నీట్ పరీక్షలో సత్తా చాటిన ఎస్సీ గురుకులాలునీట్ పరీక్షలో సత్తా చాటిన ఎస్సీ గురుకులాలు

27 మెడికల్, డెంటల్ సీట్లను సాధించిన విద్యార్థులు

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, సెప్టెంబర్ 8 (ప్రజా అమరావతి): ఎస్సీ గురుకులాలకు చెందిన 85 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హతను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తమ విద్యార్థులలో 12 మంది ఎంబీబీస్, మరో 15 మంది డెంటల్ సీట్లను సాధించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఈడ్పుగల్లు, అడవి తక్కెళ్లపాడు, చిన్నటేకూరులలో ఎస్సీ గురుకులాలకు చెందిన నీట్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయని ఒక ప్రకటనలో నాగార్జున తెలిపారు. ఈ మూడు కేంద్రాల నుంచి 111 మంది నీట్ పరీక్షలకు హాజరు కాగా వారిలో 85 మంది అర్హతను సాధించారని చెప్పారు. వీరిలో 27 మంది విద్యార్థులు మెడికల్, డెంటల్ సీట్లను సాధించారని వివరించారు. అత్యధికంగా 9 మెడికల్, 9 డెంటల్ సీట్లను చిన్న టేకూరు(కర్నూలు) విద్యార్థులు సాధించగా ఈడ్పుగల్లుకు చెందిన విద్యార్థులు 7 సీట్లను, అడవి తక్కెళ్లపాడు కు చెందిన విద్యార్థులు 2 సీట్లను సాధించారని తెలిపారు. వైద్య సీట్లను సాధించిన విద్యార్థులను నాగార్జున ఈ సందర్భంగా అభినందించారు.

Comments