నెల్లూరు, జులై 5 (ప్రజా అమరావతి): తనకు విద్య నేర్పిన గురువును మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మరిచిపోకుండా గుర్తు పెట్టుకొని వేదికపైకి పిలిచి తాను కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టి, కాళ్లకు నమస్కారం పెట్టి ఘనంగా సత్కరించిన అరుదైన దృశ్యం చూపరులను ఔరా అనిపించేలా చేసింది.
మంగళవారం ఉదయం పొదలకూరు జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జగనన్న విద్యాకానుక మూడో విడత పంపిణీ సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సభలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏడవ తరగతి చదువుతుండగా సక్రమంగా చదివేవాడిని కాదని, తన తండ్రి మందలించే వాడని, దీంతో తనకు విద్యాబుద్ధులు నేర్పిన సిద్దయ్య మాస్టారు వారింట్లో తనను ఉంచుకొని చదువు చెప్పారని, తనకు సంబంధించి తన తల్లిదండ్రుల తర్వాతి స్థానం తన గురువు సిద్దయ్య మాస్టారుకే దక్కుతుందని చెప్పారు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు ప్రధాన కారణం మా సిద్దయ్య మాస్టారే
అని గర్వకారణం గా చెప్పారు. సిద్దయ్య మాస్టారు చాలా నిరాడంబరమైన వ్యక్తి అని, పాఠశాలకు కూడా విద్యార్థుల వలె యూనిఫామ్ లాగా తన దుస్తులు వేసుకొని వచ్చేవారిని, ఇప్పటికి కూడా తన బిడ్డలు అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్నా కూడా, ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నారని కొనియాడారు. సిద్దయ్య మాస్టారును ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు తమ విద్యార్థులను తమ కన్నబిడ్డల గా భావించి వారు చేసిన తప్పులను సరిదిద్ది వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది మంచి భవిష్యత్ అందించాలని ఆకాంక్షించారు. ఇప్పటికి కూడా తన గురువును మర్చిపోకుండా ఘనంగా సత్కరించిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గురుభక్తిని చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. సమాజంలో గురువులకు ఉన్న గౌరవ మర్యాదలు, ఉన్నత స్థానాన్ని ఈ దృశ్యం ప్రస్ఫుటం చేసింది.
addComments
Post a Comment