తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ హౌసింగ్ కాలనీని పరిశీలించి తర్వాత జరిగిన బహిరంగ సభలో సీఎం శ్రీ వైఎస్ జగన్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్.
ఇందుకూరు, తూర్పుగోదావరి జిల్లా (ప్రజా అమరావతి);
ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్వాసితుడు వెంకన్నదొర కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని, కేంద్రమంత్రిని హారతిచ్చి తమ ఇంటికి ఆహ్వనించారు. వారి ఆహ్వనం మేరకు సీఎం, కేంద్రమంత్రి ఇంటికి వెళ్ళి ఇల్లంతా కలియదిరిగి చూశారు, వెంకన్నదొర ఇంటి వరండాలో మంచంపై కూర్చుని కుటుంబ సభ్యులందరితో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయన్న వెంకన్నదొర కుటుంబ సభ్యులు తమకు పునరావాస ప్యాకేజీ కూడా అందిందన్నారు. ముంపుకు గురైన భూమికి పరిహారంగా భూమి కూడా ఇచ్చారని, రెండు పంటలు సాగుచేస్తున్నామన్నారు. పండించిన పంటలను కూడా ఆర్‌బీకే ద్వారా అమ్మినట్లు వారు వివరించారు. రైతు భరోసా కూడా అందిందన్నారు. తమకు ఇన్ని సౌకర్యాలు అందించిన ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలియజేశారు.
అక్కడినుంచి నేరుగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్ళి చిన్నారులతో ముచ్చటించారు. వారి పాఠ్యపుస్తకాలను పరిశీలించి, అక్కడున్న ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్ధులకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. చిన్నారులకు ఇస్తున్న ఆహార పదార్ధాలను పరిశీలించారు.
అంతకుముందు ఇందుకూరు చేరుకున్న ముఖ్యమంత్రి, కేంద్రమంత్రికి గిరిపుత్రులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు ప్రసంగించారు.
*సీఎం ఏమన్నారంటే....:*
ఈ రోజు ఇందుకూరు ఆర్ అండ్ ఆర్ కాలనీలో దాదాపు 350 ఇళ్ళకు సంబంధించి నిర్మించిన కాలనీని చూశాం.
ఇక్కడున్న వసతులు, పరిస్ధితులు తెలుసుకునే ప్రయత్నం చేశాం. కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అధికారులు ఇక్కడి వారందరినీ బాగా పట్టించుకున్నారని తెలిసి సంతోషంగా ఉంది. అయినా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లు తెలిసింది, వీటిపై కలెక్టర్, అధికారులు కూడా మరింత శ్రద్ద పెట్టి పరిష్కరించాలి. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం సహకారంతో పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. కేంద్రం ఇస్తున్న సహాయానికి అదనంగా కూడా ఇస్తానని నేను చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. కేంద్ర ప్రభుత్వం రూ. 6.80 లక్షలు ఇస్తుంది, మరో మూడు లక్షల రూపాయలు మనమిస్తామని చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. కచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్తున్నాను. ఇదే కాదు మరొక మాట కూడా చెప్పాను, 2006లోనే నాన్నగారు పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేసినప్పుడు అప్పట్లో ఈ రేట్లు ఎవరికీ రాలేదు. చాలామంది రైతులు రూ.1.25 లక్షలకు, రూ.1.50 లక్షలకే భూములిచ్చారు. వారికి కూడా కనీసం ఐదు లక్షల దాకా అయినా తీసుకుపోవాలని మనం చెప్పడం జరిగింది. అంటే ఇంకా మూడున్నర లక్షలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఆరోజు నేను ఇచ్చిన మాట ఇంకా గుర్తుంది. మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని భరోసానిస్తున్నాను. ఇక్కడ స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కేంద్రమంత్రి కూడా కలిసి కట్టుగా ఏదైనా చేద్దామన్నారు. ప్రతిపాదనలు కూడా సిద్దం చేయమన్నారు. లైవ్లీహుడ్ ట్రై నింగ్, ఎంప్లాయ్‌మెంట్‌కు సంబంధించి రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకొచ్చి ఆర్ అండ్ ఆర్ కాలనీలలో దీనిని ముమ్మరంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతీ అక్కా చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితునికి, ప్రతి అవ్వా, ప్రతి తాతకు హదయపూర్వకంగా చేతులు జోడించి శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
*ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ ప్రసంగం:*
– గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌గారు, వేదికమీద ఉపస్థితులైన పెద్దలు, సభకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను ఇక్కడ కాలనీ చూశాను. ఇళ్లు చాలా చక్కగా కట్టారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అందుకు సీఎం శ్రీ వైయస్ జగన్‌గారిని అభినందిస్తున్నాను. అయితే ఇక్కడ ఇంకా కొన్ని అభివృద్ధి పనులు, మరి కొన్ని సౌకర్యాలు కావాలని సోదరీమణులు అడుగుతున్నారు. అదే విధంగా ఇక్కడి వారికి కేవలం వ్యవసాయమే కాకుండా, ఇతర జీవనోపాధి మార్గాలు కూడా చూపించాల్సి ఉంది.
ప్రధాని మోదీ తరపున నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. దానికి కట్టుబడి ఆ బాధ్యతను పూర్తిగా స్వీకరిస్తాం. ప్రతి ఒక్క ఇటుక వ్యయం కేంద్రం భరిస్తుంది.
ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏ విధమైన సహాయ, సహకారాలు కోరినా పూర్తిగా అండగా నిలుస్తాము. మా నినాదం కూడా ఒకటే. సబ్‌కా వికాస్. దేశం కోసం అందరం కలిసి పని చేయాలి. అందుకే మరోసారి నేను ఇక్కడికి వస్తాను. కాలనీ సందర్శిస్తాను.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి నేను ఒక విషయం చెప్పదల్చుకున్నాను. ఒక చెట్టుకు 50 ఏళ్లు ఉందనుకుందాం. దాన్ని అక్కణ్నుంచి వేరే చోటికి తరలిస్తే, దాన్ని నిలబెట్టడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎంతో ఓపిగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. సరిగ్గా అలాగే ప్రజలను కూడా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తే వారికి కొత్త ప్రదేశంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వారు అక్కడ స్థిరపడడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల నిర్వాసితులు కొత్త ప్రదేశంలో స్థిరపడే వరకు అధికారులు చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. వారికి అన్ని సదుపాయాలు కల్పించడంలో పూర్తి చొరవ చూపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రమేయం పొందే వారిని, అలాగే స్వచ్ఛంద సంస్థలను కూడా కలుపుకుపోవాలి. ధన్యవాదాలు.
addComments
Post a Comment