కుప్పం– మారుతున్న రోజులు, మారుతున్న రాజకీయాలు...


కుప్పం, చిత్తూరు జిల్లా (ప్రజా అమరావతి);


*వరుసగా మూడో ఏడాది వైయస్సార్‌ చేయూత.*


*చిత్తూరు జిల్లా కుప్పంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4949 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా మాట్లాడుతూ  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:* 


దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. చిక్కటి చిరునవ్వులు, ఆప్యాయతలు, ఆత్మీయతలు  పంచిపెడుతున్న ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడుకి, అవ్వా, తాతలకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.


*కుప్పం– మారుతున్న రోజులు, మారుతున్న రాజకీయాలు...*


మారుతున్న రోజులు, మారుతున్న రాజకీయాలు. కుప్పం అంటే ఈరోజు అక్కచెల్లెమ్మల అభివృద్ధి. కుప్పం అంటే ఈరోజు నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. వీరి ప్రతి ఇంటా వారి చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తోంది. కుప్పం అంటే ఈరోజు చంద్రబాబునాయుడు గారి పరిపాలన కాదు.  కుప్పంలో ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేవుడి దయతో 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు వరుసగా మూడో ఏడాది వైయస్సార్‌ చేయూత డబ్బులు విడుదల చేసే మంచి కార్యక్రమాన్ని కుప్పం నుంచి చేస్తున్నాం. 


*వారం రోజులపాటు...* 

వైయస్సార్‌ చేయూతగా ఈ ఏడాది అక్కచెల్లెమ్మలకు అందిస్తున్న ఆర్ధిక సహాయం రూ.4949 కోట్లు... 26,39,703 అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా బటన్‌ నొక్కి జమ చేయబోతున్నాను.  వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాలుపంచుకుంటూ ప్రతి మండలంలో ఈ కార్యక్రమం జరుపుతారు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ కుప్పం నుంచి నేను ప్రారంభిస్తున్నాను. వారం రోజుల పాటు ప్రతి మండలంలో సర్పంచ్‌లు, అక్కడున్న ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిల్‌ మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిపి ప్రజా ప్రతినిధులంతా నా అక్కచెల్లెమ్మల సంతోషంలో భాగస్వామ్యులవుతారు. 


*అక్క చెల్లెమ్మల జీవితాల్లో మంచి మార్పు...*

ప్రతి అక్క, చెల్లెమ్మ వారి జీవితాల్లో జరిగిన మంచి, మార్పు గురించి ప్రతి మండల మీటింగ్‌లో చెప్తారు. ఈ కార్యక్రమం  రాష్ట్రానికి, సమాజానికి వారి జీవితాల్లో మార్పు ఎలా వచ్చింది అనేది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.75వేలు వైయస్సార్‌ చేయూత ద్వారా ఆర్ధిక సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసా, వాచా, కర్మణా అమలు జరుగుతుంది. నేటితో ప్రతి అక్కచెల్లెమ్మకు మూడో ఏడు వరుసగా రూ.18,750 ఇవ్వడంతో వారి చేతిలో ఈ ఒక్క చేయూత పథకంతో రూ.56,250 పెట్టినట్లవుతుంది. 


*అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగుల కోసం..*

45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ పథకాన్ని తీసుకొచ్చాం. ఈ వయస్సులో ఉన్న అక్కచెల్లెమ్మలు మొత్తం కుటుంబాన్ని తమ భుజాల మీద ఉంచుకుని బాధ్యత తీసుకుంటారు. వాళ్ల చేతుల్లో డబ్బులు పెడితే .. అవి ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడతాయన్న ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. 


*పెన్షన్‌ – జనవరి నుంచి రూ.2750..*

60 సంవత్సరాలు దాటితే ఎలాగూ నెలకు రూ.2500 చొప్పున వైయస్సార్‌ పెన్షన్‌ కానుక వస్తుంది.  ప్రతినెలా ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే వాలంటీర్‌ వచ్చి తలుపుతట్టి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పి.. 60 సంవత్సరాలు దాటిన వారి చేతిలో పెడుతున్నారు. ఆ రూ.2500 కూడా ఈ జనవరి నుంచి రూ.2750 కు పెరుగుతుందని మంచి శుభవార్త తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో చెప్పినట్టుగా రూ.3వేల వరకు తీసుకొని పోతా అన్న మాట మీ బిడ్డ మనసా, వాచా , కర్మణా నెరవేరుస్తాడు.


*అమ్మ కడుపులో బిడ్డ నుంచి ఆశీర్వదించే అవ్వ వరకూ...*

అమ్మ కడుపులో బిడ్డ నుంచి అప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్కచెల్లెమ్మలకు అన్నిదశల్లోనూ అండగా నిలుస్తున్న ప్రభుత్వం మనది.ఈ ప్రభుత్వం మీది. ఇది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం.  వైయస్సార్‌ చేయూత ద్వారా 26,39,703 అక్కచెల్లెమ్మలకు ఈరోజు రూ.4949 కోట్లు ఇస్తున్నాం. ఇది మూడో ఏడాది అందిస్తున్న కార్యక్రమం. ఇవాళ ఇస్తున్న ఈ సొమ్ముతో కలుపుకుంటే ఈ 39 నెలల కాలంలో ఇప్పటివరకు మన ప్రభుత్వం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఈ చేయూత ద్వారా రూ.14,110 కోట్లు అందించాం. 

క్రమం తప్పకుండా వరుసగా ఇప్పటివరకు అదే పేద అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి అందించిన సాయం రూ.56,250.


నాలుగు సంవత్సరాలపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 45–60 సంవత్సరాల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండిని వారు పెన్షన్‌ జాబితాలోకి వెళ్లిపోతారు. కొత్తగా మరలా 45 యేళ్లు నిండిన వారు మరలా ఈ పధకంలోకి చేరుతారు. కొత్తగా చేరిన అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లపాటు రూ.75 వేలు ఇచ్చేట్టుగా ప్రతి ఏడు వారికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం.  


*సాధికారతే లక్ష్యంగా...*

అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం 39 నెలల కాలంగా అడుగులు వేసింది. మనందిరి ప్రభుత్వం కేవలం 4 పథకాలు ద్వారా అందించిన సాయం ఎంతో చెబుతాను.


*జగనన్న అమ్మఒడి*

జగనన్న అమ్మఒడి ద్వారా 44.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వాళ్ల అన్న ఆ పిల్లల  మేనమామగా వారి చదువుల కొరకు... రూ.19,617 కోట్లు ఇచ్చాం.


*వైయస్సార్‌ ఆసరా* 

వైయస్సార్‌ ఆసరా ద్వారా 78.74 లక్షల అక్కచెల్లెమ్మలకు ఈ 39 నెలల కాలంలో రూ.12,758 కోట్లు వారి చేతుల్లో పెట్టాం.రెండు దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మూడో దఫా జనవరి మాసంలో ఇస్తాం. చెప్పిన మాట ప్రకారం నాలుగు దఫాల్లో తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తాం.


*వైయస్సార్‌ చేయూత*

వైయస్సార్‌ చేయూత ద్వారా 26.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు... ఇవాళ ఇస్తున్న మొత్తంతో  కలిపితే రూ.14,111 కోట్లు.

ఆసరాలో ఉన్న కోటి మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ  అక్కచెల్లమ్మలకు తీసుకున్న రుణాల మీద సున్నా వడ్డీ పథకానికి మరో రూ.3515 కోట్లు ఇచ్చాం. కేవలం ఈ నాలుగు పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు ఇప్పటివరకు రూ.51 వేల కోట్లు ఇచ్చాం. 

మొత్తంగా అక్కచెల్లెమ్మలకు డీబీటీ(నేరుగా బటన్‌ నొక్కితే అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లే కార్యక్రమం) ద్వారా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా ఇస్తున్నాం. మొత్తంగా 39 నెలల కాలంలో ఇలా బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా అందించిన సొమ్ము రూ.1,17,667 కోట్లు.

ఇక మొత్తం డీబీటీ చూస్తే... అక్కచెల్లెమ్మలు కాక, అన్నదమ్ములను కలుపుకుంటే ఆ కుటుంబాల అకౌంట్లలో పంపించిన సొమ్ము కూడా చూసుకుంటే.. రూ.1,71,244 కోట్లు. ఎలాంటి వివక్ష, లంచాలు లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందిస్తున్నాం. ఈ మార్పు గమనించండి. 

గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు మధ్య తేడా చూడండి.


*నాన్‌ డీబీటీ చూస్తే....*

నాన్‌ డీబీటీ పథకాలు చూస్తే.. .ఆరు పథకాలు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు కూడా కలుపుకుంటే ఈ 39 నెలల కాలంలో అవి మరో రూ.1.41 లక్షల కోట్లు. 

ఈ డీబీటీ, నాన్‌ డీబీటీ రెండూ కలుపుకుంటే ఈ రోజు ప్రతి కుటుంబానికి ఇచ్చింది లెక్కిస్తే.. రూ.3,12,764 కోట్లు. 

ఇందులో అక్కచెల్లెమ్మలకు మాత్రమేఇచ్చింది చూస్తే...  బటన్‌ నొక్కి ఇచ్చే కార్యక్రమం కాక, ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, జగనన్న తోడు, విద్యా కానుక, వంటి పథకాలను కలుపుకుంటే రూ.2,39,013 కోట్లు అందుతుంది. 


*వైయస్సార్‌ ఇళ్ల పట్టాలు...*

వైయస్సార్‌ జగనన్న ఇళ్ల పట్టాలు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వాళ్ల చేతుల్లో ఇళ్ల పట్టాలు పెట్టాం. మొదటిదశ, రెండో దశ కింద 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ మొత్తం 31 లక్షల ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంటి నిర్మాణం పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల అక్కచెల్లెమ్మల చేతిలో ఇంత విలువైన ఇళ్లు, ఇళ్లపట్టాలు అందించాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది. 


గత పాలనకు ఇప్పటికి తేడా గమనించండి. ఎందుకు చెపుతున్నానంటే.. ఇంతకముందు పరిపాలనలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆ ప్రభుత్వం ఒక బడ్జెట్‌ ఇచ్చేది. అదే బడ్జెట్‌ అదే ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన చేసిన అప్పులు కన్నా ఇప్పుడు మన ప్రభుత్వం ఇంకా తక్కువ అప్పులు చేస్తుంది. అయినప్పటికీ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎందుకు ఇవన్నీ లేవు ?  మీ బిడ్డ ప్రభుత్వంలో ఎలా జరుగుతున్నాయి ? ఆలోచన చేయండి. 


*గతంలో (డీపీటీ )దోచుకో, పంచుకో, తినుకో...*

గతంలో డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో... కార్యక్రమం.. అదీ కేవలం నలుగురు. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు. ప్రజలకు డబ్బులు చేరేది లేదు.  కానీ ఇవాళ మీ బిడ్డ పరిపాలనలో బటన్‌ నొక్కగానే నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో డబ్బులు చేరుతున్నాయి. అందుకే ఈ రోజు మీ బిడ్డ చేయగలుగుతున్నాడు. ఆ రోజు ఆప్రభుత్వం చేయలేక పోయింది.


నాలుగు మాటల్లో చెప్పాలంటే.. ఇది అక్కచెల్లమ్మెల మీద మనందరి ప్రభుత్వానికున్న మమకారం. 

*అక్కచెల్లెమ్మల అదనపు ఆదాయం కోసం....*

చేయూత ద్వారా అందుకునే డబ్బును ఎలా ఉపయోగించుకోవాలన్న స్వేచ్చ పూర్తిగా అక్కచెల్లెమ్మల చేతిలోనే పెట్టాను. ఈ డబ్బుతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ప్రారంభించి నడుపుకోవాలో లేదా జీవనోపాధికి ఆ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలన్నది మీ నిర్ణయమే. ఒకవేళ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్ధికంగా సాధికారత పొందాలనుకుంటున్న అక్కచెల్లెమ్మలకు సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్‌ పరంగా అన్నిసహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అక్కచెల్లెమ్మలకు ఐటీసీ, హిందూస్తాన్‌ లీవర్, పీ అండ్‌ జీ, రిలయెన్స్‌ వంటికార్పొరేట్‌ సంస్ధలతో టైఅప్‌ చేయించి మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు వారికి ఇవ్వడమే కాకుండా, మార్కెటింగ్‌లో శిక్షణ ఇస్తున్నాం. దీంతో పాటు  బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు బ్యాంకులకు అనుసంధానం చేసి.. వారికి ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి జరిగేలా.. తద్వారా ప్రతి అక్క, చెల్లెమ్మ కనీసం రూ.7 నుంచి రూ.10వేలు వరకు ప్రతినెలా అదనపు ఆదాయం సంపాదించుకునే మార్గం ప్రభుత్వం చూపిస్తోంది. 


ఒకవేళ అక్కచెల్లెమ్మలకు ఆవులు, గేదెలు కొనాలన్నా, మేకలు, గొర్రెలు, కొనాలన్న ఆసక్తి ఉంటే.. వారిని ప్రభుత్వం  ప్రోత్సహిస్తోంది. 


*అమూల్‌తో ఒప్పందం.*

ప్రభుత్వం ఇప్పటికే అమూల్‌ సంస్ధతో ఒప్పందం కుదుర్చుకుంది. అమూల్‌ సంస్ధ ద్వారా ప్రతి లీటర్‌ పాలకు గతంలో కన్నా కనీసం రూ.5 నుంచి రూ.15 వరకు అధిక ధరకు కొనుగోలు చేసేటట్టు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మన ప్రభుత్వం అమూల్‌ సంస్ధతో ఒప్పందం చేసుకున్న తర్వాత, అమూల్‌ సంస్ధ రంగప్రవేశం చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ సంస్ద కూడా రేట్లు పెంచక తప్పనిసరి పరిస్థితుల్లోకి పోయింది. ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు సర్వసన్నద్ధంగా ఉంది.


*చేయూత, ఆసరా సాయంతో...* 

మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్సార్‌ఆసరా, వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా అందిన సొమ్ముతో ఇప్పటివరకూ... 1.10 లక్షల మంది అక్కచెల్లెమ్మలు కిరాణాషాపులు పెట్టారు. మరో 60,995 మంది అక్కచెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. 2,96,221 మంది అక్కచెల్లెమ్మలు  ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసి వాటి పెంపకంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

మరో 1,15,446 మంది అక్కచెల్లెమ్మలను ఇతర జీవనోపాధి మార్గాలలో ప్రభుత్వం చేయిపట్టుకుని నడిపిస్తోంది. మొత్తం 5,82,662 మంది అక్కచెల్లెమ్మలకు ఆర్ధిక సాధికారత సాధించేందుకు, జీవనోపాధి పొందేందుకు ఈ పథకాలు ఉపయోగపడ్డాయన్న విషయాన్ని గమనించాలి.

అక్కచెల్లెమ్మలకు జీవనోపాధి కల్పించేందుకు స్త్రీ నిధి, బ్యాంకులు ఇతర ఆర్దిక సంస్ధల నుంచి వారికి రుణాలు వచ్చేట్టు మన ప్రభుత్వం చొరవ తీసుకుంది.


దానివల్ల అక్కచెల్లెమ్మలకు ఇప్పటివరకు రూ.4,369 కోట్లు రుణాలు ఇప్పించి వాళ్ల కాళ్ల మీద నిలబడేట్టు చేశాం. మంచి మనసుతో అక్కచెల్లెమ్మలకు శాశ్వత ఆదాయం రావాలన్న తపన, తాపత్రయంతో మీ ఇంట్లో బిడ్డగా ఆలోచన చేస్తూ అడుగులు వేశాను.


*మీ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్‌– కుప్పానికి నాన్‌ లోకల్‌* 

ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే (చంద్రబాబునాయుడు గారు) గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇక్కడ మీ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్‌. కుప్పానికి నాన్‌ లోకల్‌. కుప్పానికి బాబు ఏం చేశాడంటే చెప్పడానికి లేదు కానీ.. కుప్పానికి ఏం చేయలేదంటే మాత్రం చెప్పడానికి చాలా ఉంది.


*33 యేళ్లు ఎమ్మెల్యేగా చేసిందేంటి ?*

ఈయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 33 సంవత్సారాలు కుప్పం ఎమ్మెల్యే. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది తాను పిండుకున్నాడు, తీసుకున్నాడు కానీ...ఇక్కడ ప్రజలకు ఏం కావాలన్నది మాత్రం ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఏనాడూ కూడా కుప్పం ప్రజలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంలో కరువుకు బాబు పరిష్కారం ఇవ్వలేకపోయాడు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యను పరిష్కరించలేకపోయాడు.


కేంద్రంలో రాష్ట్రపతులను మారుస్తానంటాడు. కేంద్రంలో ప్రధానమంత్రులను కూడా తానే నియమించానని కూడా చెప్పుకుంటాడు. కేంద్రంలో చక్రం తానే తిప్పానని తిప్పే ఈ బాబు నియోజకవర్గంలో పంపును తిప్పితే నీళ్లు వచ్చే పరిస్ధితి కూడా తీసుకుని రాలేకపోయాడు ఈ పెద్దమనిషి.


*కుప్పానికీ నీళ్లూ తేలేదు...*

కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసి కూడా.. అది చేస్తే ఇక ప్రజలు తన మాట వినరని భయపడిపోయాడు. అందుకే హంద్రీనీవా పనులకు కూడా అవరోధంగా తానే మారాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు... చివరకు ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికే ఈ కాంట్రాక్టు వర్కులిచ్చి.. ఆ కమిషన్లు కోసం కక్కుర్తి పడ్డాడే తప్ప కుప్పానికి నిజంగా నీళ్లు తీసుకురావాలని తపన, తాపత్రయం మాత్రం చూపించలేదు.

ఈ పెద్ద మనిషి హయాంలో రూరల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కింద వందల కొద్దీ ట్రాక్టర్లతో తాగునీళ్లు పంపిణీ చేశానని చెప్పి పేర్లు పెట్టుకుని విపరీతంగా దొంగ అకౌంట్లతో దోచేశాడే తప్ప.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజూ కూడా ఆ ట్రాక్టర్లు లేకుండా కుప్పానికి నీళ్లు ఇవ్వగలిగితే ఎంత బాగుంటుందన్న ఆలోచన ఏ రోజూ చేయలేదు. 


*కుప్పంలో రోడ్లనూ వదిలేశారు....*

ఇక కుప్పం రోడ్ల సంగతి కూడా చూస్తే... కృష్టగిరి నుంచి పలమనేరు హైవేకి లింక్‌ ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు, చేయకుండా వదిలేశాడు. కుప్పం మున్సిపాల్టీ పరిధిలో కనీసం డబుల్‌ రోడ్డు కూడా వేయలేకపోయాడు. మలనూరు క్రాస్‌ నుంచి వేపనపల్లె వరకూ అదే పరిస్థితి. అక్కడ కూడా డబుల్‌ రోడ్డు వేయించలేకపోయాడు. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు కూడా లేదు కానీ.. ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు మోసం చేయడంలో మాత్రం ఏకంగా కుప్పంలో విమానాశ్రయం నిర్మించబోతున్నట్టు కుప్పం ప్రజలకు చెవిలో పూలు పెడతాడు. 


*జాబు కావాలంటే బాబు రావాలని అంటాడు...* ఎన్నికలు అయిపోయిన తర్వాత జాబులు ఉండవు, బాబు పట్టించుకోడు. తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి నిత్యం సుమారు5 వేల మంది బెంగళూరు, చెన్నైకి వెళ్తున్నారు. 14 యేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గం నుంచి చెన్నై, బెంగుళూరు వెళ్తున్నా కూడా ఇక్కడ వాళ్లకు ఉద్యోగాలు చూపించాలన్న ఆలోచనే ఈ పెద్దమనిషికి రాదు. 


*రెవెన్యూ డివిజన్‌ కూడా తేలేని బాబు...*

చంద్రబాబు ఏ రోజూ ఈ నియోజకవర్గంలో ఉండడు. ఇక్కడికి రాడు. ఇక్కడి ప్రజలు ఎలా ఉన్నారో పట్టించుకునే పరిస్థితి ఉండదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండేందుకు కుప్పం తనకు సహకరించినా.. చివరకు కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్‌ కూడా ఈ పెద్ద మనిషి ఏర్పాటు చేయలేకపోయాడు. చివరకి ఇక్కడ రెవెన్యూ డివిజన్‌ కావాలని ప్రజలు ఒత్తిడి చేస్తే.. ఇక్కడ రెవెన్యూ డివిజన్‌ పెట్టండని...  తాను జగన్‌కు లేఖ రాస్తాడు. 14 యేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కుప్పం ప్రజలు ఇక్కడ  రెవెన్యూ డివిజన్‌ కావాలని అడిగినప్పుడు తాను 14 సంవత్సరాలు ఆ పని చేయలేకపోయాడు. ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి వస్తే.. జగన్‌కు లేఖ రాస్తాడు. కానీ జగన్‌ మీ వాడు, మంచోడు, మీ బిడ్డ. మీరు అడిగారు, జగన్‌ ఇచ్చాడు. 


ఇంతకంటే చేతగాని నాయకుడు ఎవరైనా ఉంటాడా? లేక చేయకూడదనుకునే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా ? ఆలోచన చేయండని కుప్పంలో అక్కచెల్లెమ్మలను, అన్నదమ్ములను కోరుతున్నాను.

దీనిని చేతగానితనం అని అనాలా ? లేక చేయకూడదన్న దుర్భుర్ధి అనాలా ? అన్నది కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ లేదు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ లేదు. కానీ చంద్రబాబు గారి హయాంలో ప్రతి ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు వేయించుకోవడంలో మాత్రం బాబుకు ఉన్న అనుభవం గురించి ఈ జిల్లాలో అంతా కథలు, కథలుగా చెప్పుకుంటారు.


*బాబు వెన్నుపోటుకు – దొంగ ఓటుకు కేరాఫ్‌ అడ్రస్‌*

వెన్నుపోటుకు, దొంగ ఓటుకు గత 30 యేళ్లుగా కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరూ అంటే.. అది చంద్రబాబు. కుప్పం ప్రజలు ఈయన చేస్తున్న మోసానికి, అన్యాయానికి ఇక తలవంచేది లేదని చెప్పి.. కుప్పం ప్రజలు ఒక్కసారి నిర్ణయించుకుంటే.. అభివృద్ది వైపు  కుప్పం ప్రజలు ఒక్కసారి చూస్తే.. అప్పుడు ఎలా ఉంటుందో.. 2019 ఎన్నికలు తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ, ఎంపీటీసీ ఎన్నికలలోనూ, పంచాయతీ ఎన్నికల్లోనూ చూపించారు. అన్ని ఎన్నికల్లో కూడా కుప్పం ప్రజలు... క్లీన్‌ స్వీప్‌గా  వైయస్సార్స్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. *డీబీటీకి ఓటేసిన కుప్పం..*

ఒక్కమాటలో చెప్పాలంటే.. కుప్పంలో ప్రజలు డీబీటీకి ఓటు వేశారు. జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడు. అక్కచెల్లెమ్మలకు నేరుగా పోతుంది. కుప్పం ప్రజలు చంద్రబాబు డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో కు వ్యతిరేకంగా ఓటు వేశారు. 


33 ఏళ్లుగా గెలిపించినా కూడా కుప్పంలో చంద్రబాబునాయుడు గారికి సొంత ఇళ్లు లేదు. సొంత ఇళ్లు మాట దేవుడెరుగు కనీసం ఓటు కూడా లేదు. ఎందుకంటే కుప్పం తన సొంతమని చెప్పి ఏనాడు చంద్రబాబు భావించలేదు. హైదరాబాదే ఆయనకు ముద్దు అని చంద్రబాబు భావించారు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్‌లో ఇంద్రభవనం కట్టుకున్నాడే కానీ.. కుప్పంలో వచ్చి ఇళ్లు కట్టుకున్న పాపాన పోలదు ఈ చంద్రబాబు.


బీసీలకు న్యాయం చేశామని రెండు రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో పెద్ద, పెద్ద డైలాగులు చెప్పడం చూశాం. ఈయన బీసీలకు న్యాయం చేశానని చెప్తే... నిజంగా ఆశ్చర్యమనిపించింది. నిజానికి చంద్రబాబుకు, బీసీలకు కుప్పం నుంచి మొదలుపెడితే ప్రతిచోటా కూడా అన్యాయమే చేశాడు. ఎందుకంటే కుప్పంలో ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాదిది. కుప్పం బీసీలు సీటు. కుప్పంలో అత్యధికంగా ఉన్నవాళ్లు బీసీలే. అటువంటిది ఈ సీటు బీసీలకు ఇవ్వకుండా... లాక్కున్న ఈ పెద్ద మనిషి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి.


*బాబు మార్క్ సామాజిక న్యాయం...*

తెలుగుదేశంపార్టీ పుట్టిన తర్వాత 1983 నుంచి 2019 వరకూ ఈ 36 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఈ సీటు బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్క్‌ సామాజిక న్యాయం. 

ప్రతి సందర్భంలోనూ, ప్రతి అడుగులోనూ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు అని తపిస్తున్నది ఎవరు ? బీసీలను వాడుకుని వదిలేస్తున్నది ఎవరు ? అని ఆలోచన చేయండి.


*మన పరిపాలనలో కుప్పంలో ఏం జరిగిందో నాలుగు మాటలు చెపుతాను.* 

అధికారంలోకి వచ్చి కేవలం 3 సంవత్సరాల 3 నెలలు మాత్రమే అయింది. అయినా కూడా మరో 6 నెలల్లో హంద్రీనీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పూర్తి చేస్తున్నది మనము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

కుప్పంను మున్సిపాల్టీగా చేసినది మనమూ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుప్పం మున్సిపాల్టీకి రూ.66 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చింది కూడా మీ బిడ్డ.

55 సంవత్సరాలుగా కలగా మిగిలిపోయిన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసింది కూడా మీ బిడ్డే.

రూ.6.50 కోట్లతో రెడ్డిపల్లి, రామకుప్పంలలో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఇచ్చింది కూడా మీ బిడ్డే.

 కొత్తపేట నుంచి డికే పల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి కూడా పూర్తి చేసింది మీబిడ్డే. రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ పూర్తి చేసింది కూడా మీ బిడ్డే. ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీ పనులు పూర్తి చేసింది కూడా మీ బిడ్డే.  కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు నిధులు కేటాయించింది కూడా మీ బిడ్డే. రాళ్లబడుగూరు జూనియర్‌ కాలేజీ పనులకు నిధులిచ్చి పూర్తి చేసింది కూడా మీ బిడ్డే.


*కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడం...*

కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ ఇవేవీ చూడకుండా నవరత్నాలు పథకాలన్నీ కూడా కుప్పంలో అంతా నావాళ్లే అన్న భావనతో అమలు చేశాం కాబట్టే.. ఈ కుప్పం నియోజకవర్గంలో డీబీటీ (అంటే నేరుగా బటన్‌ నొక్కి మీ అకౌంట్లలో డబ్బులు వచ్చే కార్యక్రమం)  ద్వారా రూ.866 కోట్లు ఇచ్చాం. నాన్‌ డీబీటీ ద్వారా ఇళ్లు, ఇళ్ల స్ధలాలు, గోరుముద్ద, సంపూర్ణపోషణం, విద్యాకానుక వంటి 6 పథకాలకు సంబంధించి మరో రూ.283 కోట్లు కుప్పం నియోజకవర్గానికి ఇచ్చాం. మొత్తంగా 39 నెలల కాలంలో ఇంటింటికీ మంచి చేస్తూ... కుప్పం నియోజకవర్గానికి మీ అన్న, మీ తమ్ముడు ఇచ్చింది రూ.1149 కోట్లు. నా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలి, అన్నదమ్ములకు మంచి జరగాలని మనసుతో ఇచ్చింది ఎవరూ అంటే అది మీ బిడ్డ.


ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికన్నా అర్ధం అయ్యేది ఏమిటంటే... చంద్రబాబుకు సొంత మామ మీద ఎలాంటి ప్రేమ  ఉందో ? కత్తి - వెన్నుపోటు. 

కుప్పం మీద కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమ మాత్రమే ఉందన్నది ఆలోచన చేసి జ్ఞాపకంలో పెట్టుకొమ్మని కోరుతున్నాను. సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికి, మనం చూస్తున్న విధానానికి ఉన్న తేడాను ప్రజలందరూ ఇప్పటికే బాగా అర్ధం చేసుకున్నారు. మన దృష్టిలో అన్ని ప్రాంతాల వాళ్లు మనవాళ్లు. అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట.. పిల్లల చదువుల్లో, రైతు ఆదాయాల్లో, అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబనలో, వైద్య ఆరోగ్యరంగలో కనిపించాలి. అవ్వా తాతల సంక్షేమంలో కనిపించాలి. ఇలా అడుగడుగునా ప్రతి కుటుంబానికి అండగా, తోడుగా ఉండే ప్రభుత్వం మీ బిడ్డదని సగర్వంగా తెలియజేస్తున్నాను.


సామాజిక వర్గాల ఆర్తిని, వారికి జరిగిన అన్యాయాన్ని అర్ధం చేసుకున్న ప్రభుత్వం, అర్ధం చేసుకుని అడుగులు వేస్తున్న ప్రభుత్వం, దానికి మంచి చేయాలని అడుగులు వేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డది.


*బీసీలంటే బ్యాక్‌ బోన్ క్లాసులు...*

బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాస్‌లని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే... గతానికి ఇప్పటికీ తేడా చూస్తే అది మీ బిడ్డ ప్రభుత్వమే.

నవరత్నాల పథకాల అమలు మొదలు, డీబీటీతో కలుపుకుని... నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌లో ఇచ్చే కాంట్రాక్టుల వరకు ఏది తీసుకున్నా కూడా ఏకంగా చట్టాలు చేసి, నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు మంచి జరగాలని తపనతో పడుతున్న అడుగులు కనిపిస్తాయి. 

నా అక్కచెల్లెమ్మలు బాగుపడాలని తపన పడుతున్న ఒక అన్న, తమ్ముడు మనసు ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. మరోవైపు చంద్రబాబు గారిని చూడండి.. అప్పట్లో తనకు కావాల్సిన ఆ నలుగురిని మాత్రం చూసుకుంటే చాలని అడుగులు పడ్డాయి. ఆ ఒక్క ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు వీరిని చూసుకుంటే చాలు.. ఇక ఎవ్వరూ రాయరు, ఎవ్వరూ చూపరు, అన్యాయం ప్రజలకు జరుగుతున్నా గాలికి వదిలేయెచ్చు అన్న పద్ధతితిలో ఆ పాలన జరిగింది. తేడా గమనించండి.


*భరత్ మీ బిడ్డ*

ఈ రోజు భరత్‌ నా కళ్లెదుటనే ఉన్నాడు మీ బిడ్డ. బీసీ అని సగర్వంగా తెలియజేస్తున్నా. ఈ బిడ్డని గెలిపించండి. గెలవకుండానే ఎమ్మెల్సీగా ఉంటూనే కుప్పానికి ఇవన్నీ కూడా నాతో చేయించాడు. ఇక ఈ బిడ్డను గెలిగించండి. ఈ బిడ్డను మీకు మంత్రిగా పంపిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఈ బిడ్డ మీ బిడ్డ, ఇది మీ ప్రభుత్వం అన్నది మాత్రం గుర్తుపెట్టుకొండి.


దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మీకు మంచి చేసే పరిస్థితులు, రోజులు రావాలని మనసాగా కోరుకుంటున్నాను.


*నియోజకవర్గం అభివృద్దిపై...*

కాసేపటి క్రితం మంత్రి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌ కుప్పానికి ఇంకా చేయాల్సిన పనులు గురించి అడిగారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌–2 లో భాగంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ని మరో 6 నెలలలో పూర్తి చేసి ప్రారంభించాలని అడిగారు. అది చేస్తాను. గుడిపల్లె మండలం యామిగానిపల్లె వద్ద 0.77టీఎంసీలతో, శాంతిపురం మండలం మదినేపల్లి వద్ద మరో 0.3టీఎంసీలతో మొత్తం 1 టీఎంసీల సామర్ధ్యంతో 2 రిజర్వాయర్లను రూ.250 కోట్లతోమంజూరు చేయాలని అడిగారు. ఈ రెండు రిజర్వాయర్లను మంజూరు చేస్తున్నాను. పాలార్‌ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ, పర్యావరణ సమస్యలున్న సంగతి మీకు అందరికి తెలుసు. కోర్టుల వరకు వెళ్లిన సంగతీ మీకు తెలుసు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కూడాచంద్రబాబునాయుడు.. ఆ సమస్యలకు పరిష్కారం తీసుకురాలేకపోయాడు. కారణం వాటినిపరిష్కరించాలన్న తపన, తాపత్రయం లేకపోవడమే. ఈ ప్రాజెక్టుకు కూడా శాయుశక్తులా మీ బిడ్డ కృషి చేస్తాడు. దీనికి రూ.120 కోట్లు అవుతుంది. ఆ ఖర్చు చేసి వీలైనంత వేగంగా సమస్యలన్నీ తీరుస్తాను. కుప్పం మున్సిపాల్టీకి రూ.66 కోట్లు మంజూరు చేశాం. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మిగిలిన 4 మండలాల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కావాలని భరత్‌ అడిగాడు. అవి కూడా ఇస్తానని హామీ ఇస్తున్నాను. అన్ని విధాల కుప్పం నియోజకవర్గానికి తోడుగా ఉంటాం. కుప్పం నియోజకవర్గాన్ని నా నియోజకవర్గంగా భావిస్తాను. 


*చివరిగా...*

ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ..అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ... సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image