50 ఎక‌రాల్లో మ‌హిళా పారిశ్రామిక పార్కు కొత్తవ‌ల‌స స‌మీపంలో ఏర్పాటుకు చ‌ర్యలు50 ఎక‌రాల్లో మ‌హిళా పారిశ్రామిక పార్కు


కొత్తవ‌ల‌స స‌మీపంలో ఏర్పాటుకు చ‌ర్యలుజిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి


ఆన్ లైన్‌లో జిల్లా ప‌రిశ్రమ‌లు, ఎగుమ‌తుల ప్రోత్సహ‌క మండ‌లి స‌మావేశం


విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 24 (ప్రజా అమరావతి):


జిల్లాలోని కొత్తవ‌ల‌స మండ‌లం రెల్లి గ్రామ స‌మీపంలో 50 ఎక‌రాల విస్తీర్ణంలో మ‌హిళా పారిశ్రామిక వేత్తల‌కోసం ఒక పార్కును ఏర్పాటుచేసే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నట్లు జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి వెల్లడించారు. ఈ పార్కులో ప‌రిశ్రమ‌ల ఏర్పాటుకోసం ఏ.పి.ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కు చెందిన ప‌లువురు మ‌హిళా పారిశ్రామిక‌వేత్తలు ఇప్పటికే ఆస‌క్తి చూపుతున్నార‌ని, ఇందుకోసం అవ‌స‌ర‌మైన భూముల‌ను సిద్ధంచేయాల‌ని ఏ.పి.ఐ.ఐ.సి. అధికారుల‌ను క‌లెక్టర్ ఆదేశించారు. జిల్లా ప‌రిశ్రమ‌లు, ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క మండ‌లి స‌మావేశం జిల్లా క‌లెక్టర్ సూర్యకుమారి అధ్యక్షత‌న ఆన్ లైన్‌లో సోమ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ మాట్లాడుతూ ఈ పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్న మ‌హిళా పారిశ్రామిక వేత్తల‌నుంచి యూనిట్ల ఏర్పాటు ప్రతిపాద‌న‌ల‌ను త్వర‌గా జిల్లా యంత్రాంగానికి అంద‌జేయాల‌ని ఫ్యాప్సీ విశాఖ ప్రతినిధి సాంబశివరావును జిల్లా క‌లెక్టర్ కోరారు. జాయింట్ క‌లెక్టర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావుతో క‌ల‌సి ఫ్యాప్సీ ప్రతినిధులు కొత్తవ‌ల‌స‌లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకోసం భూముల‌ను సంయుక్తంగా ఈ నెలాఖ‌రులోగా ప‌రిశీలించాల‌ని క‌లెక్టర్ సూచించారు.


 


జిల్లాలో సింగిల్ డెస్క్  విధానంలో ప‌రిశ్రమ‌ల ఏర్పాటుకోసం వ‌చ్చే ప్రతిపాద‌న‌ల‌పై సంబంధిత ప్రభుత్వ శాఖ‌లు వాటిని ఆమోదించ‌డం లేదా తిర‌స్కరించ‌డం ఏదైనా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని, ఎలాంటి కార‌ణాలు తెల‌ప‌కుండా నిర్ణీత గ‌డువులోగా ఆయా ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్కరించ‌కుండా పెండింగులో వుంచితే ఆ శాఖ ఉన్నతాధికారుల‌కు నివేదిస్తామ‌ని క‌లెక్టర్ స్పష్టంచేశారు. అగ్నిమాప‌క శాఖ ద్వారా అందాల్సిన మూడు అనుమ‌తుల్లో రెండింటికి మంజూరుకాగా, ఒక‌టి నిర్ణీత గ‌డువు దాటిన త‌ర్వాత ప‌రిష్కరించ‌డం జ‌రిగింద‌ని ప‌రిశ్రమ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ‌ధ‌ర్ వివ‌రించారు. దీనిపై క‌లెక్టర్ స్పందిస్తూ త‌మ ఉన్నతాధికారుల దృష్టికి అనుమ‌తుల అంశాన్ని తీసుకువెళ్లి వారి నుంచి త్వర‌గా మంజూరయ్యేలా చూసే బాధ్యత జిల్లాస్థాయి అధికారుల‌దేన‌ని స్పష్టంచేశారు.


గ‌త డిశంబ‌రు 20 నుంచి ఈనెల 22 వ‌ర‌కు జిల్లాలో సింగిల్ డెస్క్ విధానంలో ప‌రిశ్రమ‌ల ఏర్పాటుకోసం 35 ప్రతిపాద‌న‌లు వ‌చ్చాయ‌ని, వాటిలో 24 ప‌రిశ్రమ‌ల‌కు అనుమ‌తులు ఇవ్వడం జ‌రిగింద‌న్నారు. మ‌రో 11 ప‌రిశ్రమ‌ల‌కు అనుమ‌తులు ఇవ్వాల్సి వుంద‌న్నారు.


కంట‌కాప‌ల్లిలోని ఏపిఐఐసి పారిశ్రామిక వాడ‌లో అంత‌ర్గత రోడ్లు నిర్మాణానికి త్వర‌గా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని జోన‌ల్ మేనేజ‌ర్ పాపారావును క‌లెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతానికి అందుబాటులో వున్న నిధుల‌తో రోడ్ల ప‌నులు చేప‌ట్టేలా ఉన్నతాధికారుల నుంచి అనుమ‌తులు పొందాల‌ని సూచించారు.


ఈ స‌మావేశంలో జె.సి.(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, ప‌రిశ్రమల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ‌ధ‌ర్, ప‌లు శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.


 Comments