గుంటూరు నగరంలో టిటిడి నిధులతో అరుంధతి మాత ఆలయం నిర్మించాలని విజ్ణప్తి.

 


గుంటూరు నగరంలో టిటిడి నిధులతో అరుంధతి మాత ఆలయం నిర్మించాలని విజ్ణప్తి.
తిరుమల,12 డిశంబరు (ప్రజా అమరావతి): గుంటూరు నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో అరుంధతి మాత అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలని గుంటూరు నగరానికి చెందిన అరుంధతి మాత అమ్మవారి భక్తులు మరియు ఆదిజాంబవ ట్రస్టు సభ్యులు కోరుతున్నారని కావున తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎంఎల్సి,మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు.ఈమేరకు ఆయన ఆదివారం తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఇందుకు సంబంధించి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి లేఖ అందించి విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మాన్ని సమాజంలోని అన్నివర్గాల్లో వ్యాప్తి చేసేందుకు అరుంధతి మాత భక్తులుగా వారు గుంటూరులో జాంబవ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని  తెలిపారు.హిందూ ధర్మాన్ని ఆచరించే దళితులు అరుంధతి మాతను ఆరాధిస్తూ తమ ఇష్టదైవంగా భావించి అరుంధతి మాతకు నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. అందుకుగాను అరుంధతి మాత అమ్మవారి దేవాలయం ఉండాలని కోరుకుంటున్నారని మాణిక్య వరప్రసాద్ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.


తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ ధర్మం పరిరక్షణ,విస్తరణకు అవిరళ కృషి చేస్తున్న ప్రక్రియలో భాగంగా టిటిడి నిధులతో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుగా ఉన్న గుంటూరు నగరంలో అరుంధతి మాత దేవాలయం నిర్మించాలని అరుంధతి మాత భక్తులు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.


ఒంటిమిట్టలో ఆదిజాంబవంతుని దేవాలయం నిర్మించాలి:

అదేవిధంగా వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోగల ప్రాచీన హిందూ దేవాలయమైన  కోదండ రామస్వామి దేవాలయ స్థల పురాణం ప్రకారం  మూల మూర్తులు కోదండ రాముడు, సీతాదేవి,లక్మణ స్వామిల  ఏకశిలా విగ్రహాలను ఆదిజాంబవంతుడు ప్రాణప్రతిష్ట చేసినట్టు తెలుస్తోందన్నారు.కావున ఒంటిమిట్ట కోదండ రామాలయం ప్రతిష్టకు మూల కారకుడైన ఆదిజాంబవంతునికి   ఒంటిమిట్ట దేవాలయ ప్రాంగణంలో దేవాలయం ఉండాలని ఆయన భక్తులు కోరుకుంటున్నారని ఆలేఖలో తెలిపారు.కావున ఒంటిమిట్ట లో టిటిడి ఆదిజాంబవంతుని దేవాలయం నిర్మించాలని గుంటూరు ఆదిజాంబవ ట్రస్టు సభ్యులు కోరుతున్నారని ఎంఎల్సి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు.