ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

 


నెల్లూరు, మే 13 (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమానికి  ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


 శుక్రవారం సాయంత్రం వెంకటాచలం మండల పరిధిలోని వడ్డిపాలెం గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి గ్రామస్తులు, వైకాపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

 తొలుత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజల అనంతరం మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 

 ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత జనంలోకి వెళ్తున్న తమకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, ఎక్కడా కూడా వ్యతిరేకత లేదని, ప్రతి గడపకు కూడా ముఖ్యమంత్రి అమలు చేసిన సంక్షేమ పథకాలు చేరాయని, ప్రజలంతా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసి, ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందజేస్తారని, వారి ఆశీస్సులే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు. ఎంత ఆలస్యమైనా ప్రతి గడపకు వెళ్లి పలకరిస్తా మని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. 

 ఈ కార్యక్రమంలో వెంకటాచలం ఎంపీడీవో శ్రీమతి సరళ, తాసిల్దార్ ప్రసాద్, స్థానిక  నేతలు మందల వెంకట శేషయ్య,  సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.