రెగ్యులర్, అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 88.68 శాతం ఉత్తీర్ణత..

 


విజయవాడ (ప్రజా అమరావతి);

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స స‌త్య‌ నారాయ‌ణ‌

అడ్వాన్డ్స్ సప్లిమెంటరీలో మొత్తం 64.23 శాతం ఉత్తీర్ణత.. 

రెగ్యులర్, అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 88.68 శాతం ఉత్తీర్ణత..


రాష్ట్రంలో ఎక్కడా స్కూళ్ల విలీనం జరగలేదు.. కేవలం 3, 4, 5 తరగతులు విలీనం మాత్రమే జరిగింది..

ప్రైవేట్ పాఠశాలలకు మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం..

పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు.  ఈ ఫలితాల్లో బాలికలు 68.76 శాతం, బాలురు 60.83 శాతం ఉత్తీర్ణత నమోదైందని, మొత్తంగా 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించారు. విజయవాడలో లెమన్ ట్రీ హోటల్ లో బుధవారం ఈ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ  విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి గ్లోబల్ విద్యార్థిగా మార్చాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వివరించారు.  ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక ప్రమాణాలు మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. దీనికి ఉద్యోగులు, ప్రజలు అందరూ సహకరించాలని మంత్రి విజ్క్షప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టెన్త్‌  సప్లిమెంటరీకి 2,06,648 దరఖాస్తు చేయగా.. వారిలో 1,91,846 మంది పరీక్షలు రాశారని తెలిపారు. అడ్వాన్డ్స్‌ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో మొత్తం 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. బాలురులో 1,09,413 మంది హాజరుకాగా  66,554 మంది పాస్ అయ్యారని, ఉత్తీర్ణతా శాతం 60.83 శాతంగా నమోదైందని తెలిపారు. బాలికలు 82,433 మంది హాజరుకాగా 56,677 మంది ఉత్తీర్ణులై 68.76 శాతం నమోదుచేశారన్నారు. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది 64.23 శాతంతో  ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత సాధించగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదవ తరగతి పరీక్షలకి 6,06,070 మంది పరీక్షలకి హాజరు కాగా.. 5,37,491 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రకటించారు. మొత్తంగా ఉత్తీర్ణతా శాతం 88.68 శాతం అని తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్‌ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే ‘కంపార్టుమెంటల్‌ పాస్‌’ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్, వారి ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని.. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థికి హాల్ టిక్కెట్లు ఇచ్చామని, ఎగ్జామ్ ఫీజు కూడా పెట్టలేదని గుర్తుచేశారు. ఈ‌ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైన‌వారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. 

మరోవైపు రాష్ట్రంలో విద్యాసంస్కరణలపై ఇటీవల ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, ఆరోపణలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ఇలాంటి అసత్య ప్రచారాలపై త్వరలో ఆ పాఠశాలలకు వెళ్లి పర్యటిస్తానని, ఈ ప్రచారాల్లో వాస్తవాలు లేవని నిరూపించేందుకు నా పర్యటన ఉంటుందని మంత్రి బొత్స ప్రకటించారు. రాష్ట్రంలో పాఠశాలల విలీనం జరగలేదని.. కేవలం 3, 4, 5 తరగతుల విలీనం మాత్రమే జరిగిందన్నారు. 5,800 స్కూళ్లను మ్యాపింగ్ చేశామన్నారు. తరగతుల విలీనం రాబోయే తరాల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేపడతామే తప్ప ఇతర కారణాలు ఉండవన్నారు. విలీన ప్రక్రియకు సంబంధించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలు తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు తాము వ్యతిరేకం కాదన్నారు. నిబంధనలు పాటించమని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నామన్నారు. ‘అమ్మఒడి’ పథకం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఇస్తున్నామన్నారు.  విద్యా వ్యవస్థలో ప్రయోగాత్మకంగా కొన్ని మార్పులు చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిలో లోటుపాట్లపై సమీక్షించుకుంటామని, ప్రతిపక్షాలు  అనవసరంగా విమర్శలు చేయడం తగదని సూచించారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు ఉద్యోగులు తప్పకుండా సహకరించాలని, ఇది వారి విధి అని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని  మంత్రి బొత్స తెలిపారు.  విద్యాసంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రతి క్లాస్ రూంలో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో  ఇలాంటి విధానం ఎక్కడా లేదన్నారు. త్వరలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ  తెలిపారు.  ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ దేవానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   


Comments