే అధికారం పీఏసీకి లేదు. అందువల్ల మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం కాగ్‌కి సబ్జెక్ట్‌లను సిఫార్సు చేయడానికి పీఏసీని అనుమతించడం ద్వారా, పీఏసీ పనితీరులో ఎక్కువ సౌలభ్యాన్ని నిర్ధారించవచ్చన్నారు. 


అంతేగాక పీఏసీ ఆఫ్‌ విక్టోరియా (ఆస్ట్రేలియా) అనుసరించే స్వీయ–అప్రైజల్‌ మోడల్‌ను మన దేశంలోనూ తప్పనిసరిగా అనుసరించడం ద్వారా పీఏసీ రాబోయే సంవత్సరానికి పనితీరు లక్ష్యాలను, గత పనితీరుపై గణాంకాలను వివరించే వార్షిక ఎజెండాను ప్రచురించుకోగలమని సూచించారు. ముఖ్యంగా పీఏసీని సభ్యులు ఆడిట్‌ నివేదికను అర్థం చేసుకోవడానికి సాంకేతిక సలహాదారులను నియమించాలని సూచించారు. దీనికోసం కాగ్‌ ఉద్యోగులను పీఏసీ సభ్యులకు సాంకేతిక సహాయం అందించేందుకు డిప్యూటేషన్‌ పద్ధతిలో నియమించాలని అన్నారు.  పీఏసీ లైవ్‌ ప్రొసీడింగ్‌లు యూఎస్‌ఏ మాదిరిగా తప్పనిసరిగా ప్రసారం చేయాలని అన్నారు. కోర్ట్‌ ప్రొసీడింగ్స్, పార్లమెంట్‌ ప్రొసీడింగ్స్‌ టీవీలో ప్రసారమైన మాదిరిగా పీఏసీ లైవ్‌ ప్రొసీడింగ్స్‌ ఎందుకు ప్రసారం చేయకూడదని ప్రశ్నించారు.  కేంద్రం, రాష్ట్రంలోని కార్యనిర్వాహక అధిపతులను, మొత్తం న్యాయవ్యవస్థను మినహాయించి అన్ని ప్రభుత్వ కార్యాలయ అధికారులకు సమన్లు జారీ చేసే అధికారాలను పీఏసీకి ఇవ్వాలని శ్రీ విజయసాయిరెడ్డి సూచించారు.