అన్ని వర్గాలకు చెందిన విద్యాకుసుమాలు వికసించి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలి

  అమలాపురం 05 మే (ప్రజా అమరావతి);

       అన్ని వర్గాలకు చెందిన విద్యాకుసుమాలు వికసించి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాల


నే సంకల్పంతో జగనన్న విద్యా, వసతి దీవెన కార్యక్రమాలు తోడ్పాటు అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.  గురువారం  2021- 22  సంవత్సరానికి సంబంధించి జనవరి - మార్చి త్రైమాసికానికి గాను  ఫీజు రీయింబర్శ్మెంట్ మొత్తాలను  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా  సుమారు 10.85 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు రూ. 709 కోట్లు బటన్ నొక్కి నేరుగా విద్యార్థినీ విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు తిరుపతి నుండి  ఆన్లైన్లో వర్చువల్ విధానంలో  జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా పెద్ద ఉన్నతమైన చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ రూపొందించబడిందే జగనన్న విద్యా దీవెన పథకమన్నారు. ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఏ ఒక్కరూ చదువులకు దూరం కారాదనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి నిధులు వెచ్చించడం జరుగుతోందన్నారు. అర్హత ఉన్న నిరుపేదలు డిగ్రీ ఆపై చదువులకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు అభ్యసించాలని ఆయన ఆకాంక్షించారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ పథకం అన్ని విధాలుగా దోహదపడుతుందన్నారు. బోధనా రుసుము కింద ఏడాదిలో నాలుగు విడతలుగా ఆయా కళాశాలల యాజమాన్యాలకు  పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతోందన్నారు. ఇటీవల జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగిందని దానిలో వివిధ కారణాల మూలంగా అనర్హులుగా ప్రకటించిన వారి జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగిందని  అర్హత ఉంటే మరల దరఖాస్తును వాలంటీర్లు సహకారంతో ఈ కేవైసీ చేయించుకుని తమ అభ్యర్థనలను నోటీసు రూపంలో  నవశకం లాగిన్ లో అప్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. తల్లుల ఖాతాలో విద్యా దీవెన నిధులు జమ చేయడం వల్ల కాలేజీలలో జవాబుదారీతనం పెరిగి, తల్లులకు ప్రశ్నించే హక్కు ఉంటుందని, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్థిక సహాయం నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. పిల్లలకు  చదువుకోవాలనే ఆరాటం ఉన్నా పేదరికంతో చదువులు ఆగిపోకుండా,  ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఏ ఒక్క పిల్లవాడు కూడా పేదరికంతో చదువుకు దూరం కాకూడదని ,పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని, మన తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని, పిల్లల చదువులు కొరకు తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు  పిల్లల చదువులకు  ఆలంబనగా మారాయని ఆయన అన్నారు. కోనసీమ జిల్లాలో 37,549 మంది విద్యార్థినీ, విద్యార్థులకు గాను 33,492 మంది తల్లులు ఉన్నారని, వీరి కొరకు 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి గాను  రూ.26 కోట్ల,39 లక్షల, 91వేల 895 లు జమ చేయడం జరిగిందన్నారు. వీరిలో ఎస్సీ విద్యార్థులు 10,231 మంది కాగా, ఎస్టీ విద్యార్థులు 207 మంది, బీసీ విద్యార్థులు 14,785 మంది , ఈబీసీ విద్యార్థులు 2,873 మంది, ముస్లిం మైనారిటీ 291 మంది, కాపులు 8,998 మంది, క్రిస్టియన్ మైనారిటీస్ 164 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారన్నారు. మహనీయులు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గడపగడపకు సుపరిపాలన తెచ్చి  మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. భావితరాలకు దిక్సూచిగా విద్యావ్యవస్థలో పలు మార్పులు చేయడం జరిగిందని వాటిని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  చదువుల విప్లవానికి రాష్ట్రప్రభుత్వం నాంది పలికిందన్నారు.  తలరాతలు మార్చే శక్తి చదువుకు ఉందని చదువును ఎవరో దొంగలించలేరని చదువుల పట్ల పేద విద్యార్థులు మక్కువ పెంచుకుని ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలన్నారు. విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టి విద్యార్థుల పాలిట ఆశాజ్యోతిగా నిలిచిందన్నారు.

       ఈ కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, డిఆర్వో సిహెచ్. సత్తిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జి.సంకురియ్య, ఎ ఎస్ డ బ్ల్యూ ఎస్.సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి కె.లక్ష్మీ నారాయణ, విద్యార్థినులు వారి తల్లులు, తదితరులు పాల్గొన్నారు.