శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అదనపు ఈవో
శ్రీ శైలం, ఫిబ్రవరి 25 (ప్రజా అమరావతి): శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు శుక్రవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా ఫిబ్రవరి 22న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఆలయం వద్దకు చేరుకున్న అదనపు ఈవో దంపతులకు శ్రీశైలం ఈవో శ్రీ ఎస్.లవన్న, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ఫార్పతేధార్ శ్రీ గురప్ప తదితరులు పాల్గొన్నారు.