ఉత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అందరూ గర్వపడే విధంగా, గౌరవంగా నిర్వహించాలినెల్లూరు, జులై 16 (ప్రజా అమరావతి):--బారా షాహిద్ దర్గా రొట్టెల పండగ గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మతసామరస్యం పాటిస్తూ హుందాగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.


నెల్లూరు నగరపాలక సంస్థలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశం మందిరంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు"  బారాషహీద్ దర్గా -  రొట్టెల పండగ " నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ విజయరావుతో కలిసి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రొట్టెల పండుగలో భాగంగా

వచ్చే ఆగస్టు మాసం 9 వ తేదీన షహదాత్, 10 వ తేదీన గంధం,  11వ తేదీన రొట్టెల పండుగ,  12వ తేదీన తహలీల్ ఫతేహ  13వ తేదీన ముగింపు ఉత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అందరూ గర్వపడే విధంగా, గౌరవంగా నిర్వహించాల


న్నారు. ఈసారి కార్యక్రమానికి జిల్లా ప్రజలు యాత్రికులు భక్తుల మదిలో నిలిచిపోయే విధంగా ఇప్పటివరకు జరగని విధంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న కార్పొరేషన్ పరంగానే కాకుండా ప్రభుత్వపరంగా కూడా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడు ముందు ఉంటారన్నారు.  గతంలో వారు ఒకసారి రొట్టెల పండుగలో పాల్గొన్నారన్నారు.  రూరల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని రమ్మని పిలుస్తామని చెప్పారని వారిని పిలుచుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా గట్టి పోలీస్ బందోబస్తుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  రొట్టెల పండుగను జయప్రదం చేయాలన్నారు. అధికారులందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే నెల 9 నుండి 13వ తేదీ వరకు భాగస్వాములై సమన్వయంతో పని చేయాలన్నారు. పండుగ పూర్తి అయ్యేవరకు తాను అందుబాటులో ఉంటానన్నారు. అవసరమైతే ఎన్నిసార్లు అయినా రావడానికి సిద్ధంగా ఉంటానన్నారు. ఇటీవల  కరోనా కారణంగా రొట్టెల పండుగ వాయిదా పడటంతో ఈసారి జరిగే పండుగకు రెట్టింపు సంఖ్యలో భక్తులు యాత్రికులు వస్తారని వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యము మరుగుదొడ్లు మంచినీటి వంటి సౌకర్యాలను సజావుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికను పక్కాగా సిద్ధం  చేయడంతోపాటు అవసరమైనంత బడ్జెట్ కావలసిన బృందాలను ఏర్పాటు  చేయాలన్నారు.


అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ కేవి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ  రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం మొహరం సందర్భంలో 12 మంది వీర సైనికుల సమాధులను సందర్శించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరిపే ఓ ప్రత్యేకమైన కార్యక్రమం అన్నారు.  ఇటీవల కోవిడ్ కారణంగా జరుపుకోలేకపోయామన్నారు.  స్థానిక మత పెద్దలు ప్రజాప్రతినిధుల సూచనల మేరకు భక్తులు యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాంప్రదాయాలను పాటిస్తూ ముందు నుంచే ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుందన్నారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాలు మండలాల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందన్నారు. రొట్టెల పండుగకు మరింత  ప్రాశస్త్యం కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం క్యాలెండర్లో 7 సంవత్సరాలుగా మరింత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో  అందంగా తీర్చిదిద్దేపనులు ముమరంగా చేపట్టాలన్నారు.  మంచినీటి ట్యాంకులు పారిశుద్ధ్యము బాగుండాలని  తాగే నీరు నాణ్యతగా ఉండాలని స్పష్టం చేశారు  పండుగకు వచ్చే యాత్రికులు భక్తులకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తితే వారికి అవసరమైన మందులు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ బృందాల శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. దర్గా వద్ద క్యూ నిర్వహణ చాలా ముఖ్యమన్నారు. వచ్చే ఆగస్టు మాసం 10 వ తేదీ   రాత్రి గంధ మహోత్సవం సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.  తక్కువ సమయంలో దర్శనం అయ్యేలా క్యూలను ఏర్పాటు చేయాలన్నారు. రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్ బారికేడింగు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రింబవళ్లు దర్గా ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. కొందరు యాత్రికులు భక్తులు రాత్రి పడుకొని తెల్లవారుజామునే వెళ్తారని అటువంటి వారికోసం సమీపంలోని కళ్యాణ మండపాలు హాలు హాళ్లు సమకూర్చాల్సి ఉంటుందన్నారు.  జిల్లాలోని ఇతర దర్గాల వివరాలను బస్టాండు, బస్టాపు ,రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచాలన్నారు. చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని వారి కోసం ప్రత్యేకంగా ఆహారము, పాలు నీరు అందుబాటులో ఉంచేందుకు తగిన ఏర్పాటు చేయాలన్నారు.  స్వ ర్ణాల చెరువు ఘాట్లో స్నానం చేసిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా అవసరమైన గదులను, ఏర్పాటు చేయాలన్నారు. క్యూలలో గాని ఘాటు వద్ద గాని తొక్కిసలాట జరగకుండా గట్టి  భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఒకే సమయంలో ప్రముఖులు వచ్చినప్పుడు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. దర్గా కమిటీ సభ్యులు జిల్లా అధికార యంత్రంగానికి అన్ని విధాల సహకారం అందించాలన్నారు.  దర్గా వద్దకు రాకపోకల మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. రైల్వే స్టేషన్లో బస్టాపుల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసి దర్గాకు రావడానికి సరైన మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. అవసరాన్ని బట్టి ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. స్వర్ణాల చెరువులో నీటి నాణ్యతను, లోతును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలన్నారు. స్వర్ణాల చెరువు లోకి దిగలేని వారికోసం 

షవర్ బాత్ లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. పండుగకు వచ్చే భక్తులు యాత్రికులకు ఆహ్లాదకర అనుభూతిని అందించే విధంగా నగరాన్ని, దర్గా పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. 


జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ విజయ రావు మాట్లాడుతూ నేరాలను అదుపు చేసేందుకు సమూహాలను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేస్తామని ఇనుప బారికేట్లను పక్కాగా ఏర్పాటు చేస్తామని షిఫ్ట్ డ్యూటీలలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తామన్నారు. నగర మేయర్ శ్రీమతి పొట్లూరు స్రవంతి మాట్లాడుతూ బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిచ్చిందని కులమతాలకు అతీతంగా మతసామరస్యాన్ని పెంపొందించే విధంగా విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. 


నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ బారా షహిద్ దర్గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినదని,  అజ్మీర్ స్థాయిలో ప్రశస్తి చెందిందని మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచిందని కోరిన కోరికలు తీర్చే పండుగగా రొట్టెల పండుగ నిలిచిందని దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు యాత్రికులు తరలివస్తున్నారని చెప్పారు.  సంవత్సరాలుగా కరోనా కారణంతో రొట్టెల పండుగ జరగలేదని కేవలం సాంప్రదాయపద్ధంగా కొంతమంది మతపెద్దల సమక్షంలో జరిగిందని చెప్పారు.  ఈసారి గతం కంటే రెండింతలు - నాలుగింతలు అధిక సంఖ్యలో భక్తులు దర్గాకు రానున్నారన్నారు.  రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించడం  సంతోషదాయకమన్నారు.  వచ్చే భక్తులకు చిన్నపాటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు  తీసుకొని పండుగను విజయవంతం చేయాలన్నారు. ఎక్కడ రాజీ పడకుండా పూర్తి బాధ్యత తీసుకొని నభూతో  నభవిష్యత్తు తలపించే విధంగా ఆర్థిక ప్రణాళికను రూపొందించాలన్నారు. 


ఈ సమావేశంలో  సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్.  కూర్మానాద్ గారు, మున్సిపల్ కమిషనర్ జాహ్నవి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఖలీల్ అహ్మద్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్  సహాయ కార్యదర్శి శ్రీ మహమ్మద్ అలి,  జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి  శ్రీమతి కనకదుర్గ భవాని , వక్ఫ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ బాషా  వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. 

Comments