ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించండి
విధులలో నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది పై క్రమశిక్షణ చర్యలు చేపడతాం
జిల్లా కలెక్టర్ బసంత కుమార్
పెనుగొండ మే 4 (ప్రజా అమరావతి): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.
బుధవారం పెనుగొండ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్, ఇంచార్జి ఆసుపత్రి సూపర్డెంట్ బాబూబుడేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని పేర్కొన్నారు. వివిధ వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, ఇతర సేవలపై వైద్యులను ఆరా తీశారు, ఆరోగ్యమిత్ర/ నర్సింగ్ స్టాఫ్ రోగులకు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రసవం సమయంలో గర్భిణీలకు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తల్లి బిడ్డ క్షేమం గా ఉండేలా చర్యలు తీసుకోవాలని వీరికి ఇచ్చే ప్రభుత్వ రాయితీల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలోనే వార్డులు , రక్త పరీక్ష కేంద్రం, డెంటల్ కేంద్రం తదితర వాటిని పరీక్షించి పరిశీలించడంతో పాటు, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. రక్త పరీక్ష కేంద్రంలో పరిశీలించినప్పుడు ఏ రక్త నమూనా ఎవరిది అనే అంశాన్ని ఎక్కడ పొందుపరిచారు అంటూ ప్రశ్నించారు, సిబ్బంది ఇబ్బందిపడడంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలందిస్తున్నాము అనడం సిగ్గుచేటని, పర్యవేక్షణ లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ఇలాగే ఉంటాయని తెలిపారు
వార్డు పరిసరాలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు.అదేవిధంగా వైద్యశాలలో ఆపరేషన్ థియేటర్ లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాలలో విధులకు హాజరు కానీ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ ఎం. నవీన్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ శివశంకరప్ప, తదితరులు పాల్గొన్నారు.