*" *శివలీలలు "*
*' శివరాత్రి మహత్యం
*
పరమేశ్వరుని లీలలు పరమాద్భుతం. సకల చరాచర జీవ కోటి ఆ తండ్రికి బిడ్డలే. అది మానవులైనా, పశుపక్ష్యాదులైనా ఒకటే.
పిల్లలకు ఏం కావాలో, ఎప్పుడు కావాలో తల్లికి తెలుసు. పిల్లలకి ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో తండ్రికి తెలుసు.
సకల చరాచర జగత్తుకు తల్లితండ్రులు ' పార్వతీపరమేశ్వరులు'. పత్రమాత్ర సంతుష్టుడు 'శివుడు'. తెలిసి చేసినా తెలియక చేసినా తన బిడ్డలను కటాక్షించే కరుణాంతరంగుడు శంకరుడు.
ఇక్కడ గుహద్రధుడు, జింకల జీవితంలో అదే జరగబోతోంది.
ఆ రోజు శివరాత్రి. మహాపర్వ దినం. పరమేశ్వరుని కి ప్రీతికరమైన రోజు.
అలాంటి రోజున 'గుహద్రధుడు' వేటకి అడవికి రావడం, ఏనాడూ జరగనిది అతనికి ఒక్క వేట కూడా దొరకక పోవడం 'ఈశ్వర లీల' కాక మరొకటికాదు. మడుగు వద్ద అతను ఎక్కిన చెట్టు ' మారేడు చెట్టు ',అదే చెట్టు క్రింద 'శివలింగం' ఉండడం.
ఇవేమీ తెలియని వేటగాడు అదే చెట్టు ఎక్కి మాటు వేసాడు. అతనికి తెలియకుండానే ఏమీ దొరకక పస్తు ఉన్నాడు. 'ఉపవాస ఫలం' దక్కింది. అతని చేతి నుండి నీళ్ళు క్రింద ఉన్న ' లింగం ' పై పడ్డాయి, అభిషేక ఫలం ' దక్కింది. అతడు కదిలినపుడు ఆ చెట్తు నుండి 'బిల్వ పత్రాలు ' శివ లింగంపై పడి ' బిల్వ పూజా ఫలం ' ప్రాప్తమైంది.
అంతే కాక జింకల కోసం కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు.' శివరాత్రి జాగరణ ఫలం ' అతని భాగ్యంలో చేరింది. ఇవన్నీ గుహద్రధుడు తనకు తెలియకుండానే చేసాడు. అతని కోసంౘ కుటుంబం కోసమే చేసాడు.
ఇక్కడే మనం తెలుసుకోవల్సింది ఉంది.
అతడు వృత్తి రిత్యా వేటగాడు. దయ,j జాలీ లేకుండా దొరికిన మృగాన్ని వేటాడేవాడు. అటువంటి గుహద్రధుడు మొదటి జింక మాటలను నమ్మి అది ఇంటికి వెళ్ళి రావడానికి ఒప్పుకున్నాడు. మూడు ఝాములు గడిచేసరికి అతని ప్రవృత్తి మారి, మనసు జాలి,కరుణను పొందింది. అందుకే మూడూ జింకలనూ వెళ్ళిరమ్మన్నాడు.
ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.
గుహద్రధుడు ఉన్న మడుగు వద్దకు మగ జింక వచ్చింది. నీకిచ్చిన మాట ప్రకారం వచ్చాను. ఆలస్యం అయితే మన్నించు అంది.
అతడు చెట్టు దిగి వచ్చాడు. విల్లు,బాణం చేత పట్టుకుని నిలబడిపోయాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అది చూసిన జింక అతను చూస్తున్న వైపుకు చూసింది. తన వైపే వస్తున్న భార్యలు,పిల్లలను చూసింది. అవి ఎందుకు వచ్చాయో దానికి అర్ధమైంది. దాని కళ్ళు మెరిసాయి. అవన్నీ మగ జింక వద్దకు వచ్చి నిలబడ్డాయి.
గుహద్రధుని మనసు కరిగిపోయింది. నోరు లేని జంతువులు పరోపకారం కోసం,ఇచ్చిన మాట కోసం చిన్న పిల్లలతో సహా కుటుంబమే తనకి బలి కావడానికి వచ్చాయి. మంచి చెడ్డ ఆలోచించే జ్ఞానం ఉన్న నేను,అవివేకంతో నా వారిని పోషించుకోవడానికి ప్రాణులను హింసిస్తూ బ్రతుకుతున్నాను. మనిషినై ఇంతకాలం ఎంతో పాపం మూట కట్టుకున్నాను. అని కుమిలి పోయాడు.
ఆ జింకలను చూసి ఇలా అన్నాడు,' మీ త్యాగబుద్దికి నా మనసు కరిగి పోయింది. మీరు నా కళ్ళు తెరిపించారు.ఇంతకాలం 'పరహింస'తో నేను ఎలా బ్రతికానో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. ఇక నుండి నేను వేటాడను. కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను. నాకు మహోపకారం చేసిన మీకు నా కృతజ్ఞతలు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి. ఆనందంగా మీ ఇంటికి వెళ్ళండి ' అన్నాడు.
గుహద్రధుని మాటలు విన్న ఆ జింకలు సంతోషంతో గంతులు వేసాయి. అలా వారంతా ఆనందంగా ఉండగా అక్కడ కళ్ళు మిరిమిట్లుగొలిపుతూ ఒక కాంతి పుంజం వెలిగింది.
ఆ వెలుగుకు వారంతా కళ్ళు మూసుకున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన వారి ముందు ' పరమేశ్వరుడు ' నిలబడ్డాడు.
కోరకుండానే వరాల రేడు ఎదురుగా నిబడగానే పరవశించి స్వామి ముందు వాలిపోయారు. అనేక రీతుల ప్రణతులు చేసిన గుహద్రధుని, జింకలను చూసి 'పరమశివుడు' " ఓ పుణ్య చరితులారా! మీ నడవడికతో నన్ను మెప్పించారు. ముల్లోకాలకు మీరు ఆదర్శప్రాయులు. మీ పేరుతో ఇక్కడ నేను " అర్భుదాచలేశ్వరుడు "గా వెలుస్తాను. మీ చరిత్ర ఆచంద్రార్కారం నిలిచి ఉంటుంది. నన్ను దర్శించి, మీఈ కధని తలచిన వారికి సకల శుభాలు కలుగుతాయి. అర్భుదములారా! మీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. ఓ గుహద్రధా! ఈ జన్మలో నీవు నా భక్తుడవై, భుక్తికి లోటు లేకుండా జీవించి, మరు జన్మలో శృంగభేరీపురంలో " గుహుడు " అన్న పేరుతో జన్మించి,' శ్రీరాముని 'కి సహాయపడి, రామునికి ప్రియమైనవాడవు అవుతావు. అంతంలో మోక్షాన్ని పొంది నా సాయుజ్యాన్ని చేరతావు. " అని పలికాడు.
అలా వెలసిన క్షేత్రం ' అర్భుదాచలం '.
ఈ కధ చదివిన వారికి, విన్నవారికి మొండి రోగాలు కూడా నయమై ఆరోగ్యవంతులవుతారు.
" ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు.