స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం, వారి ఆదర్శ భావాలు, సేవాగుణాలు, పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమ

 


నెల్లూరు, ఆగస్టు 3 (ప్రజా అమరావతి):  స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం, వారి ఆదర్శ భావాలు, సేవాగుణాలు, పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమ


ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు. 

 ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నూతన జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కాకాని వెంకటరత్నం గారి జయంతిని, జిల్లాకు చెందిన వెలుగులోకి రాని స్వాతంత్ర్య సమరయోధులను మననం చేసుకునే సదస్సును జడ్పీ సీఈఓ శ్రీమతి వాణి, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. 

 తొలుత ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, ఇతర ప్రజాప్రతినిధులు జడ్పీ కార్యాలయ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మొక్కలు నాటారు. తదుపరి స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కాకాని వెంకటరత్నం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో వెలుగులోకి రాని జిల్లాకు చెందిన ఎందరో మహనీయుల జీవిత విశేషాలను తెలిపే పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 

 తదుపరి  జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణ అధ్యక్షతన సెమినార్ ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ కాకాణి వెంకటరత్నం గారు మన రాష్ట్రానికి శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేశారని, 1972 లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో కీలక నాయకుడిగా పనిచేస్తూ అసువులు బాసారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జడ్పీ సీఈఓ శ్రీమతి వాణి మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవాలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయని, ఈనెల 13, 14, 15 తేదీల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలని ఆమె పిలుపునిచ్చారు. 


ఆకట్టుకున్న విద్యార్థుల ప్రసంగాలు

.................................... 

ఈ సెమినార్ లో తడ, అనుమసముద్రంపేట, కావలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, నెల్లూరు డీకే డబ్ల్యూ డిగ్రీ కళాశాల విద్యార్థినుల ప్రసంగాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత విశేషాలను, స్వాతంత్రోద్యమంలో వారు చూపిన పోరాట పటిమ, సేవా, త్యాగాలను విద్యార్థులు తెలుగు, హిందీ,ఆంగ్ల భాషల్లో చక్కగా వివరించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థినిలు డి తేజిత, జి చిన్మయి, దీపిక,  కీర్తన, టి గాయత్రి, ఎం అనిత, ఝాన్సీ, నీలిమ, సంజన, పి కాజల్, అనూష, సనకు మెమెంటోలు ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. 


ఆలోచింపచేసిన వక్తల ప్రసంగాలు

....................................... 

ఈ కార్యక్రమానికి వక్తలుగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి, శ్రీ కళాలయ సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి గూడూరు లక్ష్మి, కావలి జవహర్ భారతి కళాశాల అధ్యాపకులు శ్రీ కృష్ణ ప్రసాద్ ప్రసంగాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన వారి జీవిత విశేషాలను చాలా క్లుప్తంగా వివరించిన తీరు అద్భుతం.  మహాభారత శ్లోకాలతో స్వతంత్ర సమరయోధుల జీవిత విశేషాలను అన్వయించి గూడూరు లక్ష్మి చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. జిల్లాకు చెందిన మహాకవి తిక్కన, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమతి పొనకా కనకమ్మ సేవలను, త్యాగాలను చాలా చక్కగా సభికులకు వివరించారు. దేశాన్ని ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి అన్న విషయాలను కృష్ణ ప్రసాద్ తన ఉపన్యాసంలో చిన్నారుల్లో దేశభక్తి పెంపొందేలా వివరించారు.

 చివరిగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులను జడ్పీ చైర్పర్సన్ ఘనంగా సత్కరించారు.  స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ఆద్యంతం దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 

 ఈ వేడుకల్లో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్ పర్సన్ శ్రీమతి సుప్రజ, జడ్పీ వైస్ చైర్ పర్సన్ జయ లక్ష్మమ్మ, బొందిలి, ముదిరాజ్, ముస్లిం సంచారజాతుల, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీ కిషోర్ సింగ్, శ్రీ కె నారాయణ రావు, శ్రీమతి ఆసిఫా, శ్రీ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి దొంతు శారద, సమగ్ర శిక్ష ఏపీసి శ్రీమతి ఉషారాణి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి ధనలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీమతి రమాదేవి, ఐసిడిఎస్ పిడి ఉమా మహేశ్వరి, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య, పశుసంవర్ధక శాఖ జెడి శ్రీ మహేశ్వరుడు తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments