స్పందనపై నమ్మకాన్ని పెంచాలి


*స్పందనపై నమ్మకాన్ని పెంచాలి*


*: అర్జీదారులు సంతృప్తి చెందాలి*


*: స్పందన గ్రీవెన్స్ అర్జీలను చిరునవ్వుతో స్వీకరించడం, పరిశీలన చేయడం, పరిష్కారం చూపించడం అత్యంత కీలకం*


*: గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రతిరోజు మండల స్థాయిలో మానిటర్ చేయాలి*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాలమన్ ఆరోఖ్యరాజ్*


అనంతపురం, జనవరి 06 (ప్రజా అమరావతి): 


స్పందనపై నమ్మకాన్ని పెంచేలా, అర్జీదారులు సంతృప్తి చెందేలా ఫిర్యాదులకు నాణ్యత కలిగిన పరిష్కారం చూపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాలమన్ ఆరోఖ్యరాజ్ (Solomon Arokiaraj) ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం (స్పందన వర్క్ షాప్)లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీ ఎమ్. హరికృష్ణ, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాలమన్ ఆరోఖ్యరాజ్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాలమన్ ఆరోఖ్యరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. స్పందన కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు. అర్జీదారులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత అన్నారు. అర్జీదారులకు సత్వర పరిష్కారం చూపడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో స్పందన గ్రీవెన్స్ కు వస్తారని, వారి సమస్యలకు అధికారులు గదువులోపు పరిష్కారం చూపగలిగితే వారు ఎంతో సంతోషిస్తారన్నారు. అర్జీలపై విచారణ జరిపి వాటిని ఈ వెబ్సైట్లో పెట్టాలని సూచించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీలను చిరునవ్వుతో స్వీకరించడం అత్యంత ముఖ్యమని, అనంతరం ఆ ఫిర్యాదుపై పరిశీలన చేయడం కీలకమని, అర్జీదారుడి వద్దకు వెళ్లి అతడి ప్రమేయంతో ఫిర్యాదుకు పరిష్కారం చూపించడం చేయాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలకు ఎంత త్వరగా పరిష్కరించగలిగితే అంత త్వరగా పరిష్కరించాలని, ఒకవేళ ఆ సమస్యలు పరిష్కరించ లేకపోతే ఎందువల్ల ఆ సమస్య పరిష్కరించలేదో ఫిర్యాదుదారులకు చట్ట పరంగా అవగాహన కల్పించాలన్నారు. దీనిద్వారా స్పందనపై అర్జీదారుల నమ్మకం పెరుగుతుందన్నారు.


గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రతిరోజు మండల స్థాయిలో మానిటర్ చేయాలి :


స్పందన గ్రీవెన్స్ పరిష్కారంపై మండల స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజు మండల స్థాయిలో మానిటర్ చేయాలని, ప్రతిరోజు పది నిమిషాల సమయం కేటాయించి పెండింగ్ గ్రీవెన్స్ ఏవేవి ఉన్నాయి అనేది చూడాలని, క్షేత్రస్థాయిలో అధికారులు తమ శాఖ పరిధిలో ఉన్న స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసేది అధికారులేనని, సమస్యలను పరిష్కరించేందుకు కూడా వారేనని, సమస్యల పరిష్కారంలో మరింత పురోగతి చూపించాలన్నారు. స్పందన అనేది ప్రజల ఫిర్యాదు కేంద్రమని, ప్రజాసమస్యలను సొంత సమస్యగా భావించాలని, సమస్యల పరిష్కారంలో మార్పు రావాలన్నారు. అన్నిటికన్నా అర్జీదారుడు సంతృప్తి ముఖ్యమని, ప్రతి ఒక్క సమస్య పరిష్కారంలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. స్పందన గ్రీవెన్స్ సమస్యలను మరికొంత మంచిగా, నాణ్యతగా పరిష్కారం చేయాలని, నాణ్యత విషయంలో మరింత పురోగతి ఉండాలన్నారు. వారంలో ప్రతి సోమవారం పూర్తిగా స్పందన గ్రీవెన్స్ కోసం కేటాయించడం జరిగిందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ప్రతి రోజూ 3 నుంచి 5 గంటల వరకూ స్పందన అర్జీ లలో తీసుకునేందుకు సమయం కేటాయించడం జరిగిందని, అందులో ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉంటారని, ఈ విషయమై మానిటరింగ్ జరగాలన్నారు. ప్రతిరోజు మండల స్థాయిలో మానిటర్ చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు తహశీల్దార్లు, ఎంపీడీవోలు ప్రతి ఒక్కరూ స్పందన గ్రీవెన్స్ అర్జీ లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.


స్పందన సమస్యల పరిష్కారంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రధానమైనదని, క్షేత్రస్థాయిలో ఆలోచనా విధానాన్ని మార్చుకొని స్పందన గ్రీవెన్స్ పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మీద ఏ ఫిర్యాదు వచ్చినా చాలా సీరియస్ గా తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగుల ప్రవర్తన బాలేదని, సక్రమంగా రెస్పాండ్ కావడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఏవైనా ఫిర్యాదులు వస్తే సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నడిపించాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. స్పందన కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదులను నాణ్యతగా పరిష్కరించడంలో జిల్లాస్థాయి యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా కొనసాగించాలన్నారు.


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీ సీనియర్ కన్సల్టెంట్లు ప్రదీప్ రెడ్డి, జీవన్, డిఆర్ఓ గాయత్రీ దేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.