ప్రాంతంః రాష్ట్ర సచివాలయం (ప్రజా అమరావతి);
*చరిత్రాత్మకం మన ఆరోగ్యశ్రీ*
*జగనన్న ఈ పథకం ద్వారా ఎంతో చేస్తున్నారు*
*గత ప్రభుత్వం ఏటా 500 కోట్లు ఖర్చు చేస్తే.. మనం రూ.2500 కోట్లు ఖర్చు చేస్తున్నాం*
*గత ప్రభుత్వంలో 1059 రోగాలకే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే.. మన ప్రభుత్వంలో దాదాపు 2500కు పెంచాం*
*పొరుగు రాష్ట్రాల ఆస్పత్రి ద్వారా కూడా ఆరోగ్యశ్రీ సేవలు*
*ఆరోగ్య ఆసరా రోగులకు ఒక భరోసా*
*వెయ్యి రూపాయలు దాటే ప్రతి వైద్యానికి పేదలు ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందేలా చూడాలి*
*క్షేత్రస్థాయి సిబ్బంది బాగా పనిచేస్తే ప్రభుత్వ ఆశయాలు మరింతగా నెరవేరతాయి*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని*
*ఆరోగ్యశ్రీ విభాగం ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం*
ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సరికొత్త వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో మేలు చేస్తోందని, చరిత్ర చెప్పుకునేలా జగనన్న ఈ పథకాన్ని మార్చారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం విడదల రజిని ఆరోగ్యశ్రీ విభాగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేశ చరిత్రలోనే మొట్టమొదట ప్రవేశపెడితే.. ఈ పథకానికి మరింత మెరుగులు దిద్ది జగనన్న దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. గత టీడీపీ పాలనలో ఆరోగ్య శ్రీ పథకం కింద కేవలం 1059 రోగాలకు మాత్రమే చికిత్స అందిస్తే.. జగనన్న ఏకంగా 2,434 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చేశారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల రాజధాని నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి చోట్ల ఏకంగా 200 ఆస్పత్రుల ద్వారా సేవలు అందజేస్తున్నామన్నారు. వెయ్యి రూపాయలు దాటే ప్రతి వైద్యం ఆరోగ్యశ్రీ కిందనే అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఆ మేరకు ఆరోగ్యశ్రీకి బడ్జెట్ కూడా కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కోసం ఏటా కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం ఏటా రూ.2500 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా అమలు చేస్తున్నదన్నారు. ఆరోగ్య ఆసరా కింద 1,519 రకాల రోగాలకు చికిత్స పొందిన రోగులకు వారి ఆరోగ్యం కుదుట పడేవరకు రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ.5వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నామని గుర్తు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాధి తీవ్రతను బట్టి ప్రతి నెలా రూ.3వేలు నుంచి రూ.10వేలు పింఛన్ల రూపంలో ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తే సత్ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోగ్యశ్రీ రోగులకు అందుతున్న వైద్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉండాలన్నారు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు. దీనివల్ల పేద రోగులకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న అస్పత్రులకు ఆనుమతులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు, సిబ్బంది ఉంటేనే అనుమతులు ఇవ్వాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ కేసులకు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూసే ఆడిట్ కూడా ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో జరగాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఇబ్బందులు ఎదురయితే ప్రభుత్వం దృష్టికి రోగులు తీసుకొచ్చేలా మనం టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆస్పత్రుల ఆవరణలో అక్కడ అందే ఆరోగ్యశ్రీ వైద్య సేవల వివరాలను అందరికి కనిపించేలా బోర్డులు ఏర్పాటుచేయాలని చెప్పారు. ఇవే బోర్డులు ఆ ఆస్పత్రి పరిధిలోని సచివాలయంలో కూడా కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సహజ కాన్పులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, కాన్పులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది కాబట్టి ప్రభుత్వ వైద్యశాలలకు ఇది ఎంతగానో దోహదం అవుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాక రికవరీ పిరియడ్ లోపే మళ్లీ అనారోగ్య సమస్య వస్తే ఆ రోగికి ఆరోగ్యశ్రీ కిందే మళ్లీ వైద్యం అందాలని చెప్పారు. సిబ్బంది మొత్తం చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రభుత్వ ఆశయాలు నెరవేరతాయని పేర్కొన్నారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అందరం పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్‌చంద్, ఆ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment