వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

 వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్లను పరిశీలించిన ఈవో


తిరుమ‌ల‌,  జ‌న‌వ‌రి 12 (ప్రజా అమరావతి): తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాద‌శి, 14న ద్వాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల కోసం చేప‌ట్టిన ఏర్పాట్లను టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు.
శ్రీవారి ఆలయం వద్ద గల వాహన మండపం నుంచి సుపథం మీదుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు చేసిన ఏర్పాట్లను ఈఓ తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పారిశుద్ధ్య చర్యలను, కోవిడ్ వ్యాప్తి నివారణ కోసం తీసుకున్న జాగ్రత్తలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ తిరుమలలో జరిగే ముఖ్యమైన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ఒకటని, ఇందుకోసం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. విఐపిలతో పాటు భక్తులందరికీ సమయ నిర్దేశిత దర్శన టికెట్లు, టోకెన్లు జారీ చేశామని, ముందుగా వచ్చి వేచి ఉండకుండా నిర్దేశిత సమయానికి వచ్చి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని కోరారు.
అన్న‌ప్ర‌సాదం, క‌ల్యాణ‌క‌ట్ట, వ‌స‌తి క‌ల్ప‌న‌, వైద్యం, ఆరోగ్య విభాగంతోపాటు భ‌క్తుల తాకిడి ఉన్న అన్ని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు భక్తుల‌కు సేవ‌లందిస్తారని చెప్పారు. తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
ఈవో వెంట అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు,  ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్ బాబు, శ్రీ హరీంద్రనాథ్, విఎస్వో శ్రీ బాలిరెడ్డి తదితర అధికారులు ఉన్నారు.