*- అటవీశాఖపై సచివాలయంలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం*
*- అటవీప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అటవీ, పిఆర్&ఆర్డీ, ఆర్&బి, ఇరిగేషన్, ఎపిఐఐసి, ఎస్ఎస్ఎ, ఇతర ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష*
*- అభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతి తప్పనిసరి*
*- నిర్ధిష్ట కాలపరిమితిలోనే అన్ని అనుమతులు జారీ*
*- ఫారెస్ట్ కన్సర్వేటీవ్ యాక్ట్ కు లోబడి దరఖాస్తు చేసుకోవాలి*
*- అనుమతుల కోసం ఇంజనీరింగ్ విభాగాలు నోడల్ అధికారులను నియమించాలి*
*- పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధికి కృషి చేయాలి*
*- అటవీ అనుమతుల విషయంలో అలసత్వం తగదు*
*- సమస్వయ సమావేశాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి*
*: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*
అమరావతి (ప్రజా అమరావతి):
రాష్ట్రంలో అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించి అటవీ ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలకు నిర్ధిష్ట కాలపరిధిలో నిబంధనలకు అనుగుణంగా అనుమతులను జారీ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మూడోబ్లాక్ లో సోమవారం అటవీశాఖ, పలు ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఎస్ఎస్ఎ, జెన్కో, ట్రాన్స్ కో, ఎపిఐఐసి తదితర ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పనులు చాలా చోట్ల అటవీ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని అన్నారు. అయితే అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ఆయా పనులు ముందుకు సాగడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే అన్ని ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, అటవీ, పర్యావరణ అధికారులతో ఈ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ఫారెస్ట్ కన్సర్వేటీవ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ విభాగాలు అవసరమైన అనుమతులు పొందడంలో అలసత్వం వహిస్తున్నాయని అన్నారు. కేవలం అటవీశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని, చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. అటవీ చట్టాల ప్రకారం ఎందుకు అనుమతులు రావడం లేదనే దానిపై ఆయా ఇంజనీరింగ్ విభాగాలు పరిశీలించాలని సూచించారు. అటవీ చట్టంలో చాలా స్పష్టంగా అనుమతులను మంజూరు చేసే విషయంలో నిబంధనలు ఉన్నాయని, వాటిని సంతృప్తి పరచకుండా కేవలం అటవీ అనుమతులు రావడం లేదని ఆరోపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అదే క్రమంలో అటవీ చట్టాలను కూడా గౌరవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ కు లోబడే అనుమతులను పొందాల్సి ఉంటుందని, అందుకోసం ప్రతి విభాగం ఈ అనుమతుల కోసం ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అడవులను కాపాడుకోవడం, అటవీప్రాంతంలో నివసించే ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడాన్ని సమన్వయం చేసుకోవాలని కోరారు. ఇదే క్రమంలో ప్రభుత్వ విభాగాలు అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించడంలో అటవీశాఖ కూడా నెలల తరబడి జాప్యం చేయకుండా సకాలంలోనే వాటిని పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 335 ప్రతిపాదనల్లో 12,510.99 హెక్టార్ల భూమి కోసం అటవీశాఖ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. స్టేజ్ -1 కింద 151 ప్రతిపాదనల్లో 2488.76 హెక్టార్లు, స్టేజ్ -2 కింద 35 ప్రతిపాదనల్లో 816.68 హెక్టార్లు ఇప్పటికే అనుమతి ఇవ్వడం జరిగిందని వివరించారు. ఇంజనీరింగ్ విభాగాలు డిజిపిఎస్ సర్వే సందర్బంగా అటవీశాఖ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, డిపిఆర్ తయారు చేసే సమయంలోనే అటవీశాఖను సంప్రదించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్ ను తీసుకోవాలని అన్నారు. ఈ నిబంధనలను పాటిస్తూనే అటవీప్రాంతాల్లో కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఒకవైపు అడువులను సంరక్షించుకుంటూనే, మరోవైపు అభివృద్ధిని సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో ఎదరయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వ పరంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (అటవీ, పర్యావరణ) నీరబ్ కుమార్ ప్రసాద్, హెచ్ఓఎఫ్ఎఫ్ ప్రదీప్ కుమార్, పిసిసిఎఫ్ ఆనంద్ కుమార్, ఇఎన్ సి (పిఆర్&ఆర్డీ) సుబ్బారెడ్డి, ఎపిఐఐసి ఇఎన్ సి సిహెచ్ ఎస్ ఎస్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.