స్వామినాధన్ సిఫార్సులకు అనుగుణంగా వరి వద్దుతు ధర పెంచాలని కేంద్రానికి లేఖ

 

 *డిమాండ్ ను బట్టి అదనంగా మరికొన్ని రైతు గ్రూపులకు వ్యవసాయ యంత్ర పరికరాలు* 

*• గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాప్రభుత్వం  రైతాంగానికి పెద్దఎత్తున మేలు చేస్తున్నది*

 *•క్రాప్ హాలీడేను ప్రకటించాల్సిన  పరిస్థితులు రాష్ట్రంలో లేవు*

 *•స్వామినాధన్ సిఫార్సులకు అనుగుణంగా వరి వద్దుతు ధర పెంచాలని కేంద్రానికి లేఖ*


 *•ఇ-క్రాప్ కు అనుగుణంగా త్వరలోనే  డ్రిప్ ఇరిగేషన్  పరికరాలను రైతులకు అందజేస్తాం*

 *•ఈ నెల 14న  పంటల భీమా నష్ట పరిహారం దాదాపు రూ.3 వేల కోట్లను విడుదల* 

  *చేయనున్న ముఖ్యమంత్రి*

 *రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి*

అమరావతి,జూన్ 9 (ప్రజా అమరావతి): ఈప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పెద్ద పీఠవేస్తూ రైతాంగానికి అండగా నిలవడం జరుగుచున్నదని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి  తెలిపారు. తొలి దశలో 10,778 రైతు       భరోసా కేంద్రాల్లో ఒక గ్రూపుకు మాత్రమే వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేయడం జరుగుచున్నదని, డిమాండ్ మరియు అవసరాన్ని బట్టి అదనంగా మరి కొన్ని రైతు గ్రూపులకు  వైఎస్సార్ యంత్ర సేవా పథకం క్రింద వ్యవసాయ యంత్ర పరికరాలు, పనిముట్లను 40 శాతం రాయితీతో అందజేస్తామని మంత్రి తెలిపారు.  గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వ్యవసాయ  యాంత్రీకరణలో భాగంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం క్రింద  ఒకే  రోజు దాదాపుగా 4 వేల ట్రాక్టర్లు, 320 హార్వెస్టర్లను ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం  జరిగిందన్నారు. ఇది ఒక వినూత్నమైనటు వంటి కార్యక్రమమన్నారు.  గ్రామంలో రైతు గ్రూపులను ఏర్పాటు చేసి  ఆ గ్రామానికి చెందిన రైతుల ఆస్తిగా ఈ యంత్ర పరికరాలను అందజేసి చిన్న, సన్నకారు రైతులకు  తక్కువ బాడుగకు (అద్దె) ఇచ్చే విధంగా కస్టం  హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  గత ప్రభుత్వం అనుసరించిన విధానం మాదిరిగా కాకుండా తమ ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున మేలు చేసే విధంగా  మార్కెట్ లో అందుబాటులో ఉండే 175 మోడల్స్ లో  రైతుకు నచ్చిన ట్రాక్టర్, హార్వెస్టర్, రోటావేటర్  కొనుగోలు చేసుకుంటే కొనుగోలు బిల్లులో 40 శాతం  సొమ్మును నేరుగా రైతుల ఖాతాకు జమచేయడం జరిగిందన్నారు. ఇందుకై  దాదాపు  రూ.175 కోట్లను  ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమచేయడం జరిగిందన్నారు. యంత్ర పరికరాలలో కొనుగోలు విషయంలో దళారీ వ్యవస్థతో పాటు ప్రభుత్వ ప్రమేయం  కూడా  లేకుండా రైతులే నేరుగా తమకు నచ్చిన యంత్ర పరికరాలను కొనుగోలు చేసుకునే విధంగా ఎంతో పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. 

గత ప్రభుత్వంతో పోల్చితే మా ప్రభుత్వమే రైతులకు పెద్ద ఎత్తున మేలు చేస్తున్నది..

రైతుల సంక్షేమాన్ని, అభివృద్దిని కాంక్షిస్తూ తమ ప్రభుత్వం ఎన్నో వినూత్నపథకాలను అమలు చేయడంతో పాటు రైతులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున  అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య కాలంలో   రైతులకు అందజేసిన ఆర్థిక సహాయాన్ని మరియు గత మూడేళ్లలో తమ ప్రభుత్వం రైతులకు అందజేసిన ఆర్థిక సహాయాన్ని పోల్చుతూ మంత్రి ఈ సందర్బంగా వివరించారు. 

వైఎస్సార్ రైతుభరోసా-పిఎం కిసాన్ పథకం క్రింద గత మూడేళ్లలో 52.38 లక్షల రైతులకు లబ్దిచేకూర్చే విధంగా రూ.23,875.29 కోట్లను తమ ప్రభుత్వం వెచ్చించిదన్నారు. ఇందులో  రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14,459.81 కోట్లు కాగా, కేంద్ర వాటా రూ.9,415.48 కోట్లని ఆయన తెలిపారు.  ఇటు వంటి పథకం క్రిందే గత ప్రభుత్వం  ఐదేళ్లలో 46.76 లక్షల రైతులకు రూ.2,440.29 కోట్లను వెచ్చించిందని, ఇందులో రాష్ట్ర వాటా రూ.1,765.29 కోట్లు,  కేంద్ర వాటా రూ.675 కోట్లని ఆయన వివరించారు. అదే విధంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం క్రింద  మూడేళ్లలో  65.65 లక్షల రైతులకు లబ్దిచేకూర్చే విధంగా రూ.1,282.11 కోట్లను వెచ్చించగా, ఇటు వంటి పథకం క్రిందే గత ప్రభుత్వం ఐదేళ్లలో 40.60  లక్షల రైతులకు లబ్దిచేకూర్చే విధంగా రూ.685.46 కోట్లను వెచ్చించడమైందని తెలిపారు. వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకం క్రింద తమ ప్రభుత్వం గత మూడేళ్లలో 29.05 లక్షల రైతులకు లబ్దిచేకూర్చే విధంగా రూ.3,707.02 కోట్ల మేర భీమా సొమ్మును చెల్లించగా, ఇటు వంటి పథకం క్రిందే గత ప్రభుత్వం ఐదేళ్లలో 30.85 లక్షల రైతులకు రూ.3,411.20 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు.  *ఐతే కేవలం ఈ ఏడాదికి సంభందించి పంటల భీమా నష్టంగా  రూ.2,500 కోట్ల నుండి రూ.3 వేల కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంటుందని  ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని, ఈ సొమ్మును  ఈ నెల 14 న   రాష్ట్ర ముఖ్యమంత్రి  బటన్ నొక్కి  నేరుగా రైతుల ఖాతాకు జమచేయనున్నారని మంత్రి తెలిపారు.*

  రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తు నుండి విక్రయం వరకూ అన్ని రకాల సేవలను రైతులకు అందజేయడం జరుగుచున్నదన్నారు. ఆర్.బి.కె.ల ద్వారానే ధాన్యం కొనుగోలు చెసే వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గత మూడేళ్లలో తమ ప్రభుత్వం రూ.856.14 కోట్ల విలువైన  29.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను  49.76 లక్షల మంది రైతులకు రాయితీపై అందజేయగా, గత ప్రభుత్వం  ఐదేళ్లలో రూ.1,230 కోట్ల విలువైన 47.64 లక్షల క్వింటాళ్ల విత్తనాలను  62.27 లక్షల మంది రైతులకు అందజేశారని ఆయన తెలిపారు. గత మూడేళ్లలో తమ ప్రభుత్వం 147 నియోజక వర్గాల స్థాయిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ను, 13 జిల్లా స్థాయి ల్యాబ్స్ ను మరియు 4 రీజనల్ కోడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగా, గత ప్రభుత్వం ఐదేళ్లలో 3 ఎఫ్.సి.ఓ. ల్యాబ్స్ ను, ఒక బయో ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ల్యాబ్ ను, 5 పెస్టిసైడ్ ల్యాబ్స్ ను మరియు 3 సీడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ను మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.  వైఎస్సార్ పొలంబడి పథకం క్రింద  గత మూడేళ్లలో తమ ప్రభుత్వం రూ.71.17 కోట్లను వెచ్చించి  39,944 పొలంబడి కార్యక్రమాలను నిర్వహించి  11.98 లక్షల మంది రైతులకు లబ్దిచేకూర్చగా, గత ప్రభుత్వం  ఐదేళ్లలో కేవలం రూ.3.06 కోట్లను వెచ్చించి 2,424 పొలంబడి కార్యక్రమాలను నిర్వహించి కేవలం 72 వేల మంది రైతులకు లబ్దిచేకూర్చిందన్నారు. వ్యవసాయ పంట రుణాలుగా తమ ప్రభుత్వం  గత మూడేళ్లలో 291.66 లక్షల మంది రైతులకు రూ.4,21,042 కోట్లు మేర పంట రుణాలు అందజేయగా, గత ప్రభుత్వం  ఐదేళ్లలో 371.85 లక్షల మంది రైతులకు  రూ.3,54,943 కోట్లను  పంట రుణాలుగా అందజేయడం జరిగిందని మంత్రి వివరించారు. 

క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో  లేవు..

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించే పరిస్థితి ఏర్పడలేదని, రిజర్వాయర్లు అన్నీ నీటితో నిండుగా  కళకళలాడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో   క్రాప్ హాలిడే ను ప్రకటించాల్పిన అవసం లేదని మంత్రి స్పష్టంచేశారు. 

వరి మద్దతు ధర పెంచాలంటూ  కేంద్రానికి త్వరలో లేఖ...

వరి మద్దతు ధరపై కేవలం  రూ.100 లను మాత్రమే కేంద్ర పెంచడం సరిగాదని,  స్వామినాధన్ కమిషన్ సిఫార్సులుకు అనుగుణంగా  ఈ మద్దతు ధరను ప్రకటించాలని  కేంద్రానికి గతంలో లేఖ వ్రాయడం జరిగిందని మంత్రి తెలిపారు.   రైతు చేసే ఖర్చులపై  50 శాతం అదనంగా  లబ్ది చేకూరే విధంగా మద్దతు ధర ప్రకటించాలని  కేంద్రాన్ని కోరుతూ మరో లేఖ వ్రాయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇ-క్రాప్ బుకింగ్ కు అనుగుణంగా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను త్వరలోనే రైతులకు అందజేస్తామన్నారు. 

 

Comments