ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డిని కలిసిన అస్సాగో ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఎండీ

 



*ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డిని కలిసిన  అస్సాగో ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఎండీ


*


*ఏపీలో ఇథనాల్ మానుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన*


*అస్సాగో పరిశ్రమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఏపీఐఐసీ ఛైర్మన్*



అమరావతి, మే, 05 (ప్రజా అమరావతి): ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డిని అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అశిష్ గుర్నాని కలిశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ  కార్యాలయంలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ ఇథనాల్ మానుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ఛైర్మన్ కు అందజేశారు. ఏపీఐఐసీ ద్వారా  భూ కేటాయింపులు సహా మౌలిక వసతులు అందిస్తే  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు అస్సాగో పరిశ్రమకు చెందిన ఛైర్మన్ చందర్ ప్రకాశ్ గుర్నాని, ఎండీ అశిష్ గుర్నాని తమ ప్రతిపాదనపై ఏపీఐఐసీ ఛైర్మన్ తో చర్చించారు.  ఈ సందర్భంగా ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడుల భవిష్యత్ అంతా ఇథనాల్ తయారీపై ఉండనుందని పేర్కొన్నారు. ఇథనాల్ తయారీ ప్రక్రియ గురించి ఏపీఐఐసీ ఛైర్మన్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పారదర్శకత, పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వకంగా మెలిగి కచ్చితమైన విధానాలు పాటించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు వారు ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఏడాదిన్నరలోగా  రూ. 300 కోట్ల పెట్టుబడులు ఏపీలో పెట్టనున్నట్లు ఆసక్తి కనబరిచారు. ప్రత్యక్షంగా 90మందికి, పరోక్షంగా 120 మందికి ..మొత్తంగా 200 మందికి ఉపాధి అవకాశాలు అందించనున్నట్లు ప్రాజెక్టు నివేదిక సమర్పించారు. అందుకోసం 20 ఎకరాల భూమి అవసరమని ఛైర్మన్ ని కోరారు. ప్రాజెక్టు రిపోర్టుని పరిశీలించి.. ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది సహా ఇతర ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అస్సాగో ఛైర్మన్, ఎండీలకు సానుకూలంగా ఏపీఐఐసీ ఛైర్మన్ సమాధానమిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, సీజీఎం లచ్చి రామ్,అస్సాగో పరిశ్రమకు చెందిన ఛైర్మన్ చందర్ ప్రకాశ్ గుర్నాని, ఎండీ అశిష్ గుర్నాని పాల్గొన్నారు.