*టీడీపీ అధికారంలోకి వచ్చాక వర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు*
*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్*
వెలగపూడి సచివాలయం, (ప్రజా అమరావతి) : తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతామని నారా లోకేశ్ ప్రకటించారు. ఇది జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరు అత్యంత దారుణమని లోకేశ్ మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్ల నిధులు జగన్ కొట్టేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఏకపక్షంగా మార్చేశారని, రాష్ట్ర చరిత్రలో ఈ రోజు చీకటి రోజని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆనాడు హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ ప్రారంభించారని, దానికి వైఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఒక సైకో. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మహనీయుల పేర్లతో ఉన్న సంక్షేమ కార్యక్రమాల పేర్లు మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్ల నిధులు జగన్ కొట్టేశారని ఆరోపించారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ మహనీయుడు, తెలుగు జాతికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం తెలుగు జాతిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు వారికి గుర్తింపు తెచ్చింది, దేశంలో మొదట సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఎన్టీఆర్ అని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చడానికే రహస్య కేబినెట్ నిర్వహించారని మండిపడ్డారు. ఇదే పద్ధతిలో చంద్రబాబు ఆలోచించి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవని, ఆయన ఎక్కడా వైఎస్ పేరు తొలగించలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక గతంలో తమిళనాడులో ఉన్న రాజకీయం ఇక్కడ తీసుకొచ్చారని, ఇదే పద్దతి కొనసాగితే రాష్ట్రం పేరు కూడా మార్చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పేరు మార్పుతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు అనేకం ఉంటే జగన్ ప్రభుత్వం పేర్లు మార్చే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరు పెట్టి తీరుతామని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌పై అంత గౌరవం ఉంటే 'హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చారు? అన్న క్యాంటీన్ ఎందుకు ఎత్తేసారు?' సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జిల్లాల్లో వైద్య, ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకొచ్చిన సమయంలో బహుశా జగన్ టెన్త్ పేపర్లు కొట్టేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడేమో అని ఎద్దేవా చేశారు.
addComments
Post a Comment